కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1400 పాయింట్ల పతనం


అంతర్జాతీయంగా నెలకొన్న యుద్ధ భయాలు భారత స్టాక్ మార్కెట్లను కుదిపేశాయి. ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో పెరిగిన చమురు ధరలు.. సూచీలపై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. గురువారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే మార్కెట్లు భారీ పతనాన్ని నమోదు చేశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా కుప్పకూలగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 400 పాయింట్లకు పైగా నష్టపోయింది. ట్రంప్ ప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 4 డాలర్లకు పైగా పెరిగి 106 డాలర్ల వద్దకు చేరింది. ఈ ప్రభావంతో మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 1,416 పాయింట్లు నష్టపోయి 71,718 వద్ద, నిఫ్టీ 429 పాయింట్లు కోల్పోయి 22,250 దిగువన ట్రేడ్ అయ్యాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, రియల్టీ రంగాలు 3 శాతానికి పైగా పతనమయ్యాయి. నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్‌బీఐ షేర్లు మార్కెట్‌ను కిందకు లాగడంలో కీలక పాత్ర పోషించాయి. నిఫ్టీ 50 సూచీలో హెచ్‌సీఎల్ టెక్ మాత్రమే స్వల్ప లాభంతో గ్రీన్‌లో ఉన్న ఏకైక షేరుగా నిలిచింది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా 2.5 శాతానికి పైగా నష్టపోయాయి. మార్కెట్లలో భయానక వాతావరణానికి సూచిక అయిన ఇండియా VIX ఇండెక్స్ 6 శాతానికి పైగా పెరిగింది. బుధవారం సానుకూలంగా ముగిసిన మార్కెట్లు, ఒక్కరోజులోనే ఈ స్థాయిలో పతనం కావడం గమనార్హం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *