Last Updated:
గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది.
Visakhapatnam: పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ మేఘాలు భారత్‌లో వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వంట గ్యాస్ ఫిల్లింగ్ టెర్మినల్స్‌లో నాన్ డొమెస్టిక్ సిలిండర్ల (NDLC) ఉత్పత్తి, అమ్మకాలపై ఇప్పటికే కోత పడగా.. గత రెండు రోజుల నుండి ఏకంగా వంట గ్యాస్ సిలిండర్ల ఫిల్లింగ్ కూడా మందకొడిగా సాగుతోంది. గురువారం ఉత్తరాంధ్రాలోని అన్ని గ్యాస్ ఏజెన్సీల డీలర్లకు.. ఒక్కో డీలరుకు రోజుకు ఒక్క లోడు మాత్రమే ఇచ్చేందుకు ఆయిల్ కంపెనీలు ఉత్తర్వులను జారీ చేశాయి.
ఈనాడు కథనం ప్రకారం.. యుద్ధ ప్రభావానికి ముందు ఒక్కో డీలరుకు గరిష్టంగా రెండు లేదా మూడు లోడ్ల వరకు ఫిల్లింగ్ జరిగేది. ఇప్పుడు ఒక్క లోడుకే పరిమితం చేయడంతో డీలర్ల వద్ద నిల్వలు గణనీయంగా తగ్గుతున్నాయి. మరోవైపు నగరంలో వాణిజ్య (Commercial) సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో హోటళ్లు, చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ నగరంలో సగటున రోజుకు 70 వేల వరకు వాణిజ్య సిలిండర్లు వినియోగిస్తారు. వాటి సరఫరా నిలిచిపోవడంతో పలు హోటళ్లలో వంటకు ఆటంకాలు ఏర్పడ్డాయి. సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయం సమీపంలోని ఆహార విక్రయ దుకాణాలు ఇప్పటికే మూతపడ్డాయి.
వాణిజ్య సిలిండర్లతో పాటు గృహాలకు సరఫరా చేసే వంట గ్యాస్ విషయంలోనూ అంతరాయం మొదలైంది. గ్యాస్ సిలిండర్ తీసుకున్న 25 రోజులు పూర్తయితేనే మరొక సిలిండర్ బుకింగ్‌కు అవకాశం ఉంది. అయితే, వారం రోజులుగా ఆన్లైన్ ద్వారా బుకింగ్ చేస్తుంటే ‘సర్వర్ డౌన్’ లేదా ‘స్విచ్ ఆఫ్’ అని వస్తోంది. గ్యాస్ బుకింగ్ కాకపోవడంతో వినియోగదారులు నేరుగా గ్యాస్ ఏజెన్సీల వద్దకు పరుగులు తీస్తున్నారు. దొండపర్తి కూడలి సమీపంలోని గ్యాస్ ఏజెన్సీల వద్ద వృద్ధులు సైతం ఫోన్లతో క్యూ కట్టడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.
విశాఖ జిల్లాలో హెచ్‌పీసీఎల్, ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి చమురు సంస్థల ఆధ్వర్యంలో 8.89 లక్షల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. నిత్యం సుమారు 20 వేల సిలిండర్లు సరఫరా అవుతున్నాయి. ప్రస్తుత నియంత్రణ నేపథ్యంలో గ్యాస్ కంపెనీల నిల్వ వివరాలను పౌరసరఫరాల శాఖ సేకరించింది. ఈ మూడు సంస్థల వద్ద ప్రస్తుతం 1.08 లక్షల సిలిండర్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇవి కేవలం వచ్చే ఐదు రోజులకు మాత్రమే సరిపోతాయని అధికారులు లెక్కగడుతున్నారు. అయితే సిలిండర్లు తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, పొదుపుగా వాడుకుంటే సరిపోతుందని అధికారులు చెబుతున్నారు.
నగరంలోని పలు హోటల్ నిర్వాహకులు వాణిజ్య సిలిండర్ల కొరతతో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించారు. కొన్ని చిన్న హోటల్స్ నిర్వాహకులు ఏకంగా కట్టెల పొయ్యిలను వాడుతుండగా, మరికొందరు మెనూలో మార్పులు చేస్తున్నారు. గతంలో మాదిరి అన్ని రకాల పిండి వంటలు చేయడం లేదని, కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే ఆహార పదార్థాలను అందిస్తున్నామని నిర్వాహకులు వాపోతున్నారు. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో గ్యాస్ సరఫరాలో ఏర్పడిన ఈ అంతరాయం తాత్కాలికమేనని అధికారులు చెప్తున్నా, క్షేత్రస్థాయిలో ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana



