విశాలాంధ్ర, యాడికి: మండల కేంద్రంలోని శ్రీ శివలక్ష్మి చెన్నకేశవ స్వామి ఆలయ భూములపై నిర్మించబడిన అక్రమ కట్టడాల తొలగింపు పనులను మంగళవారం మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి స్వయంగా పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేవస్థాన భూములను ఆక్రమించి నిర్మించిన షాపులు, వాణిజ్య సముదాయాలు వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు.ఆలయం తూర్పు భాగంలో ఉన్న భోగా లింగేశ్వర స్వామి ఆలయం దర్శనానికి అడ్డుగా నిర్మించిన షాపులను అధికారులు ఇప్పటికే తొలగించడం ప్రారంభించారని తెలిపారు. రాబోయే మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో నిర్వహించనున్న కల్యాణోత్సవానికి తగిన స్థలం సిద్ధం చేయడం అత్యవసరమని స్పష్టం చేశారు.అలాగే మార్కండేయ స్వామి ఆలయం చుట్టూ ఏర్పాటైన కమర్షియల్ కాంప్లెక్స్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన, అక్రమ నిర్మాణాలకు పాల్పడిన వారు సంబంధిత పత్రాలు సమర్పించాలని సూచించారు. బ్రహ్మోత్సవాల అనంతరం పూర్తి రికార్డులను అధికారులకు అందించాలని పేర్కొన్నారు.ప్రస్తుతం షాపుల్లో వ్యాపారం చేస్తున్న అద్దెదారులు భవన యజమానులకు అద్దె చెల్లించవద్దని, వివాదం పరిష్కారమయ్యే వరకు వేచి చూడాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వేలూరు రంగయ్య, టీడీపీ మండల కన్వీనర్ దడయాల ఆదినారాయణ, టీడీపీ సీనియర్ నాయకులు రుద్రమ నాయుడు, తాండ్ర విక్రమ్, తిరంపురం నీలకంఠ, బొట్టు శేఖర్, గండికోట లక్ష్మణ్ చంద్రగాని ఆదినారాయణ, హాజీ పీరా తదితరులు పాల్గొన్నారు.


