కదం తొక్కిన ఎర్రసైన్యం


.. అట్టహాసంగా ప్రారంభమైన సిపిఐ, బీకేఎంయూ పాదయాత్ర
​ .. అడుగడుగునా నీరాజనాలు

మహిళల హారతులు, ఆకట్టుకున్న. కళాకారుల నృత్యాలు
​ ఉపాధి హామీని కాపాడాలి.. వి.బి.జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలి: నేతల డిమాండ్

విశాలాంధ్ర – రాప్తాడు (అనంతపురం జిల్లా): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, గ్రామీణ పేదల కష్టార్జితానికి భరోసానిచ్చే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని, వి.బి.జి రాంజీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ, బీకేఎంయూ ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర శుక్రవారం సిపిఐ జిల్లా కార్యదర్శి పాల్యం నారాయణస్వామి అధ్యక్షతన అట్టహాసంగా ప్రారంభమైంది. అనంతపురం రూరల్ మండలం సమతా గ్రామం నుండి నార్పల మండలం బండ్లపల్లి వరకు సాగే ఈ యాత్రకు తొలిరోజే జననీరాజనం లభించింది.

​ ఘనంగా ప్రారంభం

​సమతా గ్రామంలోని అమరజీవి ఐదుకల్లు సదాశివన్ స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి సిపిఐ జాతీయ కార్యదర్శి కే. రామకృష్ణ, బి కే ఎం యు జాతీయ కార్యదర్శి గుల్జార్ సింగ్ గురియా, జాతీయ కార్యవర్గ సభ్యులు ముప్పాళ్ల నాగేశ్వరరావు, అక్కినేని వనజ, బీకేఎంయూ జాతీయ అధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య, బీకేఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, ఐదుకల్లు రవీంద్రనాథ్, తదితరులు పూలమాలలు వేసి పాదయాత్రను ప్రారంభించారు. ఆకుతోటపల్లిలో సిపిఐ స్తూపాన్ని రామకృష్ణ, జిల్లా కార్యదర్శి పి.నారాయణ స్వామి ఆవిష్కరించి ఎర్రజెండాను ఎగురవేశారు.

​ వెల్లువెత్తిన జనసమూహం

​పాదయాత్ర సాగిన దారిపొడవునా పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు ఎర్రని దుస్తులు ధరించి పెద్ద ఎత్తున తరలిరాగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అడుగడుగునా సమీప గ్రామాల నుంచి మహిళలు పెద్ద ఎత్తున వచ్చి నీరాజనాలు పడుతూ హారతులు ఇచ్చారు. ఎర్రజెండ, ఎర్రజెండ ఎన్నియలో… ఎర్ర ఎర్రని జెండా ఎన్నియలో అంటూ మహిళలు, యువతీ యువకులు చేసిన నృత్యాలు, కీలు గుర్రాలు, తప్పెటగుళ్ల ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఎస్కేయూ వద్ద ఏఎస్ఎఫ్ కమిటీ నేతలు జాతీయ కార్యదర్శి రామకృష్ణకు గజమాలవేసి సత్కరించగా, టైం స్కేల్, మినిమం స్కేల్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని వినతిపత్రాలను అందజేశారు చేశారు.

నేతల ప్రసంగాలు – డిమాండ్లు

​ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ పేదల పొట్ట కొడుతోందని విమర్శించారు. వి.బి.జి రాంజీ చట్టం ద్వారా రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. ఇటుకలపల్లి వద్ద స్థానిక అభిమానులు రామకృష్ణకు గజమాలతో సత్కరించారు. మహర్షి వాల్మీకి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం, మీటర్ రీడింగ్ తాత్కాలిక ఉద్యోగుల సమస్యలను నేతలు అడిగి తెలుసుకున్నారు.

​ ఎర్రశ్రేణుల్లో ఉత్సాహం

​సమతా గ్రామంలో 10.50గంటలకు మొదలైన పాదయాత్ర ఆకుతోటపల్లి, ఎస్కేయూ, ఇటుకలపల్లి మీదుగా మధ్యాహ్నానికి పుడమి ఎస్టేట్స్ చేరుకుంది. అక్కడ భోజన విరామం అనంతరం మన్నీల, క్రాస్, సంజీవపురం మీదుగా సాగి రాత్రికి కాటమయ్య కొండ వద్దకు చేరుకుంది. మొదటి రోజు యాత్ర విజయవంతం కావడంతో ఎర్రశ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఈ పాదయాత్రకు కాంగ్రెస్ పార్టీ మైనారిటీ రాష్ట్ర అధ్యక్షులు దాదాగాంధీ, ఎన్ఎస్ఈవై రాష్ట్ర సమన్వయకర్త నరేష్, ఎస్.యు. సి.ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవేంద్ర మద్దతు పలికారు. పాదయాత్రలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు బండి వెంకటేశ్వరరావు , సత్య సాయి జిల్లా కార్యదర్శి వేమయ్య యాదవ్ అనంతపురం జిల్లా సహాయ కార్యదర్శి జె. రాజారెడ్డి, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వలరాజు, నాసర్.జి, ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్, యుగంధర్, ప్రజానాట్యమండలి రాష్ట్ర నాయకులు చంద్రనాయక్ సిపిఐ అనంతపురం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎండీ సంజీవప్ప, శ్రీరాములు, బి. కేశవరెడ్డి, రామకృష్ణ, టి నారాయణస్వామి, ఏ.పద్మావతి, జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య, రంగయ్య, రమణయ్య, రమేష్, రాజేష్, కుళ్లాయిస్వామి, చిరంజీవి, చిన్నప్ప యాదవ్, పెదయ్య, పార్వతీ ప్రసాద్, నాయకులు నరేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు హనుమంతు, అంజి, మంజు, వంశీ, చందు, ఉమామహేష్, సిపిఐ మరియు ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..

The post కదం తొక్కిన ఎర్రసైన్యం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *