కాకినాడ: వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా మరణించారని జిల్లా ఎస్పీ బిందుమాధవ్ తెలిపారు. స్థానికుల వివరాల ప్రకారం మృతుల సంఖ్య 23 వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది.
చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఘటన స్థలాన్ని సందర్శించి, వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాణాసంచా తయారీ కేంద్ర యజమాని, అతని తండ్రి, తొమ్మిది మంది మహిళలు ఇందులో మరణించారని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన తీరుపై అధికారులను ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుతం గాయపడిన ఆరుగురు కాకినాడ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరికొందరు ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించబడ్డారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించింది.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వ మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా సంఘటన స్థలాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై అధికారులు సమగ్ర విచారణ చేస్తున్నారు.


