అంతరిస్తున్న సంస్కృతి – క్రిస్టోఫర్ కాడ్వెల్ క్రాంతి


డా. జె. రవీంద్రనాథ్
8978131585

క్రిస్టోఫర్ కాడ్వెల్ (1907-37) ఒక రచయిత, సాహితీ విమర్శకుడు, కమ్యూనిస్టు పోరాట యోధుడు. అతడి బహుముఖ ప్రజ్ఞ అనే ప్రసూనం కవితలు, కథలు, నవలలు, విమర్శనా గ్రంథాలలో విరిసింది. స్పానిష్ అంతర్యుద్ధంలో ప్రజాస్వామ్య శక్తులతరఫున అంతర్జాతీయస్ఫూర్తితో పాల్గొని తన సహచరులను కాపాడుతూ అసువులు బాసిన వీరుడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ లండన్‌లో ఒక రోమన్ కేథలిక్ కుటుంబంలో జన్మించాడు. 15 ఏళ్ల వయసులో స్కూల్ చదువు మాని యార్క్ షైర్ అనే పత్రికా విలేకరిగా, తర్వాత బ్రిటీష్ మలయా పత్రిక సంపాదకుడుగా పనిచేశాడు. కమ్యూనిస్టు భావజాల ప్రభావితుడై పార్టీలో చేరాడు. ఆయన రచనల్లో ‘ది క్రైసిస్ ఆఫ్ ఫిజిక్స్,’ ‘ఇల్యూజన్ అండ్ రియాలిటీ,’ ‘స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర్,’ ‘ఫర్థర్ స్టడీస్ ఇన్ ఏ డైయింగ్ కల్చర’ ముఖ్యమైనవి.
అతని మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన పుస్తకం ‘అంతరిస్తున్న సంస్కృతిలో అధ్యయనాలు’. దీనిలో మేధావులు రస్సెల్, టీ.ఈ.లారెన్స్, డీ.హెచ్.లారెన్స్, హెచ్.జి.వెల్స్, ఫ్రాయిడ్‌ల పైన, శాంతివాదం, ప్రేమ, స్వేచ్ఛ మొదలగు అంశాల పైన విమర్శనాత్మక వ్యాసాలున్నాయి. వీటిలో చివరి మూడుఅంశాలకు నేడు ఎంతో ప్రాధాన్యత ఉంది. క్రిస్టోఫర్ కాడ్వెల్ ఇతరులపై ఏ రకమైన ఆంక్షలు లేదా హింసాత్మక చర్యలు వాటంతట అవే తప్ప్పు అని, పాసివ్‌గా ప్రతిఘటించాలనే బూర్జువా శాంతి వాదాన్ని తీవ్రంగా వ్యతిరేకించాడు. పెట్టుబడి దారీ వర్గపాలకులు అంతర్గత హింస ద్వారా శ్రామికులను అణచివేస్తారని, భూస్వామ్యవ్యవస్థలో వలె కాక బూర్జువావర్గానికి వేతనశ్రామికుడి పట్ల ఎలాంటి బాధ్యత ఉండదని, పెట్టుబడి దారులు తమలో అంతర్గత పోటీని ‘ఫెయిర్ ప్లే’ ద్వారా పరిష్కారం చేసుకోవాలని చూస్తారని రాశాడు. ఈ వ్యవస్థలో పాసివ్‌గా పాల్గొనడం లేక చురుగ్గా వ్యతిరేకించడం అనే రెండు మార్గాలే ఉంటాయి. మొదటిది వ్యభిచారం కన్నా హీనం అని క్రిస్టోఫర్ కాడ్వెల్ రాశాడు. స్వేచ్ఛ, స్వీయ నిర్ణయాధికారం, ప్రజాస్వామ్యం పేరుతో పాలక వర్గాలు సొంతాస్తి, ఉన్నత సామాజిక వర్గాల కోసం వేతన శ్రమను అమలుచేస్తాయి. బూర్జువా శాంతివాదం అనేది వాటి చివరి వైఖరి.
నేడు సామ్రాజ్యవాదం శాంతిమంత్రం మానేసి యుద్ధ మంత్రంజపం చేస్తూ ఉంది. కాడ్వెల్ ఆ రోజుల్లో నానాజాతి సమితినీ బూర్జువా భ్రాంతి అని వర్ణించాడు. నేడు ఐరాస కూడా అలాగే నీరుకారిపోయింది. అతడు ఊహించినట్టుగానే రెండవ ప్రపంచయుద్ధం తర్వాత, ఫాసిస్టు ప్రమాదం తప్పిన పిదప సోవియట్ యూనియన్ను ప్రధాన శత్రువుగా భావించి సామ్రాజ్య వాద కూటమి ప్రచ్ఛన్న యుద్ధానికి తెరతీసింది. 1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత ప్రత్యక్ష యుద్ధాలతో నేడు అమెరికా కూటమి ప్రపంచాన్ని కల్లోల పరుస్తోంది.
‘స్వేచ్ఛ’ను గురించిన వ్యాసంలో క్రిస్టోఫర్ కాడ్వెల్ బూర్జువా స్వేచ్ఛ, దాని పరిమితులను నిశితంగా విమర్శించాడు. రస్సెల్ లాంటి ఒక ఆక్స్ఫర్డ్ ప్రొఫెసర్ , ఒక శ్రామికుడు, ఒక నిరుద్యోగి అనుభవించే స్వేచ్ఛల మధ్య తేడాలు వివరించాడు. మేధావులు తాము ప్రగతిశీలశక్తులవైపు ఉండాలో లేదో తేల్చుకోవాలి అన్నాడు. ఆయనదృష్టిలో స్వేచ్ఛఅంటే ఆవశ్యకతను గుర్తించడమే. నిరంతర జాగరూకత కాక నిరంతరశ్రమ స్వేచ్ఛకు చెల్లించాల్సిన మూల్యం. ఒకవర్గ స్వేచ్ఛ మరోవర్గ బానిసత్వం. బూర్జువావర్గ స్వేచ్ఛకు, శ్రామికవర్గ స్వేచ్ఛకు పొత్తు పొసగదు. స్వేచ్ఛా సంకల్పం అనేది హేతుత్వానికి వ్యతిరేకం కాదని, అది ప్రత్యేక అంశమని, అది చేతన హేతువని క్రిస్టోఫర్ కాడ్వెల్ భావించాడు. ఇతర జంతువులకు కొంత స్వీయ నిర్ణయాధికారం ఉన్నా మనిషితో పోలిస్తే అవి స్వేచ్ఛ లేనివి. ఆర్థిక ఉత్పత్తి, సామాజిక సంబంధాలలోనే స్వేచ్ఛ సాధ్యం. అవి లేనపుడు మనిషి ప్లాస్టర్ మూసలో ఉన్నవానిలా ఓ ఖైదీ మాత్రమే.
అన్ని సామాజిక సంబంధాలను స్వేచ్ఛ పై ఆంక్షలుగా చూసిన రస్సెల్, హెచ్ జి వెల్స్, ఎడ్వర్డ్ మోర్గాన్ ఫార్స్టర్ లాంటి మేధావుల వలె స్వేచ్ఛాలేమిని కాక స్వేచ్ఛను నమ్మినందునే తాను కమ్యూనిస్ట్‌ను అయ్యాయని కాడ్వెల్ అన్నాడు. ‘జీవనం లోనే మనిషి చైతన్యం ప్రత్యేకముద్రను కలిగి ఉంటుంది. జీవనం అంటే కేవలం సామాజిక సంబంధాలలో ప్రవేశమే.’ భాష, సైన్స్, కళలు తనలోని, బాహ్య ప్రపంచాన్ని తెలుసుకునే సమిష్టి మానవ కృషి ఫలమే. సామాజిక జీవితం సామాజిక మదిని సృష్టిస్తుంది. లోతుగా సాగే అంతర్గత, బాహ్య వాస్తవికతల పరస్పరచర్య రక్షితమై సంస్కృతి ద్వారా తర్వాతి తరాలకు అందిస్తారు. ఫాసిజం, యుద్ధం, ఆర్థిక మాంద్యాల నిర్మూలనకు సామాజిక సంబంధాలు, నియమాలను అర్థం చేసుకోవాలి. అంతేకానీ సహాయ నిరాకరణ, పాసివ్ ప్రతిఘటన, అంతరాత్మ వ్యతిరేకతలు మార్గంకావు. బూర్జువా సమాజం నేడు నిరుద్యోగం, దుఃఖం, అభద్రత, నిరంతరయుద్ధాలను సృష్టిస్తోంది. దాని స్వేచ్ఛ వ్యక్తిగత ఉత్పత్తి, ధనస్వామ్యంపై ఆధారపడి ఉంది. ఆధునిక రాజ్యం బలప్రయోగం ద్వారా ఉన్న వారి హక్కులను, వారిని లేనివారి ‘స్వేచ్ఛనుంచి కాచే సాధనం. అది ఏకస్వామానికి దారి తీసి తన స్వీయ వైరుధ్యాన్ని బహిరంగం చేస్తుంది. బూర్జువా నాగరికత ఉత్పత్తిసాధనాలపై వ్యక్తిగత యాజమాన్యం, విశృంఖల పోటీ, వాటి ధనస్వభావం అనేవి భిన్నరకాల ఆంక్షలు-ఆస్తి నుంచి పరా యీకరణ, మాంద్యానికి, యుద్ధానికి బందీకావటం, నిరుద్యోగం, దుఃఖాలుకు నెలవు అనే చైతన్యం లేకపోవటంవల్ల దానికి స్వీయ అదుపులేదు. ప్రజలు కోరుకునేది సంతోషం, భద్రత, స్నేహం, యుద్దరాహిత్యం, వివాహం, పిల్లలు, పరస్పర సహకారం. ఇవి ఇవ్వలేనిస్వేచ్ఛ బూటకం. కమ్యూనిస్టు సమాజం సమాజ నియమాలను అర్థంచేసుకోవటంవల్ల లేనివారి బానిసత్వం, యుద్ధాలు, ఆకలి, ద్వేషం, బలప్రయోగం అంతరిస్తాయి.
‘ప్రేమ’ అనే వ్యాసంలో కాడ్వెల్ ప్రేమను కాల్పనికులు స్వర్గ కూపం అని, మానసిక శాస్త్రవేత్తలు లిబిడోగా పిలుస్తారు అని మొదలెడతాడు. మతాలు కూడా ప్రేమ గురించి మాట్లాడితే, దేవుడే ప్రేమ అని మార్మిక వాది అంటాడు. కాడ్వెల్ దృష్టిలో సమాజం ప్రేమతో మిళితమైన ఆర్థిక ఉత్పత్తి. ఫ్రాయిడ్ సిద్ధాంతం తలకిందుల వ్యవహారం అని క్రిస్టోఫర్ కాడ్వెల్ భావించాడు.
ప్రేమలో మామూలుగా పరుల సన్నిధిలో ఆనందం, ఒకరి కన్నా మరొకరి పట్ల ఎక్కువ స్పందన, కరుణ, వారిని చూడాలనే కోరిక, ఆత్మీయతలు ఉంటాయి. ప్రేమలో లైంగిక ఇచ్ఛ కూడా ఉంటుంది. కానీ లైంగిక కోరికనే స్నేహానికి ఇతర రూపాలు అనటం అసంబద్ధం. మనిషి ప్రవర్తన అనుభవం బట్టి మారు తుంది. ఇదే నేర్చుకోవడం. ‘మట్టి నుంచి గులాబీ వస్తే, గులాబీని నిరోధించిన మట్టి అనటం సరికాదు.’
