విశాలాంధ్ర, ఉరవకొండ (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న ఉరవకొండ మండలం పెన్నహోబిలంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల ఆరంభంతో క్షేత్రం మొత్తం భక్తులతో కిక్కిరిసి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడపట ధ్వజారోహణం బుధవారం వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముందు అర్చకులు ప్రధాన ఆలయంలోని మూలవిరాట్‌తో పాటు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల మధ్య గరుడపటాన్ని ఆలయ ధ్వజస్తంభంపై ఎగురవేశారు. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుడి పటానికి ప్రత్యేక పూజలు చేయడం ద్వారా బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని సూచిస్తూ, దేవతలకు మరియు భక్తులకు శుభసూచకంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అర్చకులు తెలిపారు. తదుపరి శ్రీదేవి, భూదేవి సమేతంగా స్వామివారిని పల్లకిలో ఊరేగించి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ వేడుకలో ఆలయ చైర్మన్ రాయంపల్లి నాగరాజు, కార్యనిర్వాహణాధికారి సాకే రమేష్ బాబు, ప్రధాన అర్చకులు ద్వారాకనాథ్, మయూరం బాలాజీ స్వామి, పాలక మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది మరియు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


