భారత్ దౌత్యం పై విమర్శలు – Visalaandhra


అసద్ మిర్జా

అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేసిన దాడులు భారతదేశాన్ని క్లిష్టపరిస్థితిలోకి నెట్టేశాయి. దౌత్యపరంగా కూడా భారత్ ఇప్పుడు అష్టకష్టాలు పడుతోంది. ఒకవైపు ఇరాన్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. మరోవైపు భారత్ వైఖరిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. “వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి “ అంటూ గొప్పలు చెప్పుకున్న భారత్ ఈ సంక్షోభం సమయంలో మాత్రం స్పష్టమైన వైఖరి చూపలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్లోబల్ శక్తిగా నిలవాలంటే, భారత్ మరింత స్పష్టతతో సమగ్ర విధానంతో ముందుకు వెళ్ళాలి. కానీ భారత్ అలా చేయడం లేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులపై భారత్ వైఖరి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే మార్చి 1 నుంచి 3 మధ్య ప్రధానమంత్రి నరేంద్రమోదీ యుఏఈ అధ్యక్షుడు, సౌదీ రాజు, బహ్రెయిన్ రాజు, ఒమన్ సుల్తాన్, కువైట్ రాజు, ఖతర్ నాయకులతో ఫోన్‌లో మాట్లాడి వారి దేశాలపై జరిగిన దాడులను ఖండించారు. మార్చి 2న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ, జోర్డాన్ రాజు అబ్దుల్లా 2తో మాట్లాడి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. కానీ దాడులకు గురైన ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసూద్ పెజెష్కియన్‌తో మాత్రం సంప్రదింపులు జరపలేదు. ఫిబ్రవరి 28న ఇరాన్‌లోని మినాబ్ నగరంలో బాలికల పాఠశాలపై దాడి జరిగి 175 మంది, అందులో 166 మంది విద్యార్థినులు మరణించారు. ఐతే మార్చి 12న విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ పిల్లల ప్రాణనష్టం పట్ల సంతాపం వ్యక్తం చేశారు. కానీ ఆ రోజు మోదీ పిల్లల ఘటన మీద స్పందించకుండా ఇరాన్ అధ్యక్షుడితో మాట్లాడి ఆయన పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. చిన్నారుల మృతి ఘటనపై భారత్ తీరిగ్గా 13 రోజుల తర్వాత స్పందించింది. భారత్ ప్రదర్శించిన ఈ వైఖరి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదిలా ఉండగా, ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసేయడంతో భారత్‌లో ఇంధన సరఫరా సమస్యలు తలెత్తాయి. భారతదేశం దిగుమతి చేసుకునే గ్యాస్‌లో సుమారు 90%, క్రూడ్ ఆయిల్‌లో 45% ఈ మార్గం ద్వారానే వస్తుంది. ఖతర్ గ్యాస్ ఉత్పత్తి నిలిపివేయడంతో పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. భారత్ తన ఎల్‌పీజీ అవసరాల్లో 60%ను గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. దీంతో ఇంధన భద్రత కోసం భారత్ జాగ్రత్తగా వ్యవహరించాల్సి వచ్చింది.ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖామెని హత్యను ఖండించినప్పటికీ, భారత్ ఐదు రోజులు ఆలస్యంగా స్పందించింది. భారత్ వ్యవహరిస్తున్న, స్పందిస్తున్న తీరు దౌత్యపరమైన నిర్లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నిర్లక్ష్య స్పందన ప్రభావం భారత్ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది. ఇరాన్, సౌదీ అరేబియా, యూఏఈ బ్రిక్స్ సభ్య దేశాలే. కానీ ఈ యుద్ధంపై బ్రిక్స్ నుంచి ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన రాలేదు. పైగా బ్రిక్స్ అధ్యక్ష దేశంగా భారత్ ముందుకు రావాల్సిన పరిస్థితి ఉన్నా, ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ యుద్ధంపై బ్రిక్స్ ఇప్పటికీ ఏకగ్రీవ ప్రకటన ఇవ్వలేదు. భారత్‌పై ఒత్తిడి ఉన్నప్పటికీ స్పందన ఇంకా రాలేదు. గల్ఫ్ దేశాలతో భారత్‌కు బలమైన ఆర్థిక సంబంధాలు ఉన్నాయి. అక్కడ సుమారు 96 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారు. ఆ దేశాలు భారత ఇంధన భద్రతకు కీలకం. యూఏఈ, సౌదీ వంటి దేశాలు భారత్‌లో భారీ పెట్టుబడులు పెడుతున్నాయి. యూఏఈ 75 బిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఆర్థిక, వ్యూహాత్మక అంశాలే భారత్ నిర్ణయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ వైఖరి ఎలా ఉందంటే కర్ర విరక్కూడదు పాము చావకూడదు అన్న రీతిలో ఉంది. ఇరాన్ యుద్ధం భారత్ విదేశాంగ విధానానికి పెద్ద సవాల్‌గా మారింది. ఏదైనా సమస్య వస్తే భారత్ వైఖరి ఏంటో ఇప్పుడు తెలుస్తోంది. ఆలస్యంగా స్పందించడం, స్పష్టమైన వైఖరి లేకపోవడం, సొంత నిర్ణయాలు తీసుకోలేకపోవడం, ఆర్థిక ప్రయోజనాల కోసమే చూడడం వంటి లోపాలు కనిపిస్తున్నాయి. భారత్ తన విశ్వసనీయతను కోల్పోకూడదంటే అన్ని దేశాల పట్ల ఒకే విధమైన దౌత్య విధానాన్ని అనుసరించాలి. భారత్ ప్రపంచంలో ప్రభావశీల దేశంగా నిలవాలనుకుంటే ఎలాంటి సంక్షోభ పరిస్థితి ఎదురైనా కానీ తక్షణ స్పందనా విధానం ప్రధానం. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా స్పష్టత పాటించాలి. అంతా ఐపోయాక స్పందించినా ఉపయోగం సున్నా. స్ట్రాటజిక్ ఆటానమీ…వ్యూహాత్మాక స్వయంప్రతిపత్తి అన్న పదానికే అర్ధం లేకుండా పోతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *