గేట్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో ఏపీకి కొత్త దశ-దిశ


ప్రజా సాధికారత, సంపద సృష్టే లక్ష్యం
. బిల్ గేట్స్‌తో సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు
. కుప్పంలో సంజీవని ప్రాజెక్టు అమలుపై గేట్స్ ప్రశంస
. డిజిటల్ విప్లవంలో సీఎం పాత్ర కీలకమంటూ కితాబు

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గేట్స్ ఫౌండేషన్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంతో రాష్ట్ర అభివృద్ధికి కొత్త దశ-దిశ ఏర్పడుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. గేట్స్ ఫౌండేషన్ చైర్మన్ బిల్‌గేట్స్ అమరావతి రాక చారిత్రాత్మకంగా నిలుస్తుందని, ఆంధ్రప్రదేశ్ ప్రజల సాధికారతకు ఇది దోహదపడుతుందని సీఎం అన్నారు. బిల్‌గేట్స్ అమరావతి పర్యటనలో భాగంగా సోమవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి… ముందుగా గేట్స్, ఆయన బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బిల్ గేట్స్‌తో తన అనుబంధాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. 1997లో మొదటిసారి తాను బిల్ గేట్స్‌ను కలిసి హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను వివరించానని, ఆ కంపెనీ రాకతోనే నేడు హైదరాబాద్ ఐటీ రంగంలో మేటిగా నిలబడిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం తాను ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. ఏపీలో వనరులకు లోటు లేదని, సంపద సృష్టి జరగాల్సి ఉందన్నారు. గేట్స్ ఫౌండేషన్ సహకారంతో 2047 నాటికి రాష్ట్రాన్నినెంబర్‌వన్ చేస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
చంద్రబాబు విజనరీ అని ఆనాడే తెలిసింది
సమావేశంలో మాట్లాడిన బిల్ గేట్స్…డిజిటల్ విప్లవానికి భారత్‌లో బలమైన పునాదులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. భారతదేశ డిజిటల్ విప్లవంలో ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు కీలక పాత్ర పోషిస్తున్నారని కితాబిచ్చారు. తాను మొదటిసారి చంద్రబాబును కలిసినప్పుడు ఆయన ఆలోచనల్లో ముందుచూపు ఉందనే విషయాన్ని ఆనాడే గ్రహించినట్టు వెల్లడించారు. ఈ విషయంలో నాటి సింగపూర్ ప్రధాని మాత్రమే చంద్రబాబుకు కొంత దగ్గరగా ఉన్నారని చెప్పారు. గేట్స్ ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాల్లో ఆరోగ్య రంగానికి చెందిన ప్రాజెక్టులే మెజార్టీ ప్రాజెక్టులని తెలిపారు. ఆరోగ్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్నది తన ఆశయమన్నారు. కుప్పంలో అమలు చేస్తున్న సంజీవని కార్యక్రమం అద్భుతంగా ఉందని అభినందించారు. విద్యార్థుల సమస్యలను అర్థం చేసుకోవడానికి, వారికి సరైన రీతిలో, తగిన స్థాయిలో విద్యా బోధన చేయడానికి ఏఐ సహాయపడుతుందన్నారు. విద్యారంగంలో మార్పు తీసుకురావడానికి ఏఐ-టెక్నాలజీ ఉపయోగపడు తుందని చెప్పిన బిల్ గేట్స్, వ్యవసాయం రంగం చాలా ముఖ్యమైనదిగా అభిప్రాయపడ్డారు. టెక్నాలజీ సాయంతో ఏపీ ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం…టెక్నాలజీని రైతులకు అందించేందుకు… ఏఐని వ్యవసాయంతో ఇంటిగ్రేట్ చేస్తూ కృషి చేయడాన్ని అభినందించారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా వ్యవసాయంలో ఏఐని ఇంతలా వినియోగంచడం లేదని… కానీ ఆంధ్రప్రదేశ్ ఈ విషయంలో ముందుండటం మంచి పరిణామమని చెప్పారు. విపత్తుల నిర్వహణ కోసం టెక్నాలజీతో ముందస్తు అంచనాలు వేసి, ప్రాణ నష్టం జరగ్గకుండా జాగ్రత్తలు తీసుకునే వ్యవస్థ ఏర్పాటు చేయడం బాగుందన్నారు. చంద్రబాబు తనకు గుడ్ ఓల్డ్ ఫ్రెండ్ అని సమావేశంలో బిల్ గేట్స్ సరదాగా వ్యాఖ్యానించారు.
పది సూత్రాలతో స్వర్ణాంధ్ర-2047 సాకారం
స్వర్ణాంధ్ర 2047 విజన్, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పాలసీలు, లక్ష్యాలు, కార్యక్రమాలపై బిల్ గేట్స్‌కు ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇచ్చారు. జీరో పావర్టీ, సంపూర్ణ ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, నీటి భద్రత, రైతు-అగ్రి టెక్, ప్రపంచ స్థాయి లాజిస్టిక్స్, ఎనర్జీ-ఫ్యూయల్, ప్రోడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్ వంటి 10 సూత్రాలతో స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అనేది ఏపీ ప్రభుత్వ విధానమని, దీనికి ఆధార్ ధృవీకరణ, వ్యక్తిగత, కుటుంబ డేటా లేక్, కుటుంబ సమాచారం, రాష్ట్ర-కేంద్ర ప్రభుత్వ సమగ్ర డేటా, అవేర్ ద్వారా రియల్ టైమ్ డేటా సేకరణ, వాట్సాప్ గవర్నెన్స్, డీజీ వెరిఫై వంటి అప్లికేషన్ల వినియోగం ద్వారా భవిష్యత్ కోసం పూర్తి సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు. టెక్నాలజీ ఆధారిత థీమాటిక్ క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అలాగే క్వాంటం వ్యాలీ-డిజైన్ – ఫౌండ్రీగా అమరావతి, డేటా-ఏఐ సిటీగా విశాఖ, గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా కాకినాడ, డ్రోన్ సిటీగా ఓర్వకల్లు, ఎలక్ట్రానిక్స్-ఏరో సిటీగా లేపాక్షి, ఎలక్ట్రానిక్స్-స్పేస్ సిటీగా తిరుపతిని అభివృద్ధి చేస్తున్నట్టు వివరించారు. రాష్ట్రంలో మొత్తం 10 రంగాలు, 30 ప్రభుత్వ విభాగాల్లో ఏఐని వినియోగిస్తున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. 98 ఏఐ యూజ్ కేసులు, 43 హ్యాకథాన్లు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయన్నారు.మొత్తం 7 డేటా లెక్ ప్రాజెక్టులు ప్రారంభించినట్టు తెలిపారు.
2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా రాష్ట్రం
స్వర్ణాంధ్ర-2047 నాటికి ముఖ్య లక్ష్యాలు నిర్దేశించుకున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ‘ప్రస్తుతం 180 బిలియన్ డాలర్లుగా ఉన్న రాష్ట్ర ఎకానమీని 2.4 ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీగా తీర్చిదిద్దడం, తలసరి ఆదాయం ప్రస్తుతం 3,400 డాలర్లు ఉండగా 2047 నాటికి దీనిని 42,000 డాలర్లకు పెంచడం, ఎగుమతులు 20.7 బిలియన్ డాలర్ల నుంచి 450 బిలియన్ డాలర్లకు పెంచడం, నిరుద్యోగితను 4.1 శాతం నుంచి 2 శాతం కన్నా తగ్గించడం, మహిళా కార్మికుల సంఖ్యను 45.8 శాతం 80 శాతానికి పెంచడం, ప్రస్తుతం 72 శాతంగా ఉన్న అక్షరాస్యతను 100 శాతానికి తీసుకువెళ్లడం, 95 శాతం నైపుణ్యం కలిగిన మానవ వనరులు ఉండేలా చూడటం, సగటు ఆయుర్ధాయం 85 ఏళ్లు, ఎంఎంఆర్ ప్రతి లక్ష జననాలకు 5, ఐఎంఆర్ ప్రతి వెయ్యి జననాలకు 2 కన్నా తగ్గించగలగడం, గర్భిణులలో రక్తహీనత సమస్య, వైద్యంపై వ్యక్తిగత ఖర్చు 5 శాతానికి తగ్గించడమే లక్ష్యం’గా సీఎం చెప్పారు. ‘సంజీవని’ కార్యక్రమాన్ని సమగ్ర ఆరోగ్య వేదికగా తీర్చిదిద్దుతున్నామని, కుప్పంలో ఇప్పటికే సంజీవని పైలట్ ప్రాజెక్టు చేపట్టగా, విజయవంతమైందని తెలిపారు. రాష్ట్రంలోని 5.2 కోట్ల ప్రజల ఆరోగ్య భద్రతే లక్ష్యంగా జూలై 2026 నాటికి రాష్ట్రవ్యాప్తంగా ‘సంజీవని’ అమలు చేస్తామని వివరించారు. అనంతరం కొద్దిసేపు మంత్రులు, అధికారులతో బిల్‌గేట్స్ చిట్‌చాట్ నిర్వహించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *