తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 95.15 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. సీనియర్ నేత కే. కేశవరావు ఈ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు.ఎప్పటిలాగే ఈసారి కూడా ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 96.26 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలురు 94.07 శాతంతో కాస్త వెనుకబడ్డారు. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 5,28,239 మంది విద్యార్థులు హాజరయ్యారు.ఫలితాల్లో ములుగు జిల్లా 99.30 శాతంతో రాష్ట్రంలోనే అత్యధిక ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలవగా, 89.23 శాతంతో హైదరాబాద్ జిల్లా అత్యల్ప ఉత్తీర్ణతతో చివరి స్థానంలో నిలిచింది. సాంఘిక సంక్షేమ గురుకులాల్లో 99.10 శాతం ఉత్తీర్ణత నమోదవడం విశేషం. ఇక మీడియంల వారీగా చూస్తే.. ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 95.86 శాతంతో సత్తా చాటగా, తెలుగు మీడియంలో 89.14 శాతం, ఉర్దూ మీడియంలో 86.71 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు.ఈ ఏడాది విద్యాశాఖ రెండు కీలక మార్పులు చేసింది. గతంలో మాదిరిగా గ్రేడ్లు కాకుండా, ఈసారి సబ్జెక్టుల వారీగా మార్కులను వెల్లడించారు. అంతేకాకుండా, విద్యార్థుల సౌలభ్యం కోసం తొలిసారిగా వాట్సాప్ ద్వారా ఫలితాలు తెలుసుకునే సదుపాయాన్ని కల్పించారు. తమ ఫలితాలను పొందాలనుకునే వారు 80969 58096 అనే వాట్సాప్ నెంబర్‌కు hi అని మెసేజ్ పంపితే చాలు, వివరాలు వస్తాయి.వాట్సాప్‌తో పాటు అధికారిక వెబ్‌సైట్లలో కూడా విద్యార్థులు తమ మార్కుల మెమోలను చూసుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు సులభంగా ఫలితాలను తెలుసుకునే వీలు కలిగింది.
మరోవైపు, ఫలితాలపై రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రేపటి నుంచి మే 15 వరకు అవకాశం కల్పించారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను జూన్ 5 నుంచి 12 వరకు నిర్వహించనుండగా, ఈ పరీక్షల ఫీజు చెల్లింపునకు మే 14వ తేదీని ఆఖరి గడువుగా నిర్ణయించారు.
The post తెలంగాణలో టెన్త్ ఫలితాలు విడుదల… బాలికలదే పైచేయి appeared first on Visalaandhra.


