-ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కు కళాకారుల వినతి
ధర్మవరం: తోలుబొమ్మలాటను వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్న తమ సమస్యలను పరిష్కరించాలని ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ కళాకారులు విన్నవించారు. అనంతపురంలోని క్యాంపు కార్యాలయంలో తోలుబొమ్మలాట కళాకారులు టిడిపి నాయకులతో కలిసి పరిటాల శ్రీరామ్ ను కలిశారు. కండేగంగాదర్, సిండే శ్రీనివాసులు, కండే రామాంజినేయులు, తులసీరావులు 25వ వార్డు టీడీపీ ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు, ,చీమల రామాంజి, చీమల సూరిలతో పాటు శ్రీరామ్ ను కలిసి సమస్యలను వివరించారు. అనంతరం ఆయనకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తోలు బొమ్మలాట కళాకారులు మాట్లాడుతూ దేశవాప్తంగా తోలుబొమ్మలాట కళకు గుర్తింపు ఉందని,ఆ కళను నమ్ముకొని అనేక మంది జీవిస్తున్నారన్నారు. అయితే కళాకారుల కుటుంబాలవారు ఆర్థికంగా, సామాజికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. తోలుబొమ్మలాట వాళ్లకు గతంలో కులం గుర్తింపు లేక ఏ విధమైన జాబితాలో లేక కుల ధ్రువీకరణ పత్రాలు లేక అనేక సమస్యలను ఎదుర్కొన్నామన్నారు. 2008సం నుండి 16సం వత్సరాల పాటు నిర్విరామంగా కృషిచేశామని 2023 మే 20వతేదీన గత రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెంబరు 08 సీరియల్ నెంబర్ 25గా పరిగణిస్తూ తోలుబొమ్మలాట కళాకారులకు బీసీ(బీ) గా గుర్తిస్తూ వెనుకబడిన జాబితాలోకి చేర్చిందన్నారు. అయితే తెలంగాణ తోలుబొమ్మలాట కళాకారులకు 2020 లో బీసీ(ఏ)గా జాబితాలో చేర్చిందన్నారు. ఇదే విషయాన్ని ఇప్పటి రాష్ట్ర బీసీకమిషన్ చైర్మన్ అంబటి శంకరనారాయణకు తెలియజేశామన్నారు. మన రాష్ట్రంలో కూడా తోలుబొమ్మలాట కళాకారులను తెలంగాణలో మాదిరిగా బీసీ(బీ) జాబితాలో ఉన్న మమ్మల్ని బీసీ(ఏ)లోకి మార్చేవిధంగా చూడాలన్నారు. సంచార జాతులలో భాగమైన మమ్మల్ని మోస్ట్ బ్యాక్వర్ట్ క్యాస్ట్ కార్పొరేషన్ పరిధిలోకి తీసుకొచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని పరిటాల శ్రీరామ్ ను కోరారు. కళాకారుల సమస్యల పరిష్కరించడంతోపాటు తోలు బొమ్మలాట శిక్షణ కేంద్రాలను ప్రభుత్వ సహకారంతో నిష్ణాతులైన కళాకారులను నియమించి వారికి నెల వారి వేతనాలు ఇప్పించాలని కోరారు. తోలుబొమ్మలాట కళాకారుల పిల్లలచే శిక్షణతీసుకొనే పిల్లలకు స్టైఫండ్ రూపంలో ఉపాది కల్పించి శిక్షణ శిబిరాలను నిర్వహించుకొనేందుకు ఆయా ప్రాంతాలలో కళామందిరాలను ఏర్పాటు చేయాలన్నారు.తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉచితంగా కళాకారులకు కళా ప్రదర్శనలు ప్రదర్శించే అవకాశం కల్పించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని పరిటాల శ్రీరామ ను కోరారు. అదేవిధంగా తోలుబొమ్మలాట కళాకారులకు రూ.10వేలు పింఛన్ ఇప్పించి అర్హులైన కళాకారులకు గుర్తింపు కార్డులు కూడా ఇప్పించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా చూడాలని కళాకారులు కోరారు. దీనిపై పరిటాల శ్రీరామ్ స్పందిస్తూ కచ్చితంగా తోలుబొమ్మల కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కళ ద్వారా ఇప్పటికే జాతీయ స్థాయిలో ధర్మవరం కు గుర్తింపు వచ్చింది అన్నారు. తోలుబొమ్మలాట అన్నది అంతరించిపోకుండా కళాకారులు చేస్తున్న కృషి ఎనలేనిదని వారికి ప్రభుత్వం కచ్చితంగా అండగా ఉంటుందని శ్రీరామ్ స్పష్టం చేశారు.


