శాసన సభాపతి అయ్యన్నపాత్రుడు
విశాలాంధ్ర-సచివాలయం: వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకోవడంపై రాష్ట్ర శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగి ఆఫీసుకు వెళ్లకుండా జీతం అడిగితే ఎలా ఉంటుందో, ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతభత్యాలు తీసుకోవడం కూడా అలాగే ఉంటుందని, ఇలాంటి వారిని వెనక్కి పిలిపించే ‘రైట్ టు రీకాల’ విధానం మన దేశంలో రావాలని అభిప్రా యం వ్యక్తం చేశారు. మంగళవారం అసెంబ్లీలో మీడియా చిట్ చాట్‌లో అధికార, ప్రతిపక్షాల తీరుపై సూటిగా, స్పష్టంగా స్పందించారు. ‘రైట్ టు రీకాల’ ప్రతిపాదనను తాను ఇప్పటికే లక్నోలో జరిగిన స్పీకర్ల సదస్సులో పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్లాలని చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకుంటున్నారని, దీనిపై ప్రజల్లో కూడా వ్యతిరేకత ఉందని ఆయన అన్నారు. మంగళవారం సభ ఆలస్యానికి కారణం సాంకేతిక లోపమేనని, ‘టెక్నికల్ ప్రాబ్లమ్ వస్తే ఎవరైనా ఏం చేస్తారు? సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అవుతున్నప్ప్పుడు వేచి చూడాల్సిందే. కానీ వైసీపీ నేతలు దీనిపై కూడా బురద జల్లడం వారి రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనం’ అని విమర్శించారు. సభకు సభ్యులు రాలేదని, కోరం లేదని వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. గతంలో అసెంబ్లీకి వచ్చి సంతకం పెట్టి వెళ్లిపోయే సంస్కృతి ఉండేదని, కానీ ఇప్ప్పుడు పరిస్థితి మారిందని స్పీకర్ వివరించారు. సభ్యులు అసెంబ్లీకి రావడం మాత్రమే కాదు, సభ లోపల ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు కూర్చున్నారనేది సాఫ్ట్‌వేర్ రికార్డ్ చేస్తోందని తెలిపారు. డిజిటల్ అటెండెన్స్ వల్ల సభ్యుల బాధ్యత పెరుగుతుందని, ప్రజలకు వారు ఎంత సమయం కేటాయిస్తున్నారో తెలుస్తుందని అన్నారు. అసెంబ్లీని చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా విపరీతమైన ఆసక్తి నెలకొందని, రాయలసీమ నుంచి విశాఖ వరకు ఉన్న పాఠశాలల నుంచి దాదాపు 200 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. మునుపటిలా ప్రత్యక్షంగా పోరాడకుండా… ఇప్ప్పుడు వెనుక ఉండి గోతులు తీసే రాజకీయాలకు వైసీపీ తెరలేపిందని స్పీకర్ ఆరోపించారు. సభకు రాకుండా బయట ఉండి విమర్శలు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని, వారిపై త్వరలోనే కఠిన నిర్ణయం తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
The post పని చేయని వారికిజీతాలెందుకు? appeared first on Visalaandhra.


