పాత్రికేయుడి హత్య అమానుషం – Visalaandhra


దోషులను కఠినంగా శిక్షించాలి
విశాలాంధ్ర -తనకల్లు : చిత్తూరు జిల్లా వి.కోటలో ఆంధ్రజ్యోతి పాత్రికేయుడు జగన్మోహన్ రెడ్డి దారుణ హత్య ఆమానుషమని దోషు లను కఠినంగా శిక్షించాలని మండల పాత్రికేయులు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో మంగళవారం డిప్యూటీ తహశీల్దారు మల్లికార్జునరావుకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి విలేఖరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే పాత్రికేయులు సమాజానికి అద్దం లాంటివారని, ప్రభుత్వం–ప్రజల మధ్య వారధిగా పనిచేస్తున్న వారిపై ఇలాంటి దాడులు జరగడం తీవ్ర ఆందోళనకరమని అన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని, అలాంటి పాత్రికేయుల భద్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.
ఈ హత్య సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ, నిందితులను వెంటనే పట్టుకుని చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా మృతుడి కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం అందించి, కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
పాత్రికేయులపై దాడులు ప్రజాస్వామ్యానికి ముప్పు అని, నిజాలను వెలికితీసే స్వరాలను అణగదొక్కడాన్ని సమాజం సహించదని స్పష్టం చేశారు. బాధ్యులపై ఉదాహరణాత్మక చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలకు అడ్డుకట్ట పడుతుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పాత్రికేయులు కృష్ణారెడ్డి, శ్రీనివాసులు, ఖాజా, శివశంకర్,
రెడ్డి,భాష, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *