ఉమ్మడి పౌర స్మృతి తీసుకురావడానికి గుజరాత్ శాసనసభలో బుధవారం బిల్లు ప్రతిపాదించారు. ఈ బిల్లు వివాహం, విడాకులు, వారసత్వం, పెళ్లి చేసుకోకుండానే స్త్రీ పురుషుల సహజీవనం లాంటి అంశాలలో ఏక రీతి తీసుకురావడానికి ఉద్దేశించింది. అంటే కులం, మతం, జాతీ, స్త్రీ-పురుష భేదంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే వివాహ చట్టం అమలుచేయడం గుజరాత్ బిల్లు మౌలిక లక్ష్యం. అంతకుముందు ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలించడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ ఓ సంఘాన్ని ఏర్పాటుచేశారు. ఈ సంఘం సిఫార్సులు అందజేసిన మరుసటి రోజే ఉమ్మడి పౌరచట్టం బిల్లు ప్రతిపాదించడం అంత తొందరపాటు ఏమిటి అన్న ప్రశ్న లేవనెత్తుతోంది. అంటే ముఖ్యమంత్రి ఏర్పాటుచేసిన కమిటీ నివేదికను క్షుణ్నంగా పరిశీలించకుండానే, కూలంకషంగా అధ్యయనం చేయకుండానే హడావుడిగా బిల్లు ప్రతిపాదించారు. దీన్నిబట్టి ప్రభుత్వం సిద్ధం చేసి పెట్టుకున్న బిల్లును ప్రతిపాదించారు. రాజ్యాంగం రూపొందిస్తున్న సమయంలోనే ఉమ్మడి వివాహ చట్టం మీద లోతైన చర్చ జరిగింది. దేశమంతటికీ ఒకే పౌర స్మృతి (వివాహ చట్టం) ఉండాలన్న వాదన ఉన్నప్పటికి ఆనాటికి పరిస్థితులు అనువుగా లేనందు వల్ల ఈ అంశాన్ని ఆదేశిక సూత్రాలలో 44వ అధికరణంగా చేర్చారు. ఆదేశిక సూత్రాలు మార్గదర్శకాలే తప్ప కచ్చితంగా అమలుచేసి తీరవలసినవి కావు. విషయాలు కావు. పరిస్థితులను బట్టి ఈ అంశాన్ని అమలు చేయాలన్నది రాజ్యాంగ నిర్ణాయక సభ ఉద్దేశం. ఒక అంశాన్ని ఆదేశిక సూత్రాలలో చేర్చడం అంటే కాలక్రమేణా, పరిస్థితులు అనుకూలించినప్పుడు అమలు చేయవచ్చునని చెప్పడమే. ఆదేశిక సూత్రాలలో ఉమ్మడి వివాహ చట్టంతో సహా అనేక అంశాలు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటిని ఇప్పటికే చట్ట రూపం ఇచ్చాం. మన దేశం కులాలు, మతాలు, భాషలు, సంస్కృతుల విషయంలో విపరీతమైన వైవిధ్యం ఉన్నది కనక ఉమ్మడి పౌర స్మృతి తీసుకు రావడంలో తొందరపాటు కూడదన్నది రాజ్యాంగ నిర్ణాయక సభ అభిమతం. ఇందులోని సారాన్ని అర్థం చేసుకోకుండా కొన్ని మతాల వివాహ చట్టాలు భిన్నంగా ఉన్నాయి కనక ఉమ్మడి వివాహ చట్టం తీసుకురావాలన్న తొందర బీజేపీ లాంటి పార్టీలు ప్రదర్శిస్తున్నాయి. ఈ దృక్పథంతో ఉమ్మడి వివాహ చట్టం తీసుకొస్తే కొన్ని మతాలవారి, ముఖ్యంగా ముస్లింల సంప్రదాయాలను, సంస్కృతిని ఖాతరు చేయనట్టు అవుతుందని ఇంతవరకు ఉమ్మడి వివాహ చట్టం చేయడం కుదరలేదు. హడావుడిగా, ఏదో మతం వారికి ప్రత్యేక హక్కులున్నాయని, ఆ మతం వారి మీద ద్వేషంతో ఉమ్మడి వివాహ చట్టం తీసుకురాకూడదన్నది రాజ్యాంగ నిర్ణాయక సభ అభిప్రాయం. ఉమ్మడి పౌర స్మృతి అవసరమే కావొచ్చు. ఆదేశిక సూత్రాలలో ఆ మాట ఉండొచ్చు. అంతమాత్రాన ఆ రాజ్యాంగమే ప్రసాదించిన మత స్వేచ్ఛను ఉల్లంఘించాలనీ, అల్పసంఖ్యాక మతాల వారి హక్కులను లాగేయాలని కాదు. దీని బదులు వ్యక్తులకు వర్తించే చట్టాలలో లోపాలు ఉంటే సరిదిద్దాలని అనుకున్నారు. 2018లో ఉమ్మడి వివాహ చట్టం ఆవశ్యకత, లేదా అనావశ్యకత గురించి 21వ లా కమిషన్ వ్యక్తులకు వర్తించే చట్టాలను సంస్కరిస్తే సరిపోతుందని చెప్పింది. ఉమ్మడి పౌర స్మృతి అవసరమే లేదని తేల్చింది. 2022లో లా కమిషన్ ఉమ్మడి వివాహ చట్టం గురించి వివిధ మతాల వారి, ప్రజల అభిప్రాయాలు సేకరించాలని సిఫార్సు చేసింది. ఉమ్మడి వివాహ చట్టాన్ని బలవంతంగా అమలుచేస్తే మన దేశంలో ఉన్న సాంస్కృతిక వైవిధ్యానికి విఘాతం కలుగుతుందన్న వాదనలు బలంగా ఉన్నాయి. బలవంతంగా ఉమ్మడి పౌర స్మృతి అమలు చేయడం అంటే రాజ్యాంగం పూచీ పడ్డ మత స్వేచ్ఛ హరించడమే. ఉమ్మడి వివాహ చట్టం అంటే అధిక సంఖ్యాక వర్గాల వారి ఆచార వ్యవహారాలను తమ మీద రుద్దడమేనని ముస్లింలు మొదటి నుంచీ భయపడ్తున్నారు. మోదీ పాలనలో పెంచి పోషిస్తున్న విద్వేష రాజకీయాలను చూస్తే ఈ భయం ఊహాజనితమైందని అనుకోలేం. చట్టపరంగా ఉన్న వైవిధ్యాన్ని ఒకే వివాహ చట్టంతో అమలుచేయకూడదని లా కమిషన్ భావించింది. పైగా వ్యక్తులకు సంబంధించిన అంశాలు మతాచారాల్లో అంతర్నిహితమైన భాగం. మతపరమైన వైవిధ్యం పుష్కళంగా ఉన్న చోట అన్ని మతాలకు న్యాయం చేసే రీతిలో చట్టం రూపొందించడమూ సుసాధ్యం కాదు. ఉత్తరాఖండ్ శాసనసభ ఉమ్మడి వివాహ చట్టం బిల్లును 2024లోనే ఆమోదించింది. అస్సాం, గుజరాత్ రాష్ట్రాలు ఇదే మార్గంలో ఉన్నాయి. బుధవారం గుజరాత్ ఈ విషయంలో అడుగు ముందుకేసింది. గోవా 1961లో విముక్తం అయ్యేదాకా పోర్చుగీసుల పాలనలో ఉంది. అక్కడ 1867 నాటి వివాహ చట్టం అమలులో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే విభిన్నమైన వివాహ చట్టం ఉన్న ఏకైక రాష్ట్రం గోవానే. ఉత్తరాఖండ్ ఆమోదించిన బిల్లులో గిరిజనులను మినహాయించారు. రాజ్యాంగం వారికి ప్రత్యేక రక్షణలు కల్పించడమే దీనికి కారణం. హిందువులు, సిక్కులు, బౌద్ధులు, జైనులకు 1956 నాటి హిందూ వారసత్వ చట్టం వర్తిస్తోంది. ముస్లింలకు ప్రత్యేక వివాహ చట్టం ఉంది. 1925 నాటి వారసత్వ చట్టం క్రైస్తవులకు, పార్సీలకు, యూదులకు వర్తిస్తుంది. నిజానికి ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం నిరభ్యంతరంగా మతాంతర వివాహాలు చేసుకునే హక్కు అన్ని మతాల వారికీ ఉంది. ఉమ్మడి పౌర స్మృతి సెక్యులర్ భావాలను ప్రోది చేస్తుందని బీజేపీ వాదించడం విచిత్రం. సెక్యులరిజానికి వికృత భాష్యాలు చెప్పడం తప్ప సెక్యులర్ సూత్రాలను అనుసరించడం సంఘ్ పరివార్ చరిత్రలోనే లేదు. అడ్వాణీ లాంటి సీనియర్ నాయకుడు సైతం “సిక్యులర” (రుజా గ్రస్థ) అని ఎద్దేవా చేసే వారు. ఉమ్మడి పౌర స్మృతి స్త్రీ-పురుష వ్యత్యాసాన్ని అంతం చేస్తుందన్న వాదన కూడా సంఘ్ పరివార్ నోటి వెంట వినడం ఎబ్బెట్టుగా ఉంటుంది. ఉమ్మడి వివాహ చట్టానికన్నా ముందు సమాజంలో ఏకాభిప్రాయం సాధించాలి. లేకపోతే అల్లకల్లోల పరిస్థితి ఎదురవుతుంది. ప్రతిఘటన తప్పదు. ఉమ్మడి పౌర స్మృతి మీద బీజేపీకి అంత మమకారమే ఉంటే ముందు చేయవలసింది ఏకాభిప్రాయ సాధన. వివిధ వర్గాలతో చర్చించాలి. మత నాయకులను కూడా సంప్రదించాలి. ఉమ్మడి పౌర స్మృతి నిజానికి కొన్ని రాష్ట్రాలకు పరిమితమైంది కాదు. ఇది సకల రాష్ట్రాలకు సంబంధించింది. ఉమ్మడి పౌర స్మృతి అవసరం ఏమిటో, అవాంతరాలేమిటో ముందు ప్రజల్లో చైతన్యం కలిగించాలి. అత్యున్నత న్యాయస్థానం ఈ అంశంపై పీలికలు పీలికలుగా వ్యాఖ్యానించిందే తప్ప సమగ్ర తీర్పు ఇవ్వనే లేదు. 1985లో షాబానో కేసులో భరణం మీదే దృష్టి పెట్టింది. 1995 నాటి సరళ ముద్గల్ కేసులో స్త్రీ-పురుష సమానత్వానికి ఉమ్మడి పౌర స్మృతి అవసరం అని పేర్కొంది. 2019లో ఏకంగా ఉమ్మడి పౌర స్మృతి అవసరాన్ని నొక్కి చెప్పింది. ఇలాంటి భిన్నమైన తీర్పులు, వ్యాఖ్యానాలు సమస్యను మరింత జటిలం చేస్తాయి.


