ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న నాగచైతన్య
హైదరాబాద్: ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (ఐఎన్‌సీఏ) అవార్డుల ప్రదానోత్సవం గురువారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముంబయి వేదికైంది. బాలివుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ వర్గాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. చిత్ర పరిశ్రమలన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొస్తూ.. నిర్వహించిన ఈ ఈవెంట్‌లో చాలామంది సినీ ప్రముఖులు సందడి చేశారు. టాలీవుడ్ యాక్టర్ రానా, నటి శ్రియ, బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ వ్యాఖ్యాతలుగా అదరగొట్టారు. ఈ వేడుకల్లో టాలీవుడ్ నుంచి ఉత్తమ నటుడిగా నాగచైతన్య అవార్డు అందుకున్నారు. ‘తండేల’ సినిమాకు గాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి, ఉత్తమ హాస్యనటుడిగా మాస్టర్ రేవంత్ అవార్డులు అందుకున్నారు. రాణా వ్యాఖ్యానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తన వ్యాఖ్యానంలో దక్షిణ భారత చలచిత్ర రంగం గురించి చెపుతూ…తెలుగు సినిమాలు సాధించిన విజయాలను ప్రస్తావించారు. బాహుబలి, పుష్ప, సైరా నరసింహారెడ్డి సినిమాల గురించి చెప్పారు. ‘రఫ్ ఆడించెస్తా’ అంటూ చిరంజీవి డైలాగ్‌లు, ‘యమహోనగరి కలత్తా పురి’ అనే వేటూరి గేయ ప్రస్తావన తెచ్చారు. సందర్భం వచ్చినప్ప్పుడల్లా తెలుగు సినిమా విశేషాలను వివరించారు.


