Last Updated:
ఏపీలో ఎండలు తీవ్రం, ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో చేపలు, పక్షులు, ప్రజలు ఇబ్బంది, పిఠాపురం సూరప్ప చెరువులో చేపల మరణం, మేలో 45 డిగ్రీల హెచ్చరిక
ఏపీలో ఎండలు క్రమంగా తమ ప్రతాపాన్ని పెంచుకుంటూ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఏప్రిల్ నెల పూర్తవకముందే ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల మార్క్ దాటడంతో పరిస్థితి తీవ్రంగా మారింది. భానుడు నిప్పులు చెరిగేలా మండిపోవడంతో ప్రజలే కాదు, నీటిలో జీవించే చేపలకూ బ్రతుకుదెరువు కష్టంగా మారింది.
పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో ఈ పరిస్థితి స్పష్టంగా కనిపించింది. సూరప్ప మంచినీటి చెరువులో చేపలు పెద్ద ఎత్తున మృతిచెందడం స్థానికులను కలవరపెడుతోంది. ఎండ తీవ్రత కారణంగా నీటిలో ఆక్సిజన్ స్థాయిలు తగ్గిపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు వెల్లడించారు. చెరువు నీటిని ప్రజలు వినియోగిస్తున్న నేపథ్యంలో జాగ్రత్త చర్యలు తీసుకున్నామని, నీటి నమూనాలను పరీక్షలకు పంపామని స్పష్టం చేశారు.
ఎండల ప్రభావం కేవలం చేపలకే పరిమితం కాలేదు. చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ కూలీలు ఉదయం 8 గంటలు దాటకముందే పనులు ముగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాకినాడ, గోదావరి జిల్లాల్లో అయితే ఉదయం నుంచే వాతావరణం భగ్గుమంటోంది. కష్టపడి పని చేసినా ఫలితం కనిపించడం లేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం మే నెలలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉంది. మరికొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుందని హెచ్చరిస్తోంది. దీంతో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచనలు జారీ చేశారు.
ఈ ఎండల మధ్య ఉపశమనం కోసం మజ్జిగ, బార్లీ, గ్లూకోజ్ వంటి ద్రవాలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఎండలో తిరిగివచ్చిన వెంటనే చల్లని పానీయాలు తాగకుండా జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో చెరువులు ఎండిపోవడంతో పక్షులు సైతం నీటి కోసం అల్లాడుతున్నాయి. వాటికి నీరు అందించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం కొంత ఊరటనిస్తోంది.
మొత్తానికి, మరో 30 రోజులు ఏపీలో ఎండల ఉక్కపోత తప్పదని స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండకపోతే పరిస్థితులు మరింత విషమించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
East Godavari,Andhra Pradesh


