పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా – Visalaandhra


విశాలాంధ్ర-సత్యవేడు:పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు స్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి వున్నామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం శ్రీసిటీని సందర్శించిన మంత్రికి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు.అనంతరం ఏపీఎస్పీడీసీఎల్ సీఎండి శివశంకర్తోటి ఏపీ ట్రాన్స్కో డైరెక్టర్ భాస్కర్,ఇతర విద్యుత్ అధికారులతో కలసి శ్రీసిటీ బిజినెస్ సెంటర్ లో ఏర్పాటు చేసిన పరిశ్రమల ప్రతినిధులు శ్రీసిటీ యాజమాన్యంతో పరస్పర చర్చా సమావేశంలో మంత్రి పాల్గొని,పలు కీలక విద్యుత్ సమస్యలపై చర్చించారు.ఈ సందర్భంగా డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి మాట్లాడుతూ శ్రీసిటీలోని కొల్లడం వద్ద  ఏపీ ట్రాన్స్కో నిర్మిస్తున్న 132/33 కెవి సబ్‌స్టేషన్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని మంత్రికి విన్నవించారు.ఎల్జి ఎలక్ట్రానిక్స్,క్యారియర్,పీజీ ఎలెక్ట్రోప్లాస్ట్ తదితర ప్రముఖ పరిశ్రమలు ఉత్పత్తులకు సిద్ధమవుతున్న నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా అత్యంత కీలకమని పేర్కొన్నారు. శ్రీసిటీ విస్తరణ దృష్ట్యా జపాన్ క్లస్టర్ సమీపంలో మరో సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయడం వ్యూహాత్మక అవసరమని ఆయన వివరించారు.శ్రీసిటీలోని పరిశ్రమలు యేటా విద్యుత్ బిల్లుల రూపంలో సుమారు 500 కోట్ల రెవిన్యూను అందిస్తున్నాయని తెలిపారు.అలాగే విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు రాష్ట్రానికి గణనీయమైన జిఎస్టి ఆదాయం,దేశీయ జీడీపి పెంపుకు సహకరిస్తున్నాయని చెప్పారు.విద్యుత్ మౌళిక వసతులను బలోపేతం చేస్తే రాష్ట్ర పారిశ్రామిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని,పెట్టుబడులకు అనుకూల గమ్యస్థానంగా రాష్ట్రం మరింత ఆకర్షణీయంగా నిలుస్తుందని డా.సన్నారెడ్డి స్పష్టం చేశారు.శ్రీసిటీలోని ఐమాప్,థర్మాక్స్,ఇసుజు,కోబెల్కో, ఆక్సీలెంట్ ఫార్మా,బ్రేక్స్ ఇండియా,ఐసన్ తదితర పరిశ్రమల ప్రతినిధులు మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో అంతరాయాల తగ్గింపు,స్థిరమైన విద్యుత్ సరఫరాకు చర్యలు తీసుకోవాలని కోరారు.సోలార్ టారిఫ్‌లలో సవరణలు సోలార్ ఇన్‌స్టాలేషన్ సామర్థ్య విస్తరణకు అనుమతులు,11 కెవి లైన్లలో తరచూ జరుగుతున్న అంతరాయాల పరిష్కారం,రూఫ్‌టాప్ సోలార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు గ్రీన్ టారిఫ్ ప్రోత్సాహకాల పంపిణీ వంటివి సూచించారు. పర్యావరణ హిత విద్యుత్ ఉత్పత్తిని పెంపొందించడానికి పరిశ్రమల స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడానికి ఈ చర్యలు అవసరమని వారు పేర్కొన్నారు.శ్రీసిటీ యాజమాన్యం చేపడుతున్న చురుకైన చర్యలను ప్రశంసించిన మంత్రి,పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ టారిఫ్‌ల తగ్గింపు వంటి అంశాలతో పాటు సమస్యల వేగవంతమైన పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని హామీ ఇచ్చారు.విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు అదనపు స్విచ్చింగ్ స్టేషన్లు ఏర్పాటు ప్రత్యామ్నాయంగా భాస్కర్ సూచించారు. శ్రీసిటీలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి పరిశ్రమలతో ప్రతి నెల సమావేశాలు నిర్వహిస్తామని  శివశంకర్ స్పష్టం చేశారు. అదనపు సబ్‌స్టేషన్ ఏర్పాటుకు ప్రాథమిక పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. గ్రీన్ టారిఫ్ ప్రోత్సాహకాల అంశాన్ని పాలసీ స్థాయిలో పరిశీలిస్తామని చెప్పారు.తమ సమస్యలను శ్రద్ధగా విని, సానుకూల హామీలు ఇవ్వడం పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్,మంత్రి, ఉన్నతాధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *