ఒకవైపు రాయలసీమ జిల్లాల్లో ఎండలు.. మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు రాయలసీమ జిల్లాలు ఎండలతో మండిపోతుంటే, మరోవైపు కోస్తా జిల్లాలకు వర్ష సూచన జారీ అయింది. సోమవారం అనంతపురంలో రాష్ట్రంలోనే అత్యధికంగా 38.6 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే సమయంలో కోస్తా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టడం గమనార్హం.ద్రోణి ప్రభావం, నైరుతి దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా రాబోయే నాలుగు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. పిడుగులతో పాటు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది.ముఖ్యంగా మంగళవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాల్లో వర్షాలు పడొచ్చని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సోమవారం అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం జిల్లాల్లోని కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి.
ఈ వాతావరణ మార్పుల ఫలితంగా రానున్న ఐదు రోజుల్లో కోస్తా జిల్లాల్లో ఎండ తీవ్రత తగ్గుముఖం పట్టనుందని అధికారులు పేర్కొన్నారు. ఇక్కడ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల మేర తగ్గుతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీంతో ప్రజలకు కొంత ఉపశమనం లభించనుంది.
The post ఏపీలో విభిన్నమైన వాతావరణం appeared first on Visalaandhra.


