ప్రధానిపై హక్కుల ఉల్లంఘన నోటీసు – Visalaandhra


. స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించిన కాంగ్రెస్
. సభ్యులపై నిందారోపణలు చేశారని ఆరోపణ

న్యూదిల్లీ: లోక్‌సభ సభ్యులపై ‘నిందారోపణలు’ చేయడం ద్వారా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఆరోపిస్తూ కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ మంగళవారం ప్రధానికి వ్యతిరేకంగా హక్కుల నోటీసును లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు సమర్పించారు. ఈ మేరకు ఓం బిర్లాకు వేణుగోపాల్ లేఖ రాశారు. ‘18 ఏప్రిల్, 2026న టెలివి జన్‌లో ప్రసారమైన తన ప్రసంగంలో లోక్‌సభ సభ్యు లపై నిందారోపణలు చేసినం దుకుగాను, లోక్‌సభ కార్యవిధాన నియమావళిలోని రూల్ 222 నిబంధనల ప్రకారం భారత ప్రధానికి వ్యతిరేకంగా నేను హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఏప్రిల్ 17న లోక్‌సభలో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు`2026 వీగిపోయిన నేపథ్యంలో ఏప్రిల్ 18 న ప్రధాన మంత్రి జాతీయ టెలివిజన్ ద్వారా జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 368 నిబంధనల ప్రకారం ఆవసరమైన మూడింట రెండు వంతుల మెజారిటీని బిల్లు సాధించలేకపోయిందని వేణుగోపాల్ తెలిపారు. జాతిని ఉద్దేశించి చేసిన 29 నిమిషాల ప్రసంగంలో బిల్లును అడ్డుకున్నందుకు ప్రతిపక్ష పార్టీలను ప్రధానమంత్రి విమర్శించారు. ప్రతిపక్ష సభ్యుల ఓటింగ్ సరళిపై నేరుగా విమర్శలు చేస్తూ… వారికి ఉద్దేశాలు ఆపాదించారని ఆయన అన్నారు. ‘తన విధి నిర్వర్తిస్తున్న ఒక ఎన్నికయిన ప్రతినిధిని ప్రశ్నించడం కేవలం వ్యక్తిగత దాడి మాత్రమే కాకుండా పార్లమెంటు అధికారానికి, భారతదేశ ప్రజల ప్రజాస్వామ్య హక్కులను నేరుగా అవమానించడమే. ఈ విషయాన్ని అత్యంత తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది’ అని వేణుగోపాల్ అన్నారు. ‘గౌరవనీయ స్పీకర్ గారూ, పార్లమెంటు పవిత్రతను, దాని సభ్యులకు కల్పించబడిన రాజ్యాంగ రక్షణలను కాపాడటానికి మీరు తక్షణమే, నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. తద్వారా ఇటువంటి ఉల్లంఘనలను విస్మరించకుండా లేదా పునరావృతం చేయకుండా ఉంటారు’ అని ఆయన అన్నారు.
వేణుగోపాల్ లేఖను ట్యాగ్ చేస్తూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి (కమ్యూనికేషన్ వ్యవహారాల ఇంచార్జ్) జైరాం రమేశ్ స్పందిస్తూ ‘లోక్‌సభలో తన దుష్ట పన్నాగాలను తాను ఊహించని విధంగా ప్రతిపక్షాల సంపూర్ణ ఐక్యత, సంఘీభావంతో ఓడించాయి. దీనిపై జాతినుద్దేశించి ప్రధాన మంత్రి చేసిన ప్రసంగంలో లోక్‌సభలోని నా సీనియర్ సహచరుడు కేసీ వేణుగోపాల్ ఆయనపై హక్కుల ఉల్లంఘన నోటీసు జారీ చేశారు’ అని పేర్కొన్నారు. పదవిలో ఉన్న ప్రధాన మంత్రి జాతిని ఉద్దేశించి చేసే ప్రసంగం ఎల్లప్ప్పుడూ జాతీయ ఐక్యత, విశ్వాస నిర్మాణం అనే అత్యంత ప్రధానమైన ఉద్దేశానికి మాత్రమే పరిమితమై ఉండేదని ఆయన అన్నారు. ‘ఈ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీపై 59 రకాల దాడులు చేస్తూ ప్రధాని సిగ్గులేకుండా చేసిన పక్షపాతపూరిత వ్యాఖ్యలు ప్రధానిగా ఆయన రికార్డుపై శాశ్వత మచ్చగా మిగిలిపోతుంది’ అని జైరాం రమేశ్ తెలిపారు. మహిళా కోటాను అమలు చేయడానికి, లోక్‌సభ సీట్ల సంఖ్యను 816కు పెంచడానికి ఉద్దేశించిన రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు గత శుక్రవారం దిగువ సభలో ఓడిపోయింది.
కేసీ వేణుగోపాల్ తన నోటీసులో… ‘లోక్‌సభ, శాసన సభలలో మహిళా రిజర్వేషన్లను అమలు చేసే ముసుగులో రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు2026 డీలిమిటేషన్‌కు సంబంధించి రాజ్యాంగ రక్షణలను తొలగించి, ఆ ప్రక్రియను అధికార పార్టీ ఇష్టాయిష్టాలకు, దురుద్దేశాలకు వదిలివేయడం ద్వారా రాజ్యాంగంలోని ఆర్టికల్ 82 ను రహస్యంగా సవరించడానికి ప్రయత్నిస్తోందని, దీనికే ప్రతిపక్ష సభ్యులు నిరసన తెలుపుతున్నారని పేర్కొన్నారు. రాజ్యాంగ (131వ సవరణ) బిల్లు2026 రాజ్యాంగ మౌలిక స్వరూపపు మూలాలనే దెబ్బతీసే ప్రయత్నం చేసిందని, అందుకే అది ‘వీగిపోయిందని… అది సముచితమేనని’ పేర్కొంటూ ఆయన ఇలా అన్నారు : ‘తమ విధులను నిజాయితీగా నిర్వర్తిస్తున్న… మరీ ముఖ్యంగా ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని పరిరక్షిస్తున్న పార్లమెంటు సభ్యులపై నిందారోపణలు చేస్తూనే ప్రధాన మంత్రిని జాతిని ఉద్దేశించి ప్రసంగించేంత తీవ్ర ఆగ్రహానికి లోనవడం అత్యంత విచారకరమైన విషయం’ అని అన్నారు. ‘అందువల్ల ప్రధాన మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు ఎన్నికయిన పార్లమెంటు సభ్యుల స్వాతంత్య్రం, సమగ్రతపై నిందలు వేస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. ప్రతిపక్ష సభ్యులు తమ పార్లమెంటరీ విధులను నిర్వర్తించిన తీరును ప్రశ్నించడం, వారి ఓటింగ్ ప్రవర్తనకు ఉద్దేశాలను ఆపాదించడం’ అని వేణుగోపాల్ తన నోటీసులో పేర్కొన్నారు. పార్లమెంటరీ సంప్రదాయం ప్రతి సభ్యుని ప్రాథమిక విశేష అధికారం (రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 కింద రక్షించబడినది) ప్రకారం, ప్రధాన మంత్రితో సహా ఏ ఒక్కరూ సభలో ఏ సభ్యుని ప్రవర్తనను గానీ, ఓటింగ్‌ను గానీ విమర్శించకూడదని లేదా అటువంటి ప్రవర్తనకు దురుద్దేశాలను ఆపాదించకూడదని కూడా ఆయన తెలిపారు. ‘అటువంటి వ్యాఖ్యానం లేదా ఆరోపణ ఏదైనా సభ గౌరవాన్ని అధికారాన్ని నేరుగా దెబ్బతీస్తుంది. దాని సభ్యులు తమ పార్లమెంటరీ విధులను స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వర్తించడంలో జోక్యం చేసుకుంటుంది. ఎన్నికల ప్రవర్తనా నియామవళిని ఉల్లంఘించడమే కాకుండా జాతీయ టెలివిజన్‌లో ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం సభ, ప్రతిపక్షంలోని ప్రతి సభ్యుని హక్కులను స్పష్టంగా తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది’ అని వేణుగోపాల్ పేర్కొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *