మరాఠ్వాడ నుండి కర్ణాటక, రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు ఒక ద్రోణి విస్తరించి ఉంది. దీని ప్రభావంతో వాతావరణంలో అనిశ్చితి నెలకొంది. దీని కారణంగా శనివారం (18-04-26) నాడు ఈ క్రింది జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా. పోలవరం, విశాఖపట్నం. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాలు.
ముఖ్యంగా ఈ వర్షాలు పిడుగులతో కూడి ఉండే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, గొర్రెల కాపరులు లేదా పశువులను మేపే వారు పొరపాటున చెట్ల కింద ఆశ్రయం పొందకూడదు. పిడుగులు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండటం ప్రాణాంతకమని ఎండీ గుర్తుచేశారు.
ఒకవైపు వర్ష సూచన ఉన్నప్పటికీ, రాష్ట్రంలోని మెజారిటీ జిల్లాల్లో ఎండల తీవ్రత భయంకరంగా ఉంది. శుక్రవారం నాడు రాష్ట్రంలోనే అత్యధికంగా కడపలో 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 299 మండలాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్కును దాటడం గమనార్హం.
జిల్లాల వారీగా 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన మండలాల వివరాలు: కడప: 39 మండలాలు, నంద్యాల: 29 మండలాలు, కర్నూలు: 26 మండలాలు, అనంతపురం: 24 మండలాలు, తిరుపతి: 23 మండలాలు, ప్రకాశం, పల్నాడు: తలో 19 మండలాలు, అనంతపురం తాడిపత్రిలో 44.1°C, నెల్లూరు సైదాపురంలో 43.8°C చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ గణాంకాలు రాష్ట్రంలో ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో స్పష్టం చేస్తున్నాయి.
వడగాల్పుల హెచ్చరిక: శనివారం నాడు కొన్ని ప్రత్యేక మండలాల్లో తీవ్ర వడగాల్పులు, సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. మన్యం జిల్లాలోని సీతంపేట మండలంలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి.
విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, రాజాం, బాడంగి, పార్వతీపురం మన్యం జిల్లాలోని బలిజిపేట, సాలూరు, కురుపాం వంటి 27 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుంది. అల్లూరి జిల్లాలోని జికే వీధి, ఏలూరులోని వేలేరుపాడు మండలాల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన ఎండలు వేడి గాలుల నేపథ్యంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవాలని ప్రఖర్ జైన్ సూచించారు.
అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం వేళల్లో బయటకు రావద్దు. ఒకవేళ వెళ్లాల్సి వస్తే, వేడి గాలి చెవుల్లోకి వెళ్లకుండా తలకు టోపీ లేదా కర్చీఫ్ కట్టుకోవాలి. ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. మంచినీటితో పాటు నిమ్మరసం, మజ్జిగ, కొబ్బరి నీళ్లు తాగుతూ శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి.
గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు, షుగర్ మరియు బీపీ రోగులు ఎండ దెబ్బకు త్వరగా గురయ్యే అవకాశం ఉన్నందున వారు ఇంటిపట్టునే ఉండటం శ్రేయస్కరం. వాతావరణంలో మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ, ప్రభుత్వ అధికారుల సూచనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది.


