రక్తహీనత భయపెడుతోంది – Visalaandhra


*ఆకలి తీరని పేదరికం
*అందని పౌష్టికాహారం

                    (విశాలాంధ్ర - చిత్తూరు)

ఒకవైపు దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని పాలకులు గంభీర ప్రకటనలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో పేదవాడి పరిస్థితి మాత్రం ‘అడియాస’గానే మారుతోంది. చిత్తూరు జిల్లాలో ముఖ్యంగా మహిళలు, పసిపిల్లలను రక్తహీనత భూతం నీడలా వెంటాడుతోంది. పౌష్టికాహార లోపం, పేదరికం తోడై పేదల జీవితాలను చిదిమేస్తోంది. ఇటీవల వెలువడిన 2025-26 గణాంకాలను పరిశీలిస్తే జిల్లాలో పరిస్థితి ఎంత భయానకంగా ఉందో అర్థమవుతోంది.

గణాంకాలు చెబుతున్న చేదు నిజాలివీ…

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన స్క్రీనింగ్ పరీక్షల వివరాలు గమనిస్తే, రక్తహీనత ఏ ఒక్క వయసుకో పరిమితం కాలేదని స్పష్టమవుతోంది. 5 నుంచి 10 ఏళ్ల లోపు పిల్లలు జిల్లాలో 53,173 మంది చిన్నారులు ఉండగా, కేవలం 31,816 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో 10,284 మంది (32.32శాతం) రక్తహీనతతో బాధపడుతున్నట్లు తేలింది. 10 నుంచి 19 ఏళ్ల లోపు కిశోర బాలబాలికలు 87,028 మందికి గాను 46,165 మందికి పరీక్షలు చేయగా, 10,830 మంది (24శాతం) బాధితులుగా తేలారు. మహిళలు, గర్భిణులు పరిశీలిస్తే… అత్యంత ఆందోళనకరమైన విషయం ఇక్కడే ఉంది. జిల్లాలో 1,61,127 మంది మహిళలు ఉండగా, 1,47,632 మందికి పరీక్షలు చేయగా.. ఏకంగా 63,697 మంది (44శాతం) రక్తహీనతతో కునారిల్లుతున్నారు.

పేదరికం తెచ్చిన ముప్పు

రక్తహీనత అనేది కేవలం ఒక ఆరోగ్య సమస్య కాదు, అది పేదరికం యొక్క ప్రత్యక్ష ప్రతిబింబం. జిల్లాలో కూలీ పనులకు వెళ్లే పేద కుటుంబాల్లో సరైన ఆహారం దొరకడమే గగనమైపోతోంది. ఒక పూట గడవడమే కష్టమైన పరిస్థితుల్లో ‘పౌష్టికాహారం’ అనేది వారికి అందని ద్రాక్షే. రక్తహీనత కారణంగా గర్భిణులు ప్రసవ సమయంలో ప్రాణాపాయ స్థితికి చేరుకుంటున్నారు. బలహీనమైన తల్లుల నుంచి పుట్టే బిడ్డలు కూడా తక్కువ బరువుతో, అనారోగ్యంతో పుడుతున్నారు. ఇది భావి భారత పౌరులను నిర్వీర్యం చేసే ప్రమాదకర పరిణామం. చిన్నారులు రక్తహీనత వల్ల శారీరక ఎదుగుదల లేక, మేధోపరంగా వెనుకబడిపోతున్నారు. ఆడుకోవాల్సిన వయసులో నీరసంతో బిక్కచచ్చిపోతున్న ఈ చిన్నారుల పరిస్థితి సమాజం ఆలోచించాల్సిన విషయం. రేపటి తరానికి మనం అందిస్తున్న ఆస్తి రోగగ్రస్థమైన శరీరాలేనా? అనే ప్రశ్న ఇక్కడ ఉదయిస్తోంది.

పాలకుల నిర్లక్ష్యం

‘ఎనీమియా ముక్త్ భారత్’ వంటి ఆకర్షణీయమైన పేర్లతో పథకాలు ఉన్నప్పటికీ, అవి పేదవాడి ఇంటి గడపను ఎంతవరకు చేరుతున్నాయన్నది ప్రశ్నార్థకమే. అంగన్‌వాడీల ద్వారా పంపిణీ చేసే పోషకాహారం నాణ్యతపై నిత్యం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. పంపిణీ చేసే ఐరన్ సిరప్‌లు, మాత్రల కన్నా.. పేదవాడి కడుపు నింపే బలమైన ఆహారం అందించడంలో పాలకులు విఫలమవుతున్నారు. కార్పొరేట్ శక్తులకు రూ.వేల కోట్లు ధారపోసే పాలకులు, పేదవాడి ఆరోగ్యానికి అవసరమైన బడ్జెట్‌ను కేటాయించడంలో వివక్ష చూపుతున్నారు. పరీక్షలు చేయడం, మాత్రలు పంపిణీ చేయడం కేవలం పైపై మెరుగులు మాత్రమే. అసలైన మూల కారణమైన ఆకలి, పౌష్టికాహార లోపాన్ని రూపుమాపకుండా రక్తహీనతను పారద్రోలలేరు. గ్రామాల్లోని ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు తమ వంతు ప్రయత్నం చేస్తున్నా, పాలకుల నుంచి అందాల్సిన పూర్తిస్థాయి సహకారం, నిధుల కొరత ఈ కార్యక్రమాలను కుంటుపరుస్తోంది.

ప్రమాదంలో భావిభారతం

భవిష్యత్తు సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే మహిళలు, చిన్నారుల ఆరోగ్యంపై తక్షణమే దృష్టి సారించాలి. కేవలం అంకెల్లో చూపించే గణాంకాలు కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రతి పేదవాడికి పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలి. పాలకుల నిర్లక్ష్యం వీడితేనే… చిత్తూరు జిల్లాలో రక్తహీనత రక్కసిని తరిమి కొట్టడం సాధ్యమవుతుంది. లేనిపక్షంలో బలహీనమైన శరీరాలతో కూడిన ఒక నిస్సహాయ తరం తయారయ్యే ప్రమాదం పొంచి ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *