ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
విశాలాంధ్ర ధర్మవరం;; మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేయాలని ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు తాడిమర్రి, బత్తలపల్లి మండలాల నాయకులతో సమావేశం నిర్వహించారు.పొదుపు చర్యల్లో భాగంగా తొలిసారి వర్చువల్ విధానంలో నిర్వహించబోతున్న మహానాడు కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలిచేలా చేద్దామని.. పార్టీ శ్రేణులకు ధర్మవరం టీడీపీ ఇన్ ఛార్జి పరిటాల శ్రీరామ్ పిలుపునిచ్చారు. ఈనెల 27, 28తేదీల్లో నిర్వహించబోయే మహానాడుకి సంబంధించి వివరాలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి కరోనా సమయంలో మినహా మిగిలిన అన్ని సార్లు మహానాడు కార్యక్రమాన్ని ఒక పండుగలా
నిర్వహించుకున్నామన్నారు. అయితే ఈసారి ఆర్థిక మాంద్యం దృష్ట్యా ప్రధాన మంత్రి మోదీ పిలుపు మేరకు మహానాడును వర్చువల్ విధానంలో నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఇది చాలా మందికి కొంత బాధ కల్గించినా.. అధినేత నిర్ణయం, భవిష్యత్ దృష్ట్యా మనం వర్చువల్ విధానంలో నిర్వహించుకుందామన్నారు. ప్రతి యేటా ఎంతో ఘనంగా నిర్వహించుకునే మహానాడుని ఎందుకిలా జరుపుకుంటున్నారని ప్రజలు అనుకున్నప్పుడు వారికి కూడా ఆర్థిక మాంద్యం గురించిన సందేశం చేరాలన్నారు. భవిష్యత్ దృష్ట్యా ప్రతి ఒక్కరూ పొదుపు చర్యలు చేపట్టాలనే సందేశాన్ని ఇవ్వాలన్నారు. తాడిమర్రి మండలంలో ఒకే చోట నుంచి కార్యక్రమం ఉంటుందని.. బత్తలపల్లి మండలంలో రెండు చోట్ల కార్యక్రమం ఉంటుందన్నారు. అక్కడ ప్రతి ఒక్క కార్యకర్త పాల్గొనాలన్నారు. మరోవైపు మనకు ఎన్ని బాధలు ఉన్నా.. ఎన్ని కష్టాలు ఉన్నా.. ప్రజల వైపు నిలవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందుకే జూన్ నుంచి ప్రజా బాట పట్టాలని శ్రీరామ్ అన్నారు. ఈ కార్యక్రమంలో తాను కూడా పాల్గొంటానని.. ప్రజల సమస్యల పరిష్కారం కోసం మనం మళ్లీ రంగంలోకి దిగాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మన పార్టీ గెలిచే విధంగా కృషి చేద్దామని శ్రీరామ్ పిలుపునిచ్చారు.