భూస్వామ్యయుగంలోని ఆర్ద్రత బూర్జువాసమాజంలో రొక్కం బంధంలో ఉండదు. కాబట్టి ఆ ఆర్ద్రతకు ప్రత్యామ్నాయంగా ఊహాత్మకమైన జాతి, అద్భుతమైన సంతోషభరిత కుటుంబం, దైవాంశ సంభూతునిగా భావించే రాజు లేదా డమ్మీనేత( రాజ్యాంగపరంగా రబ్బర్ స్టాంప్ అయినా) తీసుకురావడం అవసరమవుతుంది. ఈ విధంగా బలమైన ‘భాగస్వామ్య మార్మికత’ స్థిరమవుతుంది. పెట్టుబడిదారీ సంబంధాల్లో మనిషికి, వస్తువుకి మాత్రమే సంబంధం. ఉద్వేగ పూరిత ప్రేమ ఒక రాలిన సుమం. భార్య ఒక ఆస్తి. ఆమె అందంగా, విధేయంగా ఉండాలి. మనిషి తాను కోల్పోయిన ఆవేశ శక్తులు, ఆర్ద్రతల తృప్తికి మతం, విద్వేషం, దేశ భక్తి, ఫాసిజం, కాల్పనిక ప్రేమను చూపించే సినిమాలు, నవలల్లోని సెంటిమెంట్లు వైపు మొగ్గుతాడు. ప్రేమ, వస్తువుల పట్ల బలవంత హక్కులు భిన్న ధృవాలుగా ఉంటాయి. తనకు అమూల్యమైనవి నాశనం కావటం చూసి చైతన్యంతో మానవులు పాతసమాజాన్ని పాతరవేసి సమ సమాజ దారిలో సాగుతాడు. బూర్జువా ఉత్పత్తి శక్తులకు ఉన్న సంకెళ్లు బద్దలు అవుతాయి. అదే విప్లవం. బెర్నార్డ్ షా స్వేచ్ఛ సత్యం ద్వారా వస్తుందని భావించాడు కానీ సామాజిక ఉత్పత్తిగా చూడలేదు. మనిషి ఉనికికి, చైతన్యానికి మధ్య తేడా సమాజాన్ని నడిపిస్తుంది. ఈ తన్యతను, మృతప్రాయ మేధోపర ప్రాంతం కిందఉండే దానిని బెర్నార్డ్ షా పట్టించుకోలేదు. షా ‘జీవిత ప్రేమ’ని అస్తిత్వానికి ఒక మోటు ప్రత్యామ్నాయంగా చెప్పినందున ఆయన పాత్రలు అమానవీయం అని, అతడు రాసిన నాటకాలు చర్చలు అని, ఆ ఊహాజగత్తులో మేధో వీరుడు పేద శ్రామికులకు, మందమతులకు మార్గదర్శిగా ఉంటాడని క్రిస్టోఫర్ కాడ్వెల్ విమర్శించాడు. మార్క్స్ కొందరికి మాత్రమే అర్థమయినా సీరియస్‌గా రాశాడని, అతడ్ని చదివి ప్రజాదరణ పొందిన బెర్నార్డ్ షా మాత్రం సంస్కరణ వాదిగా మిగిలాడు. కార్మికులను కాక బూర్జువా వర్గం తమ పాపాలు మానేయాలి అని ఒప్పించేందుకు యత్నించాడు. డి. హెచ్.లారెన్స్ బూర్జువా సంస్కృతిలో ఎంతో ఎదిగినా దాని బోలుతనం చూసి విసిగి ‘రక్తంలో నమ్మకం’ ( సహజాత) సిద్ధాంతం పట్టుకుని, వాస్తవాన్ని చూడలేక, అసంతృప్తిగా బూర్జువా సంస్కరణల పరిమితిలో ఉండిపోయాడు.
క్రిస్టోఫర్ కాడ్వెల్ దృష్టిలో హెచ్. జి.వెల్స్ ఒక కంగాళీ మనిషిగా, కొత్త సూత్రాలతో యుటోపియన్ సోషలిస్టుగా, సామాజిక పరిస్థితులు కాక ఆలోచనలే ముఖ్యమనే భ్రాంతికి లోనయ్యాడు. కార్మిక వర్గదూరుడై, మురికి, చెడులను ప్రమాదకరం అంటూ పెట్టీ బూర్జువా మనస్తత్వంతో తన జీవితమంతా నిరపేక్ష సత్యం, న్యాయాలను పాపులర్‌శైలిలో చెబుతూ ప్రపంచాన్ని మారుద్దామనుకున్నాడు. మార్క్స్ ఆర్థిక నియమాలు కనుగొని, స్వేచ్ఛ కోసం ఆచరణను బోధించి ప్రపంచంలో ఆరవ వంతు భాగాన్ని మార్చాడు. కానీ వెల్స్ పాత్రలు కిప్స్ నుంచి క్లిసోల్డ్ దాకా నిరాశామయంగా చిత్రించి తన కన్నా టాల్స్టాయ్, ఎర్నెస్ట్ టాలర్, జాన్ గాల్స్వర్తీ మొదలగువారు మెరుగు అనిపించాడు.
సిగ్మండ్ ఫ్రాయిడ్‌ను ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్తగా అంటూ ఆయన సిద్ధాంతాలను క్రిస్టోఫర్ కాడ్వెల్ తీవ్రంగా విమర్శించాడు. ప్రేమ, మృత్యువుల మధ్య ఫ్రాయిడ్ చూసిన నిరంతర యుద్ధం జొరాస్ట్రియన్ మతం నుంచి క్రిస్టియానిటి నుంచి మానవ మది పై తనకు తెలియకుండానే ప్రసరింప చేశాడని అన్నాడు. మతం అనేది పురాణాలు ఆధారంగా మానవుడి దుఃఖం, క్రూరత్వం, కోరికలు, బాధలు, అసమానతలు, చావు మొదలగు వాటిని వివరిస్తుంది. ఫ్రాయిడ్, అతని అనుచరులు తాము కనుగొన్నవాటికి పౌరాణిక అస్తిత్వాలపై ఆధారపడి స్పష్టమైన హేతువులు చూపించలేదు. మానవ చైతన్యం సామాజిక సృష్టిగా కాక స్వయం జనితం అని, స్వేచ్ఛా సంకల్పం లేదా సహజాతాలు సామాజిక ప్రభావాల ఆంక్షలకు గురికాని మేరకు మాత్రమే స్వేచ్ఛగా ఉంటాయనే అంతర్లీనంగాఉన్న ప్రమేయాలవల్ల ఫ్రాయెడిజమ్ అనేది ‘కోరికసంతృప్తి’ కలుషితం చేసిన అవాస్తవిక సైన్స్ అయింది. ఫ్రాయిడ్ చెప్పిన లిబిడో, అతడి శిష్యుడు ఆల్ఫ్రెడ్ ఎడ్లా చెప్పిన ‘ఆత్మరక్షణ సహజాతం’ రెండు మిధ్యల మధ్య తగాదా అని, కార్ల్ గుస్తావ్ జంగ్‌కు మెరుగైన శాస్త్రీయ దృక్పథం ఉన్నా ఫ్రాయిడ్ ద్వంద్వవాదం నుంచి బయటపడలేదు.
క్రిస్టోఫర్ కాడ్వెల్ దృష్టిలో రస్సెల్, లారెన్స్, వెల్స్, ఫ్రాయిడ్ లాంటి మేధావులు సామాజిక వ్యవస్థల ఒత్తిడి నుంచి మానవ సంస్కృతి, చైతన్యం ఎంతవిడిగా ఉంటే మనిషి అంత స్వేచ్ఛగా ఉంటాడని తప్ప్పుగా భావించారు. కాడ్వెల్ మానసిక శాస్త్రానికి సామాజిక శాస్త్రం పునాది అని భావించాడు. ‘పంజరంలోని జంతువు తాను ఉన్నది పంజరం అని గుర్తించనంత మాత్రాన అది స్వేచ్ఛగా ఉంటుందా?’ అని అతడు ప్రశ్నించాడు. మానసిక విశ్లేషణవేత్తలు చెప్పేటట్లు ఒక వ్యక్తి మరొకరిని పూర్తిగా నయం చేయగలడు అని భావించడం కాక ప్రపంచాన్ని మార్చడం అవసరమని మార్క్సిస్టు క్రిస్టోఫర్ కాడ్వెల్ వాదించాడు. క్రిస్టోఫర్ కాడ్వెల్ పెట్టుబడిదారీ విధానంలో అదృశ్యశక్తులను చేతనలోకి తెచ్చి, స్వేచ్ఛను పాజిటివ్‌గా నిర్వచించాడని, విశాలదృష్టి, కరుణ, సమకాలీన సంస్కృతి ఎదలోని అబద్ధాన్ని, ఆ సంస్కృతిని మార్చే లోతైన సత్యాన్ని వెలికి తెచ్చాడని ‘అంతరిస్తున్న సంస్కృతిలో అధ్యయనాలు’ పుస్తకం ముందు మాటలో జాన్ స్ట్రాచే రాశాడు.
టెక్నాలజీ వ్యామోహవాదులు, యధాతథ వాదులు, కుడిపక్ష మందమతులు, బూర్జువా ప్రజాస్వామ్య వాదులు రెచ్చిపోయి ప్రగతిశీలశక్తులపై దాడి చేస్తున్న నేడు క్రిస్టోఫర్ కాడ్వెల్ భావాలు స్వేచ్ఛలేని ఈ దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎక్కు పెట్టిన అక్షరాయుధాలు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *