Last Updated:
గొర్రెల శివరామకృష్ణ-సత్యవేణి దంపతులు రామకృష్ణ నగర్‌లో నిరుపేదలకు ఆహారం అందిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సరస్వతి విద్యా సేవా సమితి ద్వారా ఆసుపత్రుల్లో రోగులకు ఆహారం అందిస్తున్నారు.
ఆకలి అని అడగకముందే ఆకలిని గుర్తించి అన్నం పెట్టే అన్నపూర్ణగా ఒక పెద్దావిడ మారిపోయింది. డబ్బు, ఆస్తి, భోగభాగ్యాలు ఇవన్నీ శాశ్వతం కావని, కానీ మన చేత్తో పెట్టిన పిడికెడు అన్నం మాత్రం శాశ్వతంగా నిలుస్తుందని నమ్ముతూ ప్రతిరోజూ సేవనే పరమార్థంగా భావిస్తూ ముందుకు సాగుతోంది. తన చేత్తో ఎంతమందికైనా వంట చేసి పెడతానని చెప్పి, వాటిని అవసరమైన వారికి అందించేందుకు తన భర్తను పంపిస్తూ కలికాలంలో ఆదర్శ మహిళగా నిలుస్తోంది. సేవే జీవిత లక్ష్యంగా భావిస్తూ ఆకలిగొన్నవారికి ఆహారం అందించడం ఆమెకు నిత్యకృత్యంగా మారింది.
ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ జిల్లా రామకృష్ణ నగర్ ప్రాంతంలో నివసిస్తున్న గొర్రెల శివరామకృష్ణ – సత్యవేణి దంపతుల పుణ్య సేవ గాథ ఇది. భర్త ఆకలితో ఉన్నవారికి అన్నం అందించేందుకు ముందుకు వెళ్తుంటే, భార్య సత్యవేణి ఇంట్లోనే రుచికరమైన ఆహార పదార్థాలు తయారు చేస్తూ సేవలో భాగమవుతుంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా ఈ దంపతులు సేవ కార్యక్రమాలు కొనసాగిస్తూ నిరుపేదలకు అండగా నిలుస్తున్నారు. సేవ చేయాలనే తపనతో వీరు సరస్వతి విద్యా సేవా సమితి పేరుతో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో పెద్ద సంఖ్యలో రోగులు మరియు వారి బంధువులు ఉండే పరిస్థితిని గమనించిన ఈ దంపతులు అక్కడికి వెళ్లి వారికి ఆహారం అందించడం ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారం అందిస్తూ ఆకలితో ఉన్న వారికి ఉపశమనం కలిగిస్తున్నారు. ఈ సేవలో రామకృష్ణ నగర్ ప్రాంతానికి చెందిన మహిళలు కూడా ముందుకు రావడంతో వంట చేసే పరిమాణం మరింత పెరిగింది. దీంతో మరింత మందికి అన్నదానం చేయగలుగుతున్నామని ఆదర్శ మహిళ సత్యవేణి చెబుతున్నారు.
సేవ చేయాలనే సంకల్పంతో పుట్టినరోజులు, పెళ్లిరోజులు వంటి శుభ సందర్భాల్లో కూడా నలుగురికి అన్నం పెట్టే విధంగా ప్రజలను ప్రోత్సహిస్తున్నారు. ఎలాంటి పెద్ద డొనేషన్లు లేకపోయినా తమ వద్ద ఉన్నదాంట్లోనే ప్రతిరోజు కనీసం 25 కిలోల బియ్యంతో వంట చేసి ఆసుపత్రుల్లో ఉన్న వారికి కిచిడి, బిర్యానీ, పులిహోర వంటి ఆహార పదార్థాలను అందిస్తున్నారు. ఇది పూర్తిగా సేవాభావంతో సాగుతున్న కార్యక్రమంగా మారింది. వీరికి డెక్కన్ కెమికల్ ఫ్యాక్టరీ నుంచి ఒక ఆటో అందించడంతో ఆ ఆటోలోనే ఆహారం తీసుకెళ్లి అవసరమైన వారికి అందిస్తున్నారు. దీంతో సేవా కార్యక్రమాలను మరింత విస్తరించగలుగుతున్నారు. ఎక్కడ ఆకలి కనిపించినా అక్కడికి వెళ్లి ఆహారం అందించడం ఈ దంపతుల లక్ష్యంగా మారింది.
మహిళా దినోత్సవం వంటి సందర్భాల్లో ఇలాంటి ఆదర్శ మహిళలను గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉందని స్థానికులు చెబుతున్నారు. ప్రతిరోజు ఉదయం మూడు గంటలకే లేచి వంట చేసి వందల మందికి అన్నం పెట్టే సత్యవేణి సేవ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది. మరోవైపు రామకృష్ణ నగర్‌లోని తమ నివాసంలో రమణ ఆశ్రమాన్ని నిర్మించి లోకకళ్యాణార్థం శాంతి హోమాలు, పూజలు నిర్వహిస్తూ ఆధ్యాత్మిక సేవలను కూడా కొనసాగిస్తున్నారు. సేవ, దానం, భక్తి అనే మూడు విలువలతో ఈ దంపతులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


