Road Safty: రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా సెస్ అమలు.. తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం |


Last Updated:

Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. కొత్త వాహనాల కొనుగోలుపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ విధించడం ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Road Safty
Road Safty

Road Safty: తెలంగాణలో రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించడానికి , ట్రాఫిక్ నిబంధనలను కఠినంగా అమలు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం మరో కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. కొత్త వాహనాల కొనుగోలుపై ‘రోడ్ సేఫ్టీ సెస్’ విధించడం ద్వారా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ నిబంధన ప్రకారం, రోడ్డు ప్రమాదాలను నివారించే లక్ష్యంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పన్నును వసూలు చేస్తున్నారు. అయితే ఆటోలు, ట్రాక్టర్లను ఈ పన్ను నుండి మినహాయించారు. అలాగే గూడ్స్ వాహనాలపై త్రైమాసిక పన్నును రద్దు చేసి, 7.5 శాతం జీవితకాల పన్నును అమలు చేయనున్నారు. కేవలం పన్నులు వసూలు చేయడమే కాకుండా, రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసే ప్రక్రియను కూడా ప్రభుత్వం కఠినతరం చేస్తోంది. ఇక నుండి, డ్రైవింగ్ నైపుణ్యాలను పరీక్షించడానికి కంప్యూటర్ ఆధారిత పరీక్షలు , అత్యాధునిక డ్రైవింగ్ ట్రాక్‌లను అందుబాటులోకి తీసుకురానున్నారు. సరైన జ్ఞానం ఉన్నవారికి మాత్రమే లైసెన్స్‌లు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. రోడ్డు భద్రతా నెలల్లో ప్రజలలో అవగాహన కల్పిస్తూనే, ఈ నిధులను మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఖర్చు చేస్తారు.

అదే విధంగా ట్రాఫిక్ రూల్స్ పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న వారికి మరో రకంగా షాక్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ట్రాఫిల్ రూల్స్ పాటించని వారి వాహనాలకు చలాన్లు విధిస్తున్నప్పటికీ వాటిని సకాలంలో చెల్లించకపోవడంతో ప్రభుత్వం రాయితీ ఇస్తూ బిల్లులు వసూలు చేస్తోంది. అయితే ఇప్పుడు ఆ సంస్కృతికి శుభం కార్డు వేసింది.పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, వాహనదారుల్లో నిర్లక్ష్య ధోరణి పెరగడానికి చలాన్లపై కూడా డిస్కౌంట్ ఇస్తారనే ధీమానే కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇకపై అలాంటి డిస్కౌంట్ ఇవ్వకూడదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. డిస్కౌంట్ ఇస్తారనే భావన ఒక పెద్ద సమస్యగా మారిందన్నారు.

ఏ వాహనమైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, యజమాని బ్యాంకు ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బులు కట్ అయ్యే విధానాన్ని అందుబాటులోకి తేనున్నట్లుగా తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే వెంటనే బ్యాంకు ఖాతా నుంచి డబ్బులు కట్ అయ్యేలా, వాహనాల రిజిస్ట్రేషన్ సమయంలోనే యజమాని బ్యాంకు ఖాతాను లింక్ చేయాలని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంపై బ్యాంకర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించాలనే లక్ష్యంతో హైదరాబాద్ యూసుఫ్ గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో “అరైవ్ అలైవ్” రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో ఈ సంచలన నిర్ణయాన్ని ప్రకటించారు.

దేశంలో ప్రతి నిమిషానికి ఒక రోడ్డు ప్రమాదం జరుగుతుంటే, ప్రతి మూడు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. మైనర్లు ప్రమాదాలకు గురైతే వారి తల్లిదండ్రులపై కేసులు పెట్టాలని ఆయన ఆదేశించారు.

రోడ్డు ప్రమాదాల విషయంలో రవాణా శాఖ, పోలీసు శాఖ సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సూచించారు.హైడ్రా, ఈగల్, సైబర్ క్రైమ్ విభాగాలను బలోపేతం చేసినట్లే, ట్రాఫిక్ నియంత్రణలోనూ పోలీస్ వ్యవస్థను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు.ట్రాఫిక్ వ్యవస్థ ఆరో వేలు మాదిరిగా తయారైంది. ఈ విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. సాంకేతిక నైపుణ్యం ఉపయోగించుకుని ట్రాఫిక్ వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. సంపూర్ణ సంస్కరణలతో రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ దిశగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *