. దేశ గౌరవం ట్రంప్‌కు తాకట్టు
. యుద్ధ ప్రభావంతో ధరల పెరుగుదల
. ముర్ము వైఖరి సమర్థనీయం కాదు
. కమ్యూనిస్టు సిద్ధాంతం శాశ్వతం నారాయణ
విశాలాంధ్ర బ్యూరో-ఖమ్మం: ప్రపంచంలోనే అత్యంత బలమైన ప్రజాస్వామ్య పునాదులున్న భారతదేశానికి మోదీ అత్యంత బలహీన ప్రధాని అని, యుద్ధాన్ని ఆపే కనీస ప్రయత్నం చేయడం లేదని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె. నారాయణ ఆరోపించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు సాగిలపడటం తప్ప మోదీ మరేపని చేయలేక పోతున్నారని అన్నారు. ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో ఐదు శాతం కూడా లేదని పేర్కొన్నారు. స్థానిక గిరిప్రసాద్ భవన్లో గురువారం మీడియా సమావేశంలో నారాయణ మాట్లాడుతూ భారతదేశంపై యుద్ధప్రభావం ప్రారంభమైందని , గ్యాస్ ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోతున్నాయని, ఎగుమతులు నిలిచిపోవడంతో వ్యయసాయ ఉత్పత్తుల ధరలు పడిపోనున్నాయని తెలిపారు. ట్రంప్ ఆర్థిక వనరులున్న దేశాలపై దాడులు చేసి ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. వెనుజులా తరువాత ఇరాన్‌పై యుద్ధం చేస్తున్నాడని, క్యూబాపై కూడా దాడికి ప్రయత్నచేస్తున్నాడని తెలిపారు. ట్రంప్‌ను చూసి మోదీ భయపడుతున్నాడని, 140 కోట్ల మంది దేశప్రజల ఆత్మగౌరవాన్ని ట్రంప్‌కు తాకట్టుపెట్టారన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా మోదీ నోరువిప్పాలని, మూడో ప్రపంచ యుద్ధ పరిస్థితులు నెలకొంటున్నదశలో శాంతికి అలీనదేశంగా భారత్ గట్టి ప్రయత్నం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వైఖరి సమర్థనీయం కాదని, రాష్ట్రపతిగా ఆదివాసీ మహిళ ఉన్నందుకు గర్వపడుతున్నాం కానీ ఆదివాసీలకు నష్టం చేసేలా ప్రభుత్వానికి అనుమితులివ్వడాన్నిమాత్రం సమర్థ్ధించబోమని ఆయన స్పష్టం చేశారు. అటవీ హక్కుల చట్టాన్ని మార్చి అటవీ భూములను కార్పొరేట్లకు అప్పగించే ప్రయత్నంలో భాగంగానే ముర్ముకు రాష్ట్రపతి పదవిచ్చి అమెచేతనే ఆదివాసులకు నష్టం కలిగించే చర్యలకు బీజేపీ పాల్పడుతోం దన్నారు. ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను చంపి, అడవుల నుంచి ఆదివాసీలను తరమి ఆ భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ధ్వజ మెత్తారు. మావోయిస్టు నేతలను చంపిన ప్రతిసారి వేల ఎకరాలు కార్పొరేట్లకు స్వాధీనం చేయడమే ఇందుకు నిదర్శనమ న్నారు. కమ్యూనిస్టు సిద్ధాంతాన్ని నశింప చేయడం ఎవరితరం కాదని నారాయణ పేర్కొన్నారు. మావోయిస్టురహిత భారతదేశం కాదని, రైతును రాజును చేసే దేశంగా తయారు చేయాలని ఆయన అమిత్ షాకు సూచించారు. వెలుగుమట్ల ఘటనపై స్పందిస్తూ భూస్వామ్య భూములను కమ్యూనిస్టులు ఆక్రమించే క్రమంలోనే భూదాన్ ఉద్యమం వచ్చిందన్నారు. తెలంగాణాలో లక్షల ఎకరాల భూములను పేదలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులకు ఉందన్నారు. వెలుగుమట్లలో నివాసాలను కూల్చడం ఎందుకు… తిరిగి అక్కడే పట్టాలివ్వడం ఎందుకని నారాయణ ప్రశ్నించారు.
విద్వేషంతో విమర్శలు చేయొద్దు: కూనంనేని
కమ్యూనిస్టులను బలహీన పర్చడమే వారి ధ్యేయమని, అందుకే కమ్యూనిస్టులపై అనవసర విమర్శలు చేస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు తెలిపారు. పేదల పక్షాన పనిచేయడమే తమ కర్తవ్యమని, విద్వేషంతో మాపై విమర్శలు చేయడం తగదన్నారు. రాష్ట్రంలో ఎనిమిది వేల మంది పేదలతో గుడిసెలు వేయించామని, వాటికి పట్టాలి వ్వాలని, 58 జి.ఓ ద్వారా శాశ్వత హక్కులు కల్పించాలని పోరాడుతున్నామన్నారు.


