పల్నాడు జిల్లాలో వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులు


పల్నాడు జిల్లాలో నాటు బాంబులు తీవ్ర కలకలం రేపాయి. బెల్లంకొండ మండలం పాపాయపాలెం గ్రామంలోని ఓ వైసీపీ నేత ఇంట్లో ఐదు నాటు బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో జరిగిన టీడీపీ నేత హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వ్యక్తి తండ్రి ఇంట్లో ఈ బాంబులు లభ్యం కావడంతో పాత కక్షల కోణంపై పోలీసులు దృష్టి సారించారు.గ్రామస్థుల సమాచారం మేరకు నిన్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. వైసీపీ నేతగా ఉన్న సంక్రాంతి కోటయ్యకు చెందిన ఇంటి టాయిలెట్‌లో ప్లాస్టిక్ బకెట్‌లో దాచిన ఐదు నాటు బాంబులను గుర్తించారు. సమాచారం అందుకున్న సత్తెనపల్లి డీఎస్పీ హనుమంతరావు, క్రోసూరు సీఐ సురేశ్.. బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఘటనా స్థలానికి చేరుకుని వాటిని నిర్వీర్యం చేశారు.గతేడాది డిసెంబర్‌లో జరిగిన టీడీపీ నేత కృష్ణయ్య హత్య కేసులో కోటయ్య కుమారుడు గోపాలకృష్ణ అలియాస్ గోపి ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో పాత కక్షల కారణంగానే ప్రత్యర్థులపై దాడి చేసేందుకు ఈ బాంబులను నిల్వ చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *