తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. 2025 జూలై 10 నుంచి 2026 ఫిబ్రవరి 5 వరకు భారత ఎన్నికల సంఘం నవీకరించిన ఓటర్ల జాబితాలోని అదనపు ఓటర్ల వివరాలను మండలాల వారీగా గుర్తించి, వాటిని సంబంధిత పంచాయతీలు, పోలింగ్ కేంద్రాల వారీగా ఉన్న జాబితాలకు జత చేయాలని ఆదేశించింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాల కలెక్టర్లకు ఈ మేరకు సూచనలు జారీ అయ్యాయి.
పోలింగ్ స్టేషన్ల వారీగా నూతన ఓటర్ల జాబితాలు
ఈ వివరాల ఆధారంగా ఎంపీటీసీ, జడ్పీటీసీల పరిధిలోని గ్రామపంచాయతీలు, పోలింగ్ స్టేషన్ల వారీగా కొత్త ఓటర్ల జాబితాలు రూపొందించాలని తాజా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి ధ్రువీకరణ అనంతరం,Centre for Good Governance యూజర్ మాన్యువల్ ప్రకారం ఈ జాబితాలను పోలింగ్ కేంద్రాలకు అనుసంధానించాలి. డేటాలో ఏవైనా వ్యత్యాసాలు గమనించినట్లయితే ఈ నెల 23లోపు ఎన్నికల సంఘానికి నివేదించాలని సూచించారు. ఆమోదం అనంతరం ముసాయిదా జాబితాలు గ్రామాల వారీగా విడుదల చేసి, అభ్యంతరాలు, సూచనలు స్వీకరించిన తర్వాత తుది జాబితా ప్రకటిస్తారు.
అనంతరం పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్స్‌లు తదితర ఏర్పాట్లు చేపడతారు.
సెప్టెంబరులో ప్రారంభమైన ప్రక్రియ నిలిచిపోయింది
చివరిసారిగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు 2019మే 6, 10, 14తేదీల్లో నిర్వహించగా వెంటనే ఫలితాలు ప్రకటించారు. జూన్‌లో ఎంపీపీలు, జడ్పీ ఛైర్పర్సన్లను ఎన్నుకున్నారు. గతేడాది జూన్‌తో వారి పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. వాస్తవానికి ఈ ఎన్నికలను రెండు దశల్లో నిర్వహించేందుకు గత సెప్టెంబరు 29న నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు.
అయితే బీసీ రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అక్టోబర్ 9న హైకోర్టు ఆదేశాలతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. అనంతరం కోర్టు అనుమతితో గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇప్పుడు రిజర్వేషన్ల విధానాన్ని ఖరారు చేసిన తర్వాత, అదే ప్రాతిపదికన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను కూడా మేలో నిర్వహించేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
566 జడ్పీటీసీలు, 5,773 ఎంపీటీసీలు
తాజాగా రాబోయే ఎన్నికల దృష్ట్యా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల జాబితాను సిద్ధం చేసి ఎన్నికల సంఘానికి అందజేసింది. మొత్తం 566 జడ్పీటీసీ స్థానాలు, వాటికి అనుబంధంగా మండల ప్రజాపరిషత్ ఛైర్పర్సన్లు (ఎంపీపీలు), అలాగే 5,773 ఎంపీటీసీ స్థానాలను ఖరారు చేసింది.
మెడ్చల్-మల్కాజ్గిరి జిల్లాను అర్బన్ జిల్లాగా మార్పు చేయడంతో జిల్లా పరిషత్‌ల జాబితా నుంచి తొలగించగా ప్రస్తుతం రాష్ట్రంలో 31 జిల్లా పరిషత్‌లున్నాయి. 2019 తర్వాత అనేక గ్రామపంచాయతీలు పురపాలికలు, నగరపాలికల్లో విలీనం కావడంతో గ్రామాల సంఖ్య తగ్గింది. దాంతో 44 ఎంపీటీసీలు, నాలుగు జడ్పీటీసీలు, నాలుగు ఎంపీపీ స్థానాలు తగ్గినట్లు అధికారులు తెలిపారు.


