Fuel Shortage: విశాఖలో పెట్రోల్ సెగ.. అన్ని బంకుల వద్ద భారీ క్యూలు.. నో స్టాక్ బోర్డులతో వాహనదారుల బెంబేలు! | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


పెట్రోల్, డీజిల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో, ఈ పరిస్థితిని ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు విశాఖపట్నం జిల్లా పార్టీ అధ్యక్షులు కె.కె.రాజు పార్టీ శ్రేణులతో కలిసి సిరిపురం ప్రాంతంలోని పెట్రోల్ బంక్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా బంక్ వద్ద పరిస్థితిని పరిశీలించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప్రజలు ఇబ్బందులు పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా చర్యలు తీసుకోవాలని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం ఏపీలోనే పెట్రోల్, డీజిల్‌ సంక్షోభం మొదలైంది. మూడు రోజులుగా ఈ సమస్య మరింత తీవ్రమైంది. అయినా ప్రభుత్వంలో మాత్రం కనీసం చలనం లేదు.  మా పార్టీ ఎంపీలు కేంద్ర మంత్రిని సంప్రదిస్తే, ఎక్కడా సరఫరాలో లోటు లేదని, ఒక్క ఇండెంట్‌ పెండింగ్‌ లేకుండా సరఫరా చేస్తున్నామని చెప్పారు.

మరి అలాంటప్పుడు ఇక్కడ పెట్రోల్, డీజిల్‌ కొరత ఎందుకు ఏర్పడింది. అందుకు కారణం ఒక్కటే డీలర్లు స్టాక్‌ అట్టి పెట్టుకుంటున్నారు. నాలుగు రాష్ట్రాల ఎన్నికలు పూర్తి కాగానే, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచుతారని ప్రచారం జరుగుతుండడంతో, డీలర్లు స్టాక్‌ ఉంచేస్తున్నారని, ఈ విషయం తెలిసి ప్రభుత్వం పట్టించుకోవడం లేదని సమాచారం.

అందుకే రివ్యూ చేయకుండా, కేవలం లెటర్స్‌తో సరి పెడుతున్నారు. అంటే, అటు డీలర్లు, ఇటు ప్రభుత్వం కుమ్మక్కు కావడంతో, మన ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే పెట్రోల్, డీజిల్‌ కొరత ఏర్పడింది.  ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలో కృతిమ కొరత సృష్టించారు. రాష్ట్రంలో 4,510 బంక్‌లు ఉండగా, 70 శాతం వాటిలో నో స్టాక్‌ బోర్డు పెట్టారు. నిజానికి పొరుగున ఉన్న తమిళనాడు, కర్నాటక, తెలంగాణలో ఎక్కడా పెట్రోల్, డీజిల్‌ కొరత లేదు.

సరఫరాలో సంక్షోభం లేదు. కేవలం మన దగ్గర మాత్రమే ఈ పరిస్థితి ఉందంటే.. ఇందులో కచ్చితంగా ప్రభుత్వం, డీలర్లు కుమ్మక్యయ్యారని చెప్పడానికి నిదర్శనంలా నిలుస్తోంది. మరోవైపు తాము ఏ మాత్రం సరఫరా తగ్గించలేదని కేంద్ర పెట్రోలియం రసాయనాల శాఖ మంత్రి చెప్పడం, ఇక్కడ ప్రభుత్వ కుట్రను రుజువు చేస్తోందని అన్నారు.

మధురవాడ, కొమ్మాదిలోని పలుచోట్ల ఆదివారం సాయంత్రం నుంచి పెట్రోల్ బంకులను మూసివేశారు. మిథిలాపురి వుడా కాలనీలో నయారా పెట్రోల్ బంక్ నిర్వాహకులు అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వినియోగదారులకు ఇంధనం అందించలేకపోతున్నామని, క్షమించాలని కోరుతూ బోర్డు పెట్టారు. ఈ బంక్ లో రోజుకు సుమారు 8 వేల లీటర్ల పెట్రోల్, 10 వేలలీటర్ల డీజిల్ విక్రయిస్తారు. అకస్మాత్తుగా బంక్ వద్ద బోర్డు పెట్టడంతో వినియోగదారులు కంగుతిన్నారు.

బంకులో నిత్యం పెట్రోల్, డీజిల్ కొట్టించేవారు బోర్డు చూసి నిరాశతో తిరిగి వెనుతిరిగారు. కొమ్మాది పరి సర ప్రాంతంలోని అన్ని బంకుల్లోనూ డీజిల్ దొరకడం లేదు. అన్నిచోట్లా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. కొమ్మాది పెట్రోల్ బంకుతో పాటు మరికొన్ని బంకుల్లో పెట్రోల్ లభించడం లేదు. దీంతో మిగిలిన బంకుల వద్ద పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. క్యూలైన్లు భారీగా ఉండడంతో గంటల కొద్దీ వేచి ఉంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *