భూ అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్


. వచ్చే డిసెంబరుకు భూ వివాదాలన్నీ పరిష్కారం
. రైతుల భూములకు పూర్తి భద్రత కల్పిస్తాం
. ఉచితంగా రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు
. గత పాలనలో భూ అక్రమాలకు పాల్పడింది మంత్రుల ముఠాలే
. నేడు అభివృద్ధి-సంక్షేమం
. పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీలో సీఎం చంద్రబాబు

విశాలాంధ్ర బ్యూరో – నంద్యాల : వచ్చే ఏడాది డిసెంబరు నాటికి రాష్ట్రంలోని భూ సమస్యలన్నీ పరిష్కరించేలా ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నామని, భూ అక్రమాలకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఎలాంటి భూ వివాదాలు లేకుండా చర్యలు తీసుకుని… ట్యాంపర్ చేయడానికి ఆస్కారం లేని విధంగా రాజముద్రతో కూడిన కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు అందిస్తున్నామని సీఎం వెల్లడించారు. రాష్ట్రంలోని రైతుల భూములకు భద్రత కల్పించడంతో పాటు వారి ఆదాయాలు పెంచేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తబురుజులో మీ భూమి-మీ హక్కు కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను రైతులకు సీఎం అందించారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వం రెవెన్యూ శాఖను అస్తవ్యస్తం చేసింది. నాడు మంత్రులే భూ కబ్జాలకు పాల్పడ్డారు. డోన్‌లో మంత్రిగా ఉన్న వ్యక్తి ఒక సాధారణ రైతు భూమిని తన అనుచరులకు కట్టబెట్టేశారు. గత ప్రభుత్వంలో దాదాపు 1.95 లక్షల ఎకరాలను 22ఏ లో పెట్టారు. ప్రైవేట్ భూముల రికార్డులను తమ ఇష్టం వచ్చినట్టు మార్చేశారు. అడిగిన భూమి ఇవ్వకపోతే 22ఏ లో పెట్టేశారు. ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తెచ్చి ప్రైవేట్ భూములపై అజమాయిషీని సొంత వాళ్లకు కట్టబెట్టాలని చూశారు. అప్పీల్‌కు వెళ్లడానికి వీలు లేకుండా నిబంధనలు చేశారని సీఎం తీవ్రస్థాయిలో విమర్శించారు. ఇదే జిల్లా పాణ్యం నియోజకవర్గంలో నాటి ప్రభుత్వం తప్ప్పుల తడకగా జారీ చేసిన పట్టాదారు పుస్తకాన్ని కాల్చి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేస్తామని హామీ ఇచ్చి, అధికారంలోకి రాగానే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశామని సీఎం చెప్పారు.
రెవెన్యూ వ్యవస్థను గాడిన పెట్టేందుకు 20 నెలలు పట్టింది
వైసీపీ పాలకులు చేసిన ఒక దుర్మార్గాన్ని సరిదిద్దడానికి 20 నెలలు పట్టిందని సీఎం చంద్రబాబు తెలిపారు. రైతుల సమక్షంలోనే భూ కొలతలు తీసుకుని రైతుల ఆమోదంతో భూ వివరాలతో పుస్తకాలు ఇస్తున్నాం. భూ రికార్డులు తారుమారు చేయకుండా పక్కాగా పట్టా ఇస్తున్నాం. క్యూఆర్ కోడ్ విధానం తీసుకొచ్చాం. ఎవరు రికార్డులు తారుమారు చేసినా తెలిసిపోతుంది. ఎమ్మార్వో, వీఆర్వోలు తప్ప్పు చేసినా బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా తెలిసిపోతుంది. మేం ఇచ్చిన పట్టాదార్ పుస్తకాలను ట్యాంపర్ చేయలేరు. వివాదాల్లేని పట్టాదార్ పాస్ పుస్తకాలు ఇప్పించే బాధ్యత నాది. రాష్ట్ర వ్యాప్తంగా 16,816 గ్రామాలున్నాయి. 6,860 గ్రామాల్లో సర్వే గత ప్రభుత్వంలో చేశారు. తప్ప్పుల తడకతో 19.93 లక్షల పుస్తకాలు ఇచ్చారు. రికార్డులు తారుమారు చేసి ఇచ్చారు. అవన్నీ పక్కనపెట్టి మళ్లీ కొత్తగా రైతులకు పుస్తకాలు అందిస్తున్నాం. గత పాలకులు చేసిన తప్ప్పును సరిదిద్దుతూ ప్రభుత్వమే ఉచితంగా పట్టాలు ఇస్తోంది. రిజిస్ట్రేషన్ విధానం కూడా సులభతరం చేస్తున్నామని సీఎం చెప్పారు.
భగీరథ స్పూర్తితో సీమలో ప్రతి ఎకరాకు నీరు
రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరివ్వాలన్నది తన సంకల్పమని ముఖ్యమంత్రి అన్నారు. మొదట హంద్రీ-నీవా ఆలోచన చేసింది ఎన్టీఆర్. హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగుగంగ సహా అనేక ప్రాజెక్టులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారు. వాటిని నేను పూర్తి చేస్తున్నాను. ఈ డోన్ నియోజకవర్గంలో హంద్రీ-నీవా ద్వారా 30 చెరువులకు నీరిచ్చాం. రాయలసీమను రతనాల సీమగా మారుస్తాం. హర్టీ కల్చర్ హబ్‌గా తీర్చిదిద్ది, ఇక్కడి ఉత్పత్తులను ప్రపంచమంతా ఎగుమతి చేసే సౌకర్యాలు కల్పిస్తాం. అగ్రో ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటు చేస్తాం. మామిడికి తెగులు వస్తే పేపర్ కవర్ పేపర్ కవర్ పెట్టే పద్ధతి తెచ్చాం. కేంద్రం రూ.30 వేల కోట్లు పూర్వోదయ పథకం కింద ఇస్తుందని, వీటిని రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకుని సీమ అభివద్ధికి చర్యలు తీసుకుంటుందని సీఎం చంద్రబాబు చెప్పారు. డోన్ నియోజకవర్గంలో అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు విడుదల చేస్తామని, కొత్త బురుజులో సీసీ రోడ్లు వేసేందుకు నిధులు కేటాయించడంతో పాటు అర్హులకు ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. గత ప్రభుత్వంలో అన్నీ కుంభకోణాలు, వివాదాలేనని అన్నారు. 30 వేల మంది కల్తీ మద్యం తాగి ప్రభుత్వంలో చనిపోయారు. ఎక్సైజ్ శాఖలో నెలకు రూ.100 కోట్లు అవినీతి చేశారు. పేదల ఆరోగ్యానికంటే వారికి డబ్బులే ముఖ్యం. ప్రజల జీవితాలు, ఆరోగ్యంతో ఆడుకున్నారు. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని కూడా కల్తీ చేశారు. తిరుమల లడ్డూ కల్తీ, మద్యం అవినీతి, భూ దోపిడీ వంటి వాటిని ప్రక్షాళన చేస్తున్నాం. లడ్డూ విషయంలో సీబీఐ ఇచ్చిన రిపోర్టుపై తప్ప్పుడు ప్రచారం చేస్తున్నారు. వివేకానందరెడ్డిని హత్య చేసి నా చేతిలోనే కత్తిపెట్టి నారాసుర రక్త చరిత్ర అని రాశారు. జగన్ చేసిన అన్యాయాన్ని ఆయన సోదరి సునీత తెలుసుకున్నారు. వివేకా కుమార్తె న్యాయం కోసం నేటికీ కోర్టులు చుట్టూ తిరుగుతోంది. ప్రజలు ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించాలి. ఇలా నాడు వైసీపీ నేరాలు ఘోరాలకు పాల్పడితే, నేడు కూటమి ప్రభుత్వం సంక్షేమం, అభివద్ధి కార్యక్రమాలే లక్ష్యంగా పాలన సాగిస్తోందని సీఎం చెప్పారు. 2019 లో వారిని గెలిపించడంతో రాష్ట్రంలో ఏం జరిగిందో మీరే చూశారు. అభివృద్ధి వైకుంఠపాళి కాకూడదని సీఎం చంద్రబాబు మరోసారి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్య ప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *