Heat Alert: ఆ జిల్లాకు ‘హీట్’ అలర్ట్.. 54 డిగ్రీల వరకు ఎండలు.. 15 మండలాలు ‘డేంజర్ జోన్’లో! |


హీట్ ఇండెక్స్ నివేదిక ప్రకారం జిల్లాలో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్ నుంచి 54 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని అధికారులు హెచ్చరించారు. సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా ఉండే ఈ పరిస్థితులు వడదెబ్బలు, డీహైడ్రేషన్, అలసట, తలనొప్పి, శరీరంలో నీరసం వంటి సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు.

డేంజర్ కేటగిరీలో ఉన్న మండలాలుగా కురుపాం, గుమ్మలక్ష్మిపురం, సీతానగరం, సాలూరు, పాచిపెంట, మక్కువ, సీతంపేట, భామిని, కొమరాడ, వీరఘట్టం, బలిజిపేట, జియ్యమ్మవలస, పార్వతీపురం, గరుగుబిల్లి, పాలకొండ మండలాలను గుర్తించారు. ఈ ప్రాంతాల్లో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా యంత్రాంగం సూచించింది.

ప్రజలు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని అధికారులు కోరుతున్నారు. బయటకు వెళ్లాల్సి వస్తే తలపై గుడ్డ, టోపీ లేదా గొడుగు వాడాలని, చల్లని నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు, నిమ్మరసం వంటి ద్రవ పదార్థాలు తరచుగా తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలను, వృద్ధులను ఎండలో ఎక్కువసేపు ఉంచరాదని హెచ్చరించారు.

పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు ఉదయం తొందరగా లేదా సాయంత్రం వేళల్లో పనులు చేసుకోవడం మంచిదని సూచించారు. మధ్యాహ్న వేళల్లో శారీరక శ్రమ తగ్గించాలని తెలిపారు. పశువులకు తగిన నీరు, నీడ ఏర్పాటు చేయాలని పశుసంవర్ధక శాఖ అధికారులు సూచించారు.

జిల్లా యంత్రాంగం ఇప్పటికే మండల స్థాయి అధికారులను అప్రమత్తం చేసి తాగునీటి సరఫరా, వైద్య సేవలు, అత్యవసర చర్యలపై దృష్టి పెట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఎండల తీవ్రత కొనసాగనున్న నేపథ్యంలో ప్రజలు నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, ప్రభుత్వం జారీ చేసే సూచనలు తప్పనిసరిగా పాటించాలని కోరారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *