అమలులోకి వచ్చిన మహిళా రిజర్వేషన్ యాక్ట్.. గురువారం అర్ధరాత్రి నోటిఫికేషన్


చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే చారిత్రక మహిళా రిజర్వేషన్ చట్టం 2026 ఏప్రిల్ 16 నుంచి అమల్లోకి వచ్చింది. వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు పార్లమెంట్ 2023లోనే ఆమోదముద్ర పడింది. మూడేళ్ల కిందటే చట్టంగా మారింది. అయితే, ఈ చట్టాన్ని గురువారం (ఏప్రిల్ 16) నుంచి అమలులోకి తీసుకొచ్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ మేరకు గురువారం రాత్రి అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ చట్టాన్ని 2029 సాధారణ ఎన్నికల నాటికే అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ఇందుకోసం పార్లమెంటులో కొత్త రాజ్యాంగ సవరణ బిల్లును (131వ) ప్రవేశపెట్టింది.2023లో ఆమోదించిన చట్టం ప్రకారం.. కొత్త జనగణన, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) తర్వాతే లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో మహిళా రిజర్వేషన్లు అమలు కావాల్సి ఉంది. అయితే, ఈ ప్రక్రియ ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో.. జనగణన, డీలిమిటేషన్‌తో సంబంధం లేకుండా (డీలింకింగ్) రిజర్వేషన్లను అమలు చేయాలని తాజా బిల్లులో ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనిపై ప్రస్తుతం పార్లమెంటులో చర్చ జరుగుతోంది.కొత్త ప్రతిపాదనల ప్రకారం లోక్‌సభ స్థానాలను ప్రస్తుతమున్న 543 నుంచి 816కి పెంచే అవకాశం ఉందని తెలుస్తోంది. 2027లో జరగబోయే జనగణన కోసం ఆగకుండా, 2011 జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ఈ పునర్విభజన వల్ల జనాభా నియంత్రణ పాటించిన దక్షిణాది రాష్ట్రాలు లోక్‌సభలో సీట్లు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.ఈ ఆందోళనలపై పార్లమెంటులో స్పందించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏ రాష్ట్రానికీ అన్యాయం జరగదని, ఎవరి సీట్లు తగ్గవని హామీ ఇచ్చారు. మహిళా సాధికారతకు ఇది పెద్ద ముందడుగు అని ప్రభుత్వం చెబుతుండగా, దీని అమలు వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయని విపక్షాలు విమర్శిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *