అధికారుల మౌనం.. కల్తీ రాయుళ్లకు వరం!
విశాలాంధ్ర – విడపనకల్లు: పసిపిల్లలు నోటిలో వేసుకునే మిఠాయిలే ఇప్పుడు ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. మండలంలో విక్రయిస్తున్న కొన్ని మిఠాయిలు నిప్పు అంటిస్తే కొవ్వొత్తిలా కరుగుతున్న ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇది కల్తీ దందా తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీ ముద్రించడం చట్టరీత్యా తప్పనిసరి అయినప్పటికీ, ఇక్కడ విక్రయించే ప్యాకెట్లపై ఆ వివరాలు కనిపించడం లేదు. తనిఖీలను తప్పించుకునేందుకు తాత్కాలికంగా తేదీలు రాసి సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.బళ్లారి, గుంతకల్లు కేంద్రాలుగా ఈ దందా నడుస్తుండగా, విడపనకల్లు మండలంలో ప్రధాన కేంద్రంగా మారినట్లు సమాచారం. ఈ కల్తీ పదార్థాలు గ్రామాల వరకు చేరి, వాటిని తిన్న చిన్నారులు వాంతులు, విరేచనాలు వంటి ఆరోగ్య సమస్యలకు గురవుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు.ఇక బేకరీల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కేజీ కేక్ పేరుతో విక్రయిస్తున్న ఉత్పత్తుల్లో 180–200 గ్రాముల వరకు ప్యాకింగ్ బాక్సు బరువు ఉండటంతో వినియోగదారులు మోసపోతున్నారు. నాణ్యత లేని క్రీమ్, కలర్ పదార్థాలు ఉపయోగిస్తూ అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.హోటళ్లలో వాడిన నూనెను పదే పదే మరిగిస్తూ చికెన్ కబాబ్, బిర్యానీలు తయారు చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ విధంగా వాడిన నూనె ఆరోగ్యానికి హానికరమని, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి వ్యాధులకు దారి తీసే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.కిరాణా దుకాణాల్లోనూ నాణ్యత లేని సరుకులను అధిక ధరలకు విక్రయిస్తూ వినియోగదారులను మోసం చేస్తున్నట్లు ఫిర్యాదులు ఉన్నాయి.ఇంత జరుగుతున్నప్పటికీ ఫుడ్ సేఫ్టీ, లీగల్ మెట్రాలజీ, సివిల్ సప్లై అధికారుల నుంచి సరైన చర్యలు కనిపించకపోవడం పట్ల ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫిర్యాదులు, వార్తలు వచ్చినా క్షేత్రస్థాయిలో దాడులు జరగకపోవడం విమర్శలకు దారి తీస్తోంది.ప్రజల ప్రాణాల రక్షణ కోసం జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, ప్రత్యేక తనిఖీలు చేపట్టి కల్తీ కేంద్రాలను సీజ్ చేయాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.


