Last Updated:
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వైశాఖంలో 13 రోజుల బ్రహ్మోత్సవాలు ప్రారంభం, అఖండ దీపారాధన, విశేష ధ్వజస్తంభం భక్తులను ఆకర్షిస్తున్నాయి
అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలోని బజారు వీధిలో వెలసిన అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తుల విశ్వాసానికి నిలయంగా నిలుస్తోంది. ఈ స్వామిని ఆరాధిస్తే మృత్యు గండాలు తొలగిపోతాయని స్థానికులు విశ్వసిస్తున్నారు. ప్రత్యేకంగా అఖండ దీపం వెలిగిస్తే జీవనంలో ఉన్న అడ్డంకులు, అపశకునాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. అందుకే ఈ ఆలయానికి దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు తరలివస్తున్నారు.
ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. పుంగనూరు జమిందార్ ఇమ్మడి చిక్కరాయులకు స్వయంగా పరమశివుడు కలలో దర్శనమిచ్చి ఈ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడని కథనం ఉంది. ఆ ఆజ్ఞ మేరకు ఆయన 1676 కాలంలో, క్రీ.శ. 1793లో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి ఈ ఆలయం భక్తి కేంద్రంగా కొనసాగుతోంది.
ఈ ఆలయంలో అఖండ దీపారాధనకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మృత్యు దోషాలు, గండాలు ఉన్నవారు దీపం వెలిగిస్తే సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. సినీ గాయకుడు మంటసాల కొంతకాలం గాత్ర సమస్య ఎదుర్కొన్నప్పుడు ఇక్కడ వారం రోజుల పాటు కచేరి, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్న తర్వాత ఆయన గాత్రం మామూలు స్థితికి వచ్చిందని పెద్దలు చెబుతారు. అలాగే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి వెంకట నారాయణ భట్ ప్రతి సంవత్సరం కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి పూజలు చేసి, కేవలం బిల్వపత్రాన్ని ప్రసాదంగా స్వీకరిస్తారన్నది ఈ ఆలయ ప్రాధాన్యాన్ని తెలియజేస్తోంది.
ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో 13 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. ఈసారి మంగళవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. 21న గణపతి ప్రార్థనతో అంకురార్పణ, 22న ధ్వజారోహణం, సింహవాహనం, 23న యాళీ వాహనం, 24న శేషవాహనం, 25న రావణ వాహనం, 26న నంది వాహనం, 27న కల్యాణోత్సవం, 28న రథోత్సవం, 29న అశ్వవాహనం, 30న హంసవాహనం, ధ్వజావరోహణం నిర్వహించనున్నారు. మే 1, 2 తేదీల్లో శయనోత్సవం, 3న ఉంజల సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఈ ఉత్సవాలను తిలకించేందుకు ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. ముఖ్యంగా దీపారాధనకు ఇక్కడ అపారమైన విశ్వాసం ఉంది. భక్తుల పేర్లపై దీపాలు వెలిగించి, చివరి రోజు వారి కుటుంబాల పేర్లతో అభిషేకాలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఇక్కడికి వచ్చి ప్రార్థనలు చేస్తే ఆరోగ్యం మెరుగవుతుందని భక్తులు విశ్వసిస్తున్నారు.
ఇక్కడి మరో విశేషం ధ్వజస్తంభం. ఈ ఆలయంలో ఉన్న ధ్వజస్తంభం ప్రపంచంలో ఎక్కడా లేనిదిగా చెబుతున్నారు. ఎలాంటి ఆధారం లేకుండా స్వయంగా నిలబడి ఉన్న ఈ ధ్వజస్తంభం భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. ఈ విధంగా చారిత్రక ప్రాధాన్యం, ఆధ్యాత్మిక విశ్వాసాలు, ప్రత్యేక ఆచారాలతో అభీష్టదా మృత్యుంజయేశ్వరస్వామి ఆలయం భక్తులకు విశేష ఆకర్షణగా నిలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Chittoor,Chittoor,Andhra Pradesh



