జిల్లాలో వంట గ్యాస్ కొరత లేదు


కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవు

  • కలెక్టర్ జి.లక్ష్మీశ హెచ్చరిక
    విశాలాంధ్ర`విజయవాడ: జిల్లాలో వంట గ్యాస్‌కు కొరత లేదని, బాట్లింగ్, సరఫరాలో ఎక్కడా ఇబ్బంది లేదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించేందుకు ప్రయత్నించినా, బ్లాక్ మార్కెటింగ్ కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ హెచ్చరించారు. కలెక్టర్ లక్ష్మీశ శుక్రవారం కలెక్టరేట్‌లో ఆర్‌డీవోలు, పౌర సరఫరాల శాఖ అధికారులు తదితరులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ బాట్లింగ్ ప్లాంటును ఆకస్మికంగా సందర్శించారు. ప్లాంటు అధికారులతో సమావేశం నిర్వహించి ప్లాంటు కార్యకలాపాలను, ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో అవసరానికి సరిపడా ఎల్పీజీ సిలిండర్ల నిల్వలు ఉన్నాయని, సరఫరా ప్రక్రియ కూడా సజావుగా కొనసాగుతోందని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సరఫరా చర్యలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో వంట గ్యాస్ కొరత ఉన్నట్లు కొన్ని అపోహలు వ్యాప్తి చెందుతున్నాయని, అలాంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని సూచించారు. గ్యాస్ సరఫరా విషయంలో ప్రస్తుతానికి ఎలాంటి సమస్యలు లేవని ఎవరైనా కృత్రిమ కొరత సృష్టించి వినియోగదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో రోజుకు 16 వేల సిలిండర్లు అవసరం కాగా.. ఏ సమయంలోనైనా దాదాపు 25,500 సిలిండర్లు సిద్ధంగా ఉంటాయని వివరించారు.. బ్లాక్ మార్కెట్ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏజెన్సీలు కూడా అనవసరంగా ఎవరినీ ఆందోళనకు గురిచేయొద్దని, ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తే క్రిమినల్ కేసులు కూడా పెట్టేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. ఏవైనా ఇబ్బందులు ఉంటే కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ 9154970454కు కాల్ చేయాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. కలెక్టర్ వెంట విజయవాడ ఆర్‌డీవో టీవీ సతీష్, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవీ శంకరరావు తదితరులు ఉన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *