Last Updated:
Viral Video: పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారు.
Viral Video: పార్లమెంట్లో అమరావతి రాజధాని బిల్లును ఆమోదించిన అనంతరం జరిగిన సంబరాల్లో అలజడి నెలకొంది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను లైంగికంగా వేధించారని ఆరోపించిన ఒక మహిళపై జనసేన నాయకులు దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై సదరు మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి ప్రభుత్వ ఉద్యోగిగా ఉన్న మహిళ తన న్యాయవాది ఆజాద్ సాయి కృష్ణ సోదరుడైన గోపితో కలిసి పట్టణంలోని ఒక టోల్ గేట్ ప్రాంతానికి వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది. అరవ శ్రీధర్‌పై లైంగిక వేధింపుల కేసు పెట్టిన మహిళను, లాయర్ సోదరుడ్ని చూసిన జనసేన నాయకులు, కార్యకర్తలు వారిని వెంబడించి దాడి చేశారు. పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ వారు రోడ్డుపై బీభత్సం సృష్టించారు. ఈ దాడికి సంబంధించిన పూర్తి వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఇంకా విచిత్రం ఏమిటంటే సదరు మహిళపై దాడి చేస్తున్న సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నట్లుగా తెలుస్తోంది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ నాయకుడు అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణల కేసు తుది దశకు చేరకముందే, మరో ఫిర్యాదు దాఖలైంది. అరవ శ్రీధర్‌పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళా ఉద్యోగిపై, ఆమె లాయర్ సోదరుడు గోపితో కలిసి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అనుచరులు, జనసేన నాయకులు రోడ్డుపై దాడి చేశారు. మహిళ వెంట ఉన్న లాయర్ ఆజాద్ సాయి కృష్ణ సోదరుడు గోపిని జనసేన నేతలు, కార్యకర్తలు రోడ్డుపై తరుముతుండగా తాతంశెట్టి నాగేంద్ర పోలీసు లాఠీని లాక్కుని ఆ మహిళపై దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
ఈ ఘటనను చిత్రీకరిస్తున్న ఒక జర్నలిస్టుపై కూడా దాడి చేసి, వీడియోను తొలగించమని బలవంతం చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అక్కడే ఉన్నారు. ఈ విషయంపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాడి చేసిన వారిలో జనసేన రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేందర్, రైల్వే కోడురు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తో పాటు పట్టణ జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లుగా వీడియోలు చూస్తే అర్దమవుతోంది.
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై గతంలో సోషల్ మీడియాలో, మీడియాలో లైంగిక వేధింపుల ఆరోపణలు, పోలీసు కేసులు సంచలనం సృష్టించాయి. జనసేన ఎమ్మెల్యే తనను మోసం చేశారంటూ హర్ష వీణ అనే మహిళ అప్పట్లో కొన్ని వీడియోలు, ఫోటోలు బయటపెట్టారు. ఇది చాలదంటూ బుధవారం ప్రజా దర్బార్‌లో టీడీపీ నాయకులకు మరోసారి ఫిర్యాదు చేశారు. అరవ శ్రీధర్‌ను జనసేన పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంచినప్పటికీ, ఆయన ఇప్పటికీ పార్టీ కండువా ధరించి తిరుగుతున్నారని ఆమె లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించాలని, తనకు న్యాయం జరగాలని హర్షవీన మరోసారి డిమాండ్ చేశారు. 24 గంటల వ్యవధిలో ఈ రెండు పరిణామాలు చోటుచేసుకోవడంతో, రైల్వే కోడూరు ఎమ్మెల్యే మరోసారి వార్తల్లో నిలిచారు.
Tirupati,Chittoor,Andhra Pradesh
Apr 03, 2026 11:28 AM IST


