Last Updated:
Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించగా, శ్రీకృష్ణుడిని తమతో రావలసిందిగా కోరినట్లు చెబుతారు.
Sri Rama Navami: ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన రామ తీర్థాలు క్షేత్రానికి సంబంధించిన పురాణ ప్రాశస్త్యం విశేషమైనది. ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించగా, శ్రీకృష్ణుడిని తమతో రావలసిందిగా కోరినట్లు చెబుతారు. అయితే శ్రీకృష్ణ పరమాత్మ తన పూర్వావతారమైన శ్రీ సీతారామ లక్ష్మణుల విగ్రహాలను పాండవులకు అందించి వాటిని ఆరాధించమని సూచించాడని పురాణగాథ. అనంతరం 16వ శతాబ్దంలో పూసపాటి సీతారామచంద్ర మహారాజుకు స్వప్నంలో శ్రీరాముడు దర్శనమిచ్చి, ఆ విగ్రహాలు భూగర్భంలోని నీటిమడుగులో ఉన్నాయని తెలియజేసినట్లు చెబుతారు. మహారాజు వాటిని వెలికితీసి దేవాలయాన్ని నిర్మించగా, నీటితీర్థంలో దొరికిన కారణంగా ఈ ప్రాంతానికి “రామతీర్థం” అనే పేరు వచ్చింది అని ఆలయ అర్చకులు తెలిపారు.
ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండలంలోని రామతీర్థం గ్రామంలో వెలసిన శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం నుంచి శ్రీరామనవమి వేడుకలు ప్రారంభమైన భక్తుల ఆధ్యాత్మికోత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఆలయ స్థానాచార్యులు, అర్చకులు తెలిపారు. ప్రతిరోజూ వివిధ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆలయ పరిసరాలు భక్తులతో కళకళలాడుతున్నాయి. ఆలయంలో సుందరకాండ పారాయణం, దివ్యప్రబంధ సేవలు, లక్ష తులసి అర్చనలు, కుంకుమార్చనలు, ప్రత్యేక హోమాలు, పారాయణాలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఈ నెల 26వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
శ్రీరామనవమి రోజు 27వ తేదీన తెల్లవారుజామున 3 గంటల నుంచి ప్రత్యేక పూజలు ప్రారంభమవుతాయి. స్వామివారికి అభిషేకాలు, బాలభోగం, తీర్థగోష్టి, అవతారోత్సవ వేడుకలు జరుగుతాయి. అనంతరం సీతారామలక్ష్మణులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, ఫలరసాలు, నదీజలాలతో అష్టకలశ స్నపన మహోత్సవాలు నిర్వహిస్తారు. ఉదయం 10:30 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం ప్రారంభమై, అభిజిత్ లగ్నంలో మధ్యాహ్నం 12 గంటలకు జీలకర్ర బెల్లం సమర్పణ, మాంగల్యధారణ, తలంబ్రాల కార్యక్రమాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.తదుపరి రోజు 28వ తేదీన దశమి సందర్భంగా శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించి మహోత్సవాలకు ముగింపు పలుకుతారు.
ఆలయంలో వైఖానస ఆగమ విధానంలో అన్ని పూజలు నిర్వహిస్తున్నట్లు స్థానాచార్యులు తెలిపారు.
ఈ సందర్భంగా ఆలయ ఈవో వై. శ్రీనివాసరావు మాట్లాడుతూ, ఉత్తరాంధ్ర ప్రాంతం నలుమూలల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి ఈ పవిత్రోత్సవాల్లో పాల్గొనాలని కోరారు. కళ్యాణోత్సవంలో పాల్గొనదలచిన దంపతులు రూ.1500 టికెట్ తీసుకోవచ్చని, ఆలయం వద్ద అలాగే ఆన్‌లైన్ ద్వారా టికెట్లు లభ్యమవుతాయని తెలిపారు. పాల్గొనే భక్తులకు శేషవస్త్రాలు, ప్రసాదం అందజేస్తామని ఆయన వెల్లడించారు.
ఈ విధంగా రామతీర్థం క్షేత్రంలో జరుగుతున్న శ్రీరామనవమి వేడుకలు భక్తి, సంప్రదాయాల సమ్మేళనంగా నిలుస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Vizianagaram,Andhra Pradesh


