విశాలాంధ్ర – ఉరవకొండ (అనంతపురం జిల్లా) : ఉరవకొండ మండలం లత్తవరం గ్రామంలో గురువారం ఆధ్యాత్మిక వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని కొండపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అలాగే భోగేశ్వర స్వామి శివాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. గ్రామ శాంతి, శ్రేయస్సు కోసం ప్రత్యేక మండల పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించిన గ్రామ నాయకులు కొర్రపాటి మల్లికార్జున, వారి సతీమణిని గ్రామ పంచాయతీ తరఫున ఘనంగా సన్మానించారు. గ్రామ మాజీ సర్పంచ్ బోధపాటి గోవిందప్ప, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సచివాలయ సిబ్బంది కలిసి శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ వేడుకల్లో గ్రామ నాయకులు, యువకులు, మహిళలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


