సుమారు 180 సంవత్సరాల క్రితం నాటి మాట. అది 1847వ సంవత్సరం. ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనా రోజులు.
మద్రాసులోని’ సెయింట్ జార్జ’ కోటలో ఏర్పరచిన కళాశాలలో ఇంగ్లీషు వారికి తెలుగు పాఠాలు నేర్పించడానికి ‘ట్యూటర’ ఉద్యోగంలో ఒక తెలుగు పండితుణ్ణి నియమించేవారు. అప్పటివరకు ట్యూటర్ గా ఉన్న పుదూరి సీతారామశాస్త్రి ‘రిటైర’ అయిపోయారు. ఆ తర్వాత ఆ ఉద్యోగానికి కేవలం తెలుగు చదివిన వాడే కాకుండా, కొంత ఇంగ్లీష్ కూడా వచ్చిన వాళ్ల కోసం ఒక ప్రకటన జారీ చేశారు. ఉద్యోగానికి అర్జీ పెట్టుకున్న వారందరినీ కాశీ నుండి వచ్చిన ఒక పండిత మండలి వారు పరీక్షించి చివరకు అందులో ఒకాయనను అన్నివిధాలా అర్హునిగా ప్రకటించారు. అయితే వారిపేరులో అప్పటివరకు పండితు లకు తరచుగా కనిపించే శాస్త్రీ, శర్మ వంటి నామం లేదు.
అప్పటి ఆ కళాశాలకు అధ్యక్షుడైన ఏ. జె. అర్బత్ నాట్ ఆయనతో, “మీ పేరు చివరన శాస్త్రీ, శర్మ వంటివి ఎందుకు లేవు?” అని అడిగారట.
అందుకు ఆయన సమాధానంగా ‘తాను బ్రాహ్మణుడు కాకపోవటం చేత ఆ బిరుదుకి తను అర్హుడిని కాను’ అన్నారట! “అయితే మీరు ఏ బిరుదు పెట్టుకుంటారు?” అని అడిగితే, “సూరి అనే బిరుదు అయితే నాకు నప్పుతుంది.” అన్నారట.
అర్బత్ నాట్, ఆప్రకారమే అప్పటి వారి ఆచారం ప్రకారం ‘సూరి’ అనే అక్షరాలతో చెక్కిన బంగారపు కడియం ఒకటి ఇంగ్లాండ్ నుంచి తెప్పించి, వారికి బహుమతిగా ఇచ్చారు. వారే బాల వ్యాకరణం, నీతి చంద్రిక మొదలైన రచనలతో తెలుగు భాషను సుసంపన్నం చేసిన పరవస్తు చిన్నయ సూరి.
చిన్నయ సూరి పూర్వీకులు ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారు. రామానుజాచార్యుల వారి శిష్య పరంపరలో దేశవ్యాప్తంగా వైష్ణవ మత వ్యాప్తి కోసం, వారు అప్పట్లో తమిళనాడు నుంచి శ్రీకాకుళం తరలి వెళ్లారు. ఆ తర్వాత చిన్నయసూరి తండ్రి వెంకట రంగా రామానుజా చార్యులు ఉద్యోగ కారణంగా మద్రాసు వచ్చి, ‘ట్రిప్లికేన’ లోని రామానుజ మఠంలో మతాధికారిగా చేరారు. ఈయన సంస్కృత, ప్రాకృత, తెలుగు, తమిళ భాషలలో మంచి పండితుడు. ఆయన ప్రతిభను గుర్తించిన శ్రీనివాసాచార్యులు అనే వైష్ణవ పండితుడు వీరిని రామానుజాచార్య జన్మస్థలమైన శ్రీ పెరంబుదూరులోని ఆలయంలో వైష్ణవ తత్వాన్ని ప్రచారం చేసేందుకు ఆహ్వానించారు.
అక్కడ పెరంబుదూరులో ఉండగానే, 1809 డిసెంబర్ 20వ తేదీన వెంకటరంగయ్య దంపతులకు చిన్నయ సూరి జన్మించారు. సూరి తండ్రి దగ్గరే తెలుగు, అరవం, ప్రాకృత సంస్కృతాలు చదువుకున్నారు. కంచి రామానుజాచార్యులు వద్ద తర్కాలంకార మీమాంసలు అభ్యసించారు. రామశాస్త్రి అనే ఉత్తర దేశ పండితుని వద్ద వేదార్థ రహస్యాలు తెలుసుకున్నారు. ఆ రామశాస్త్రే సూరికి హయగ్రీవ మంత్రోపదేశం చేశారు. సూరి సొంతంగా కొంత ఆంగ్ల భాష కూడా నేర్చుకున్నారు. అందువల్ల పచ్చయ్యప్పా కళాశాలలో ప్రధాన పండిత పదవి సాధించి, 1845 నుండి 1848 వరకు అక్కడ ఉద్యోగం చేశారు.
బ్రౌన్ దొర, గాజులు లక్ష్మీ నరసింహం శెట్టి, జస్టిస్ రంగనాథ శాస్త్రి, కుమార స్వామి శాస్త్రి మొదలైన మహనీయులు చిన్నయ సూరి భాషా సేవకు నిరంతరం ప్రోత్సాహం అందించారు. మొట్టమొదట సూరిని గ్రంథ రచనా ఉద్యమంలో దింపినవారు లక్ష్మీనరసింహం శెట్టి గారు. ‘ఆంధ్ర శబ్ద శాసనము’,’ ఆంధ్ర నిఘంటువు’ వీరి వల్లనే సూరి రాయడం ఆరంభించారు కానీ అవి రెండూ పూర్తికాలేదు.
చిన్నయ సూరి సరళమైన భాషలో సులభ గ్రాహ్యంగా ఉండేలా ‘బాల వ్యాకరణం’ రచించారు. తెలుగు భాషను పరిశోధించి, ఆంధ్ర శబ్ద చింతామణిని పరిశీలించి వినూత్న రీతిలో వ్రాసినదే బాల వ్యాకరణం! బాల వ్యాకరణం తో పాటు ఈయన రాసిన నీతిచంద్రిక కూడా బాగా ప్రసిద్ధి చెందింది .సంస్కృతంలో ఉన్న పంచతంత్ర కథల లోని మిత్ర లాభం, మిత్ర బేధంను నీతి చంద్రిక పేరుతో తెలుగులోకి అనువదించారు. నీతి కథలను పిల్లలకు తెలియ చెప్పడానికి ఇంతకన్నా మంచి గ్రంథం మరొకటి లేదు.
వీరు ఇంకా పద్యాంధ్రవ్యాకరణము, ఆది పర్వ వచనము, శబ్ద లక్షణ సంగ్రహము, విభక్తి బోధిని, ఆంధ్ర ధాతుమాల, అక్షర గుఛ్ఛము, ఆంధ్ర కౌముది, ఆంధ్ర కాదంబరి మొదలైన గ్రంధాలు ఇరవై వరకూ రచించారు.
చిన్నయ సూరి రచన శైలి అత్యద్భుతమైంది. ఆయన శైలిని అనుకరించాలని చాలామంది ప్రయత్నించినా ఎవరు సఫలీకృతులు కాలేకపోయారు! నీతిచంద్రికను తెలుగులోకి అనువదించడానికి కారణం కేవలం నీతి కథలు చెప్పడమే కాదు, తెలుగు భాషలోని మాధుర్యాన్ని తెలుగువారికి అందించటమే ఆయన ప్రధాన ఉద్దేశం!
సూరి ‘వాణిదర్పణం’ అనే ప్రింటింగ్ ప్రెస్ నెల కొల్పి1853లో నీతిచంద్రిక తొలి ముద్రణ వేయించారు.
చిన్నయ సూరి వ్యాసకర్తే కాదు, కావ్యకర్త కూడా! భాషాభిజ్ఞుడే కాదు, సంగీత కళా విజ్ఞుడు కూడా! సరస్వత్యు పాసకుడే కాదు, హయగ్రీవోపాసకుడు కూడా!!
సూరి కంఠస్వరం చాలా శ్రావ్యంగా ఉండేదట. ఆయన సంగీతం కూడా కొంత నేర్చుకున్నారు.
ఈయన ‘సృజన రంజని’ అనే మాసపత్రికను స్థాపించి కొంతకాలం నడిపారు. ఈ పత్రికలో విద్వాంసులకు కలిగే భాషా సందేహాలకు చక్కని సమాధానాలు లభించేవట. సూరి కవితా నిపుణుడు. వచన రచనా మార్గదర్శకుడు. సంఘసంస్కారపరుడు. భాషా పోషకుడు.
సూరికి పేరు పొందిన శిష్యులు ఎందరో ఉన్నారు. అందులో శబ్ద రత్నాకర కర్త బహుజన పల్లి సీతారామాచార్యులు ముఖ్యులు. ఆంధ్ర విశ్వ గుణాదర్శ కర్త ‘పంచాంగం తేవప్పెరు మాళ్ళయ్య’ కూడా వీరి శిష్యులే.
‘పద్యమునకు నన్నయ, గద్యమునకు చిన్నయ’ అనే లోకోక్తి తో కీర్తి మూట కట్టుకున్న పరవస్తు చిన్నయ సూరి 1862లో స్వర్గస్తులయ్యారు.


