హైదరాబాద్: టాలీవుడ్లో రెండు క్రేజీ ప్రాజెక్టులు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమయ్యాయి. ఒకటి విజయ్ దేవరకొండది కాగా మరొకటి బెల్లంకొండ గణేశ్ది. నాని హీరోగా తెరకెక్కించిన ‘హాయ్ నాన్న’తో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా మెప్పించారు శౌర్యువ్. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా శౌర్యువ్ తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ప్రారంభమైంది. నాని ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టారు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్గా మారాయి. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సమయంలో నాని, విజయ్ ఎంత స్నేహంగా ఉండేవారో ఇప్ప్పుడూ అలాగే ఉన్నారంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మాస్ అంశాలతో విభిన్న కథతో రూపొందుతున్న ‘వీడీ శౌర్యువ’ (వర్కింగ్ టైటిల్) చిత్రానికి హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ అలెజాండ్రో మార్టినెజ్ పనిచేస్తున్నారు. పలు హాలీవుడ్ మూవీలకు పని చేసిన ఎరిక్ ఈ సినిమాకి వీఎఫఎక్స్ సూపర్ వైజర్. హీరోయిన్ వివరాలు ఇంకా వెల్లడించలేదు. ఇది కాకుండా మరో రెండు సినిమాల్లో బిజీగా ఉన్నారు విజయ్. రాహుల్ సాంకృత్యాన్ డైరెక్షన్లో ‘రణబాలి’, రవికిరణ్ కోలా దర్శకత్వంలో ‘రౌడీ జనార్ధన’లో నటిస్తున్నారు.
బెల్లంకొండ గణేశ్ చిత్రానికి వి.వి.వినాయక్ క్లాప్
నిర్మాత బెల్లంకొండ సురేశ్ తనయుడు గణేశ్ హీరోగా నటిస్తోన్న చిత్రానికి ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ క్టాప్ కొట్టి ముహూర్తపు సన్నివే శాన్ని ప్రారంభించారు. ‘తొలిప్రేమ’, ‘డార్లింగ’ వంటి విజయవంతమైన చిత్రాలు తెరకెక్కించిన డైరెక్టర్ కరుణాకరన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు 8 ఏళ్ల విరామం అనంతరం ఆయన కొత్త సినిమాని ప్రారంభించారు. మరో దర్శకుడు అనుదీప్ కేవీ ఈ సినిమాకి డైలాగ్స్ రాస్తుండటం విశేషం. భీమ్స్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. రొమాంటిక్ కామెడీ నేపథ్య కథతో సాగే సినిమా ఇది. ఇంతకుముందు గణేశ్ ‘స్వాతిముత్యం’ తదితర చిత్రాల్లో నటించారు.


