హైదరాబాద్: హోరాహోరీగా సాగుతోన్న ఐపీఎల్ పోటీల్లో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. జోరుమీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో వరుస విజయాలతో ఫామ్‌లో ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనుంది. అయిదు మ్యాచ్‌ల్లో రెండేసి విజయాలతో ఒకే స్థితిలో ఉన్న ఈ జట్ల మధ్య పోరుకు శనివారం ఉప్పల్ స్టేడియం వేదికగా నిలవనుంది. గాయం కారణంగా తొలి అయిదు మ్యాచ్‌ల్లో ఆడని చెన్నై మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా లేదా అన్నది ఆసక్తి రేపుతోంది. హైదరాబాద్‌కు ధోని వస్తున్నాడన్న సమాచారంతో ఈ మ్యాచ్ టిక్కెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. రాజస్థాన్‌తో జరిగిన గత మ్యాచ్‌కు సీనియర్ బౌలర్లు ఉనద్కత్, హర్షల్ పటేల్ స్థానంలో జట్టులోకొచ్చిన అన్‌క్యాప్డ్ ఆటగాళ్లుప్రఫుల్ హింగే, సకిబ్ హుస్సేన్ సంచలన ప్రదర్శనతో సన్‌రైజర్స్‌కు అద్భుత విజయాన్నందించారు. అభిషేక్‌శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్‌కుమార్‌రెడ్డిలతో కూడిన పటిష్టమైన బ్యాటింగ్ విభాగానికి ప్రఫుల్, సకిబ్ తోడవడంతో సన్‌రైజర్స్ బలం ఒక్కసారిగా రెట్టింపయింది.
మూడు వరుస ఓటముల తర్వాత చెన్నై రెండు వరుస విజయాలతో పుంజుకుంది. సంజు శాంసన్ ఫామ్‌లోకి రావడం ఆ జట్టుకు గొప్ప ఉపశమనమే. అయితే చెన్నైని గాయాల సమస్యలు వేధిస్తున్నాయి. పేసర్ ఖలీల్ అహ్మద్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ధోని ఫిట్‌నెస్ సాధించాడా… ఈ మ్యాచ్‌లో అయినా ఆడతాడా అన్నదానిపై స్పష్టత లేదు. కానీ అతను ఆడకపోయినా, డగౌట్లో అయినా కనిపించే అవకాశముంది. కెప్టెన్ రుతురాజ్ పేలవ ఫామ్ చెన్నైకి ఆందోళన కలిగిస్తోంది. ఈ మ్యాచ్‌కు అతడి స్థానంలో ఆయుష్ మాత్రేను ఓపెనర్‌గా పంపిస్తారని తెలుస్తోంది.
The post ధోని ఈరోజైనా దిగుతాడా? appeared first on Visalaandhra.


