5 గ్రామాలపై ప్రత్యేక దృష్టి
ఐదుగురు సభ్యులతో రాష్ట్ర స్థాయి కమిటీ
విశాలాంధ్ర-సచివాలయం :అమరావతి రాజధాని ప్రాంతంలో కొంతకాలంగా అపరిష్కృతంగా ఉన్న జరీబు, మెట్ట భూముల వర్గీకరణ సమస్యను పరిష్కరించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక అడుగు వేసింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాష్ట్ర స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం కమిటీని నియమించడమే కాకుండా, పక్కాగా నివేదిక సమర్పించాల్సిన సమయ పరిమితిని కూడా నిర్ణయించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ రాష్ట్ర స్థాయి కమిటీ, 5 గ్రామాల్లోని 202.205 ఎకరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్దిష్ట కాలపరిమితిలో (సాధారణంగా 15 నుంచి 30 రోజుల్లోపు) సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించింది. రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నందున ఎటువంటి జాప్యం లేకుండా రైతులకు న్యాయం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సమస్య ఒక్క రోజులో పుట్టుకొచ్చింది కాదు. దీని వెనుక గత కొన్ని ఏళ్ల పరిణామాలు ఉన్నాయి. 2014-15 ల్యాండ్ పూలింగ్‌లో రాజధాని కోసం భూములు సేకరించినప్ప్పుడు భూగర్భ జల మట్టం, సాగు ఆధారంగా భూములను జరీబు, మెట్టగా విభజించారు. అయితే అప్పట్లో సుమారు 202 ఎకరాల విషయంలో తప్ప్పుడు వర్గీకరణ జరిగిందని రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో స్థానిక స్థాయి (మండల/డివిజన్) కమిటీలు కొన్ని నివేదికలు ఇచ్చినప్పటికీ, వాటిలో స్పష్టత లేకపోవడంతో రైతులు కోర్టులను, ఉన్నతాధికారులను ఆశ్రయించారు. తాజా జీవో గతంలో ఉన్న అస్పష్టతను తొలగిస్తూ, ఇప్ప్పుడు రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో ఒక ఫైనల్ కమిటీని ఏర్పాటు చేస్తూ తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కమిటీ ఇచ్చే నివేదికే తుది నిర్ణయంగా పరిగణించబడుతుంది. ప్రధాన గ్రామాలు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, కృష్ణాయపా లెంలో రెవెన్యూ రికార్డులు, క్షేత్రస్థాయిలో బోర్ల ఉనికి, గత పంటల సరళి ఆర్థిక ప్రభావాన్ని గుర్తించనున్నారు. జరీబుగా గుర్తిస్తే, రైతులకు ఎకరాకు రూ.20 వేలు అదనపు కౌలు, మెరుగైన ప్లాట్లు లభి స్తాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, కమి టీ నివేదిక అందిన వెంటనే అర్హులయిన రైతుల జాబితాను సవరించడం, పెరిగిన కౌలు మొత్తాన్ని బకాయిలతో సహా లెక్కించడం, ల్యాండ్ పూలింగ్ సర్టిఫికెట్లలో భూమి రకం మార్పును సీఆర్డీఏ కమిషనర్ చేయనున్నారు. ఈ చర్య ద్వారా అమరా వతి రాజధాని నిర్మాణానికి సహకరించిన రైతులకు ప్రభుత్వంపై నమ్మకం పెరగడమే కాకుండా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
రైతులకు కలిగే అసలు ప్రయోజనం
భూమి వర్గీకరణ మారడం వల్ల రైతులకు కేటాయించే ప్లాట్ల విస్తీర్ణంలో వార్షిక కౌలులో భారీ మార్పు వస్తుంది. మెట్ట భూములతో పోలిస్తే జరీబు భూములకు ప్రభుత్వం ఇచ్చే నివాస, వాణిజ్య ప్లాట్ల వాటా ఎక్కువగా ఉంటుంది. మెట్ట భూమి ఎకరాకు రూ.30 వేలు కౌలు. జరీబు భూమి ఎకరాకు రూ.50 వేలు కౌలు. దీనివల్ల రైతులకు ఏటా ఎకరాకు రూ.20 వేలు అదనపు ఆదాయం లభిస్తుంది. గతంలో మెట్ట కింద తక్కువ కౌలు పొందిన రైతులకు జరీబుగా నిర్ధారణ అయితే పాత బకాయిలు కూడా చెల్లించే అవకాశం ఉంది.
రాజధాని నిర్మాణ పనులు వేగవంతమవుతున్న తరుణంలో గతంలో జరీబు, మెట్ట భూములకు మధ్య ప్లాట్ల కేటాయింపులో ఉన్న వ్యత్యాసం వల్ల రైతులు నష్టపోతున్నామని ఫిర్యాదు చేశారు. తాజా పునః పరిశీలన నిర్ణయంతో వందలాది మంది రైతులకు న్యాయం జరిగే అవకాశం ఉంది. అదేవిధంగా ప్రభుత్వం భూములిచ్చిన రైతుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించి, వారికి న్యాయబద్ధంగా దక్కాల్సిన ప్రయోజనాలను అందించడమే ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం.
The post అమరావతి ‘జరీబు’వివాదానికి తెర appeared first on Visalaandhra.


