మళ్లీ పెరిగిన సీఎన్‌జీ ధర – Visalaandhra


కిలోకు రూ.2 పెంపు
11 రోజుల్లో నాలుగుసార్లు వాత

న్యూదిల్లీ: మోదీ ప్రభుత్వం ప్రజలపై మోయలేని భారం మోపుతోంది. పేద, ధనిక తేడా లేకుండా అందరిపై భారం పడేలా వరుసగా పెట్రో ధరలు పెంచుతోంది. చమురు సంస్థలు నష్టాల ఊబిలో కూరుకుపోయాయని, వాటిని గట్టెక్కించడానికి పెట్రో ధరలు పెంచడం తప్పడం లేదని సన్నాయి నొక్కులు నొక్కుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పదిరోజుల వ్యవధిలో నాలుగసార్లు పెంచింది. తాజాగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) వంతు వచ్చింది. గ్యాస్ పంపిణీ సంస్థలు కిలో రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ఈ రేటు మంగళవారం ఉదయం నుంచే అమల్లోకి వచ్చింది. దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న సీఎన్‌జీ ధరలు పెరిగాయి. తాజా పెంపుతో దిల్లీ, ఎన్‌సీఆర్ రీజియన్‌లో కిలోకు రూ.83 కు చేరింది. మే 15 నుంచి ఇలా పెంచుకుంటూ రావడం ఇది నాలుగోసారి. అంతకుముందు మే 15న రూ.2, మే 18న రూ.1, మే 23న మరో రూ.1 పెంచాయి. తాజాగా రూ.2 పెంపుతో కేవలం 11 రోజుల్లోనే దాదాపు రూ.6 వరకు ధరలు పెరిగాయి. సీఎన్‌జీ ధరలు నగరాల వారీగా పరిశీలిస్తే… దిల్లీలో రూ.83, ముంబైలో రూ.81, పూణెలో రూ.92.50, నాగపూర్‌లో రూ.88.90కి చేరుకున్నాయి. హైదరాబాద్‌లో రూ.99, విజయవాడలో రూ.93, గుంటూరులో రూ.92, బెంగళూరులో రూ.90, చెన్నైలో రూ.91.5కు ధరలు పెరిగాయి. కాలుష్య నియంత్రణ లక్ష్యాలతో ప్రభుత్వాలు సీఎన్‌జీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారత్‌లో ముఖ్యంగా దిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో నగరాలతో పాటు టైర్ టూ సిటీల్లో, పట్టణాల్లోనూ సీఎన్‌జీ వాహనాల వినియోగం అధికంగా ఉంది. ఆటోలు, క్యాబ్‌లు, నగర బస్సులు వంటి రవాణా రంగం పెద్ద మొత్తంలో ఈ ఇంధనంపై ఆధారపడుతున్నాయి. ఒకవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండగా… ఇప్ప్పుడు తక్కువ ఖర్చు ప్రత్యామ్నాయంగా భావించిన సీఎన్‌జీ ధర పెంచడంతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *