అమెరికా మిలిటరీ మంగళవారం భారీ ఆపరేషన్ చేపట్టింది. హోర్ముజ్ జలసంధి వద్ద భారీ ఎత్తున బాంబులను జార విడిచింది. తీరం వెంట ఉన్న ఇరాన్ మిస్సైల్ సైట్లను అమెరికా వైమానిక దళాలు టార్గెట్ చేశాయి. సుమారు 5000 పౌండ్ల(2300 కిలోలు) బరువున్న బాంబులతో హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్ మిస్సైల్ కేంద్రాలపై దాడి చేశారు. యాంటీషిప్ క్రూయిజ్ మిస్సైళ్లను అమెరికా పేల్చివేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఇరాన్ తీర ప్రాంతం వెంబట ఉన్న మిస్సైల్ కేంద్రాలను ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ వెల్లడించింది.
హోర్ముజ్ జలసంధి వద్ద ఉన్న ఇరాన్‌కు చెందిన యాంటీషిప్ క్రూయిజ్ క్షిపణులతో అంతర్జాతీయ నౌకల షిప్పింగ్ సమస్యగా మారినట్లు సెంట్రల్ కమాండ్ పేర్కొన్నది. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీలో భాగంగా హోర్ముజ్ వద్ద దాడి చేసినట్లు చెప్పింది. దాడి చేసిన ప్రాంతాలకు చెందిన మ్యాప్‌ను కూడా సెంట్రల్ కమాండ్ రిలీజ్ చేసింది. ఇరాన్ కోస్టల్ తీరం వెంట ఉన్న యాంటీ షిప్ క్షిపణులు.. ఎటువంటి నౌకనైనా టార్గెట్ చేసే అవకాశం ఉంటుందని కొన్ని వర్గాల ద్వారా తెలుస్తోంది.
అయితే హోర్ముజ్‌ను ఓపెన్ చేసేందుకు అన్ని దేశాలు కలిసి రావాలని ట్రంప్ ఇచ్చిన పిలుపుకు స్పందన కరువైన విషయం తెలిసిందే. నాటో దేశాలతో పాటు జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా కూడా హోర్ముజ్ జలసంధి వద్దకు తమ యుద్ధ నౌకలను పంపేందుకు ఆసక్తి ప్రదర్శించలేదు. ఇరాన్, ఒమన్ దేశాల మధ్య ఉన్న హోర్ముజ్ జలసంధి సుమారు 33 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది. ఆ మార్గాన్ని ఇరాన్ వ్యూహాత్మకంగా బ్లాక్ చేసింది. దీంతో పలు దేశాలకు ముడి చమురు, ఎల్పీజీ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.


