అజేయం…అజరామరం


దేశం గర్వించేలా రాజధాని నిర్మాణం

. భూములిచ్చిన రైతులకు పాదాభివందనం
. అమరావతిపై జగన్ ఊసరవెల్లి రాజకీయం
. అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు

విశాలాంధ్ర-సచివాలయం: అమరావతి అజేయం… అద్భుతం… అజరామరమని, అమరావతితోనే తెలుగు వైభవమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శాశ్వత రాజధానిగా అమరావతికి చట్ట బద్ధత కల్పించాలని కేంద్రాన్ని కోరుతూ శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో శనివారం తీర్మానం ప్రవేశపెట్టారు. తీర్మానానికి మద్దతు పలికిన శాసనసభ్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజధానిని ఇక ఎవరూ అంగుళం కూడా కదిలించలేరన్నారు. ఏపీకి ఒక్కటే రాజధాని అని, అది అమరావతి మాత్రమేని పునరుద్ఘాటించారు. రాజధానిపై వైసీపీ బుద్ధి ఇంకా మారలేదని, ఇంకా కుట్రలు, కుతంత్రాలకు పాల్పడుతూనే ఉందని ముఖ్యమంత్రి ఆక్షేపించారు. ‘రాజ్యాంగంలో రాజధాని అనే పేరే లేదంటారు. వీళ్లకు ఏమైనా ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా? రాజారెడ్డి రాజ్యాంగాన్ని వీళ్లు అనుసరిస్తారు. దేశం అనుసరించేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. విభజన అనంతరం రాష్ట్రానికి రాజధాని విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేయాలని 46 శాతం మంది కోరుకున్నట్టు శివరామకృష్ణన్ కమిటీ స్పష్టంగా చెప్పింది’ అని చంద్రబాబు అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ వివిధ జాతీయస్థాయి సంస్థలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేశామని, ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి రాజధానిగా అమరావతికి బేషరతుగా మద్దతు ఇస్తున్నామని గతంలో చెప్పాడన్నారు. కానీ ఇప్ప్పుడు రోజుకో మాటతో ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాడని, టెక్నాలజీ అందుబాటులో ఉన్న రోజుల్లోనూ రాజకీయ విన్యాసాలు చేస్తున్నాడని మండిపడ్డారు. వంద ఎకరాలు తీసుకుని భవనాలు కట్టేసి రాజధాని అని చెప్పేయవచ్చని, కానీ రాష్ట్రానికి ఆర్థిక వనరులు సమకూరేలా ఓ ప్రాంతం ఉండాలని ఆలోచించానన్నారు. ఈ ప్రాంత రైతులను సంప్రదించడంతో 58 రోజుల్లోనే 34 వేల ఎకరాలు త్యాగం చేశారని కొనియాడారు. రాష్ట్రం కోసం రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. పవిత్రమైన మట్టి, నీరుతో ఈ ప్రాంతాన్ని పునీతం చేశామని, అందుకే ఇది శాశ్వతంగా నిలుస్తుందని తెలిపారు. అమరావతి నిర్మాణ బాధ్యతను పార్లమెంటు తీసుకుంటుందని ప్రధాని భరోసా ఇచ్చారని పేర్కొన్నారు. రైతులు ఇచ్చింది కేవలం భూములు మాత్రమే కాదని, రాష్ట్రానికి భవిష్యత్తు ఇచ్చారని, అందుకే సెల్ఫ్ సస్టైయినబుల్ ప్రాజెక్టుగా అమరావతి నిర్మితమవుతుందని చెప్పామని, అదే జరిగి తీరుతుందని చంద్రబాబు స్పష్టంచేశారు. అమరావతిని ఉన్నత జీవన ప్రమాణాలు కలిగించే నగరంగా నిర్మాణం చేస్తున్నామన్నారు. 9 నెలల్లో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ, సచివాలయ ప్రాంగణాలు నిర్మించుకున్నామన్నారు. దేశం బాగుండాలంటే మన జాతి బాగుండాలి. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి. తెలుగువాళ్లకు చెందిన హైదరాబాద్, అమరావతి తొలి రెండు స్థానాల్లో ఉండాలన్నదే తన సంకల్పమని చంద్రబాబు స్పష్టం చేశారు. భవిష్యత్ నగరంగా అమరావతి బ్లూ, గ్రీన్ సిటీగా నిర్మితమవుతుందన్నారు. దేశం గర్వించేలా అమరావతిని నిర్మించి తీరతామన్నారు.
రాజధానులు కోల్పోతూ వచ్చాం
కృష్ణా- గోదావరి నదుల మధ్య అమరావతి రాజధానిగా శాతవాహన రాజులు పరిపాలించారని చంద్రబాబు గుర్తుచేశారు. అంతటి ప్రాచీన, ఘన చరిత్ర మన తెలుగు జాతిదని, సంస్కృతీ సంప్రదాయాలతో విలసిల్లిన తెలుగునేల అని కొనియాడారు. 200 ఏళ్ల పాటు మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రాభవం కోల్పోయామన్నారు. పొట్టిశ్రీరాములు ప్రాణత్యాగంతో తొలి భాషాప్రయుక్త రాష్ట్రంగా ఏపీ అవతరించిందన్నారు. మొదట కర్నూలుకు, ఆ తర్వాత హైదరాబాద్‌కు రాజధాని మారిందని, ఇప్ప్పుడు అమరావతికి మార్చుకున్నామని తెలిపారు. రాజధానులు కోల్పోవటంతో పాటు విమర్శలు, వివక్ష, అవమానాలు భరిస్తూనే వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. 1953లో ఆంధ్రరాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్, 2014లో మరోమారు మన రాష్ట్ర అవతరణ తేదీలు మారాయని, ఇప్ప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏది చేసుకోవాలో తెలియని గందరగోళం నెలకొందన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసిన రోజును స్మతిదినంగా జరుపుకుంటున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. 2019లో ఒక్కఛాన్స్‌తో అధికారంలోకి వచ్చి ప్రజావేదిక కూల్చి విధ్వంస పాలన మొదలు పెట్టారని జగన్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రాన్ని 30 ఏళ్లు వెనక్కు నెట్టారని, రైతులపై ఉక్కుపాదం మోపారని మండిపడ్డారు. శాసనమండలిలో సెలెక్ట్ కమిటీతో బిల్లు పాస్ చేయాలని చూశారన్నారు. అయినా హైకోర్టు కాపాడిందన్నారు. గత పాలనలో తాను, పవన్ కల్యాణ్ సహా అంతా బాధితులమేనన్నారు. కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో 94 శాతం స్ట్రైక్ రేట్ సాధించామని పేర్కొన్నారు. మన ప్రభుత్వం ఏర్పడ్డాక అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.15 వేల కోట్లు తక్షణ సాయం అందించిందన్నారు. 2028కి పనులన్నీ పూర్తి చేసి అమరావతికి ఒక రూపు తీసుకువస్తామన్నారు. 2027 నాటికి ట్రంక్ రోడ్లు, లేఅవుట్లు సహా వివిధ మౌలిక సదుపాయాలు పూర్తవుతాయని, రూ.56 వేల కోట్ల విలువైన 91 పనులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే ప్రాంతంగా అమరావతి ఉంటుందని తెలిపారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని సీఎం వివరించారు.

The post అజేయం…అజరామరం appeared first on Visalaandhra.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *