తీరని రైతు గోస! – Visalaandhra


. మైక్రో ఇరిగేషన్‌లో అగ్రగామిగా ఏపీ
. అయినా తప్పని తిప్పలు
. పరిష్కారం లేని సాంకేతిక సమస్యలు
. నిర్వహణ భారంతో అల్లాడుతున్న అన్నదాత

విశాలాంధ్ర-సచివాలయం: నవ్యాంధ్రప్రదేశ్ వ్యవసాయ ముఖచిత్రం మారుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 1.26 లక్షల హెక్టార్లను మైక్రో ఇరిగేషన్ పరిధిలోకి తెచ్చి, దేశంలోనే అగ్రస్థానంలో నిలిచి ఏపీ రికార్డు సృష్టించింది. గుజరాత్ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి, రూ. 1030 కోట్ల భారీ సబ్సిడీతో హార్టికల్చర్ హబ్‌గా అవతరించింది. అయితే రైతుల పరిస్థితి పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థలు, స్ప్రింక్లర్ పద్ధతులు, మైక్రో జెట్ పరికరాలు వంటి సాంకేతిక పద్ధతులు రైతులకు అందుబాటులోకి రావడంతో విభిన్న పంటలలో మైక్రో ఇరిగేషన్ వినియోగం పెరుగుతోంది. టమాటా మిరప, ఆయిల్ పామ్, పప్పు ధాన్యాలు ముఖ్యంగా ఉద్యాన పంటలలో ఈ పద్ధతి విస్తృతంగా అమలవుతోంది. మైక్రో ఇరిగే షన్ ద్వారా నీటి వినియోగం గణనీయంగా తగ్గింది. 30శాతం నుంచి 50 శాతం వరకు నీటి ఆదా, మట్టిలో తేమ నిల్వ ఎరువుల సమర్థ వినియోగం వంటి ప్రయోజనాలు రైతులకు లభిస్తున్నాయి. ఈ పథకం ద్వారా 1,08,143 మంది రైతులు ప్రత్యక్షంగా ప్రయో జనం పొందారని…చిన్న, సన్నకారు రైతులు, ఉద్యాన పంటల సాగుదారులు అందరికీ ఈపథకం అందుబా టులోకి చెబుతోంది. తక్కువ నీటితో ఎక్కువ దిగు బడి సాధ్యమవుతోంది. ఖర్చులు తగ్గి లాభాలు పెరు గుతున్నాయని రైతులు చెబుతున్నారు. రాబోయే సంవత్సరాల్లో మరిన్ని వేల హెక్టార్లను మైక్రో ఇరిగే ‘షన్ కిందకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఈ గణాంకాల వెనుక రైతులకు ఎదురవుతున్న సాంకేతిక, ఆచరణాత్మక ఇబ్బందులపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సబ్సిడీలు అందుతున్నా, ఆ పరికరాలను కాపాడుకోవడానికి, సాగును కొనసాగించడానికి రైతులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతంగా ఉన్నాయి. మైక్రో ఇరిగేషన్ అమలులో రైతులకు ప్రధాన సమస్యలు శాపంగా మారుతున్నాయి. భూగర్భ జలాల్లో ఉప్పు శాతం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో డ్రిప్ పైపులు అతి త్వరగా మూసుకుపోతు న్నాయి. లోపల పేరుకుపోయిన లవణాల వల్ల నీరు సమానంగా రాక, తోటల్లో కొన్ని చెట్లు ఎండిపోతుంటే, మరికొన్నింటికి ఎక్కువ నీరందుతోంది. వీటిని క్లీన్ చేయడానికి వాడే ‘యాసిడ్ ట్రీట్‌మెంట’ పద్ధతి సాధారణ రైతులకు తెలియకపోవడం, తెలిసినా అది ప్రమాదకరంగా ఉండటం పెద్ద సమస్యగా మారుతుంది. నీటి కోసం అడవి పందులు, ఎలుకలు, ఉడుతలు డ్రిప్ పైపులను కొరుకుతున్నాయి. ఒకే ఒక్క రాత్రిలో వేల రూపాయల విలువైన లెటరల్ పైపులు పనికిరాకుండా పోతున్నాయి. పైపులకు పదే పదే జాయింట్లు వేయడం వల్ల ప్రెజర్ తగ్గి, సిస్టమ్ మొత్తం దెబ్బతింటోంది. దీనికి శాశ్వత పరిష్కారం లేక రైతులకు అదనపు ఖర్చు భారమవుతోంది. సబ్సిడీ కింద సరఫరా అవుతున్న కొన్ని కంపెనీల పరికరాలు అతి తక్కువ కాలంలోనే పాడవుతున్నాయి. ఎండ తీవ్రతకు పైపులు పగుళ్లు ఇస్తున్నాయి. పరికరాలు అమర్చిన తర్వాత ఏవైనా సమస్యలు వస్తే కంపెనీ ప్రతినిధులు స్పందించడం లేదు. సర్వీసింగ్ సెంటర్లు అందుబాటులో లేకపోవడం వల్ల రైతులు స్థానిక మెకానిక్కులను ఆశ్రయించి మోసపోతున్నారు. డ్రిప్ సిస్టమ్ సరిగ్గా పనిచేయాలంటే మోటార్ నుంచి స్థిరమైన వోల్టేజీతో కూడిన ఒత్తిడి ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో లో-వోల్టేజీ సమస్యల వల్ల ఫిల్టర్లు పేలిపోవడం, పైపులు పగిలిపోవడం వంటివి జరుగుతున్నాయి. నీటి ద్వారా ఎరువులను పంపే పద్ధతిపై రైతులకు సరైన శిక్షణ లేదు. ఏ ఎరువులు వాడాలి? ఎంత మోతాదులో వాడాలి? అనే విషయంలో స్పష్టత లేక, డ్రిప్ పరికరాలు పాడవ్వడమే కాకుండా పంట దిగుబడి కూడా తగ్గుతోంది. కేవలం పైపులు ఇవ్వడమే కాకుండా, ప్రతి మండలానికి ఒక మైక్రో ఇరిగేషన్ సర్వీస్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలి.
అడవి జంతువుల వల్ల దెబ్బతిన్న పైపులకు బీమా సౌకర్యం కల్పించాలి. సబ్సిడీ కంపెనీల పరికరాలపై థర్డ్ పార్టీ క్వాలిటీ ఆడిట్ నిర్వహించి, నాసిరకం కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలి. రైతులకు క్షేత్రస్థాయిలో శాస్త్రవేత్తలతో అవగాహన సదస్సులు నిర్వహించాలి. రికార్డుల పరంగా రాష్ట్రం అగ్రస్థానంలో ఉండటం గర్వకారణమే. కానీ, ఆ గర్వం రైతు ముఖంలో చిరునవ్వుగా మారాలంటే పైన పేర్కొన్న ఇబ్బందులను పరిష్కరించడం తక్షణ అవసరం. అయితే, కేవలం సబ్సిడీతో పరికరాలు అందించి చేతులు దులుపుకోకుండా, అమ్మకం తర్వాత సేవలు క్షేత్రస్థాయి సాంకేతిక శిక్షణపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. అప్పుడే “ప్రతి చుక్కకు – ఎక్కువ పంట” అనే లక్ష్యం సాకారమై, ఆంధ్రప్రదేశ్ నిజమైన హార్టికల్చర్ హబ్‌గా మారుతుంది. సాంకేతికత రైతు గుమ్మం తొక్కితే సరిపోదు.. అది రైతు చేతిలో పనిముట్టుగా మారాల్సిన అవసరం ఉంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *