YS Jagan: అమరావతి వద్దు.. ‘మావిగన్’ ముద్దు.. రాజధానిపై జగన్ సరికొత్త అస్త్రం | ఆంధ్రప్రదేశ్ వార్తలు


రాజధాని నిర్మాణ వ్యయం, వాస్తవికత విషయంలో జగన్ ఒక స్పష్టమైన లెక్కను ప్రజల ముందు ఉంచారు. అమరావతి నిర్మాణానికి అంచనా వేస్తున్న లక్షల కోట్ల రూపాయల వ్యయంలో కేవలం 10 శాతం నిధులను మావిగన్‌పై వెచ్చిస్తే అద్భుతమైన సదుపాయాలు కల్పించవచ్చని ఆయన వివరించారు. అమరావతిలో కేవలం 50 వేల ఎకరాల విస్తీర్ణంలో కనీస మౌలిక సదుపాయాలు (రోడ్లు, కరెంటు, డ్రైనేజీ తదితరాలు) కల్పించడానికే తొలివిడతలో ఏకంగా లక్ష కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, ఒక ఎకరానికి కనీసం రెండు కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని ఆయన విశ్లేషించారు. ఇలా లక్షల కోట్లు అప్పులు తెచ్చి మట్టిలో పోసేందుకు ఎంతో సమయం పడుతుందని, దానికి బదులు అమరావతి కోసం డిజైన్ చేసిన భవనాలను ఇప్పటికే ఎన్నో మౌలిక వసతులు ఉన్న మావిగన్ ప్రాంతంలో నిర్మిస్తే ప్రజా ధనం భారీగా ఆదా అవుతుందన్నారు.

అమరావతి పేరుతో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలను, రైతులను తీవ్రంగా మోసం చేస్తున్నారని జగన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇన్ని సానుకూలతలు ఉన్న మావిగన్ ప్రతిపాదనను పక్కనపెట్టి, చంద్రబాబు అమరావతిపైనే ఎందుకు పట్టుబడుతున్నారో జగన్ వివరిస్తూ.. అమరావతి అనేది ఆయన అవినీతికి, అక్రమాలకు ఒక అతిపెద్ద గని అని విమర్శించారు. కేవలం తమ అనుకూల కాంట్రాక్టర్లకు పనులు అప్పగించి, వారి ద్వారా నిరంతరం కమీషన్లు దండుకోవాలన్న దురుద్దేశంతోనే పదే పదే అమరావతి జపం చేస్తున్నారని, ఆయన తీరు వల్ల రాష్ట్రానికి ఎప్పటికీ పూర్తిస్థాయి రాజధాని లేకుండా పోతోందని మండిపడ్డారు.

ఇక రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం పనితీరుపై జగన్ నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు గడిచిపోయి, మూడు బడ్జెట్‌లు ప్రవేశపెట్టినప్పటికీ ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేనిఫెస్టోను పూర్తిగా చెత్తబుట్టలో వేశారని ఎద్దేవా చేశారు. ప్రస్తుత పాలనలో విద్య, వైద్యం, వ్యవసాయం, శాంతిభద్రతలు, సంక్షేమం ఇలా ప్రతి రంగం పూర్తిగా విధ్వంసానికి గురై, రాష్ట్రం తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో రూ. 3.31 లక్షల కోట్లు అప్పు చేస్తే, అందులో రూ. 2.73 లక్షల కోట్లను నేరుగా బటన్ నొక్కి ప్రజల ఖాతాల్లోకే (డీబీటీ ద్వారా) జమ చేశామని గుర్తుచేశారు. కానీ, ఈ రెండేళ్ల కూటమి పాలనలో చంద్రబాబు చేసిన రూ. 3.52 లక్షల కోట్ల భారీ అప్పుల డబ్బంతా ఏమైందని, ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని ఆయన సూటిగా ప్రశ్నించారు.

ప్రస్తుత పాలన అంతా “దోచుకో.. పంచుకో.. తినుకో” అన్న చందంగా సాగుతోందని జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో లిక్కర్, ఇసుక, మట్టి, సిలికా, క్వార్ట్జ్, లాటరైట్, గ్రానైట్ వంటి సహజ వనరులన్నీ మాఫియా పరం అయ్యాయన్నారు. విలువైన ప్రభుత్వ భూములను తమ వారికి రూపాయికే కట్టబెడుతూ పప్పు బెల్లాల్లా పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు సామాన్యుల బతుకులు దుర్భరంగా మారాయన్నారు. రైతులకు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కడం లేదని, పెట్టుబడి సాయం (ఇన్‌పుట్ సబ్సిడీ) అందడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థలో ‘నాడు-నేడు’ కార్యక్రమం అటకెక్కిందని, పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన నిధులు ఆపేశారని దుయ్యబట్టారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్లక్ష్యం చేయడంతో, బిల్లులు రాక నెట్‌వర్క్ ఆస్పత్రులు సమ్మెకు దిగే దుస్థితి వచ్చిందని, చివరికి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సైతం ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసే స్థాయికి దిగజారారని విమర్శించారు. డ్వాక్రా మహిళలకు ఇవ్వాల్సిన సున్నా వడ్డీ రాయితీ నిధులు కూడా నిలిచిపోయాయన్నారు.

ఇవి కూడా చదవండి: LPG GAS Cylinder: గ్యాస్ సిలిండర్లపై భారీ గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. ఇక ప్రజలకు పండగే..

ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఈ కూటమి ప్రభుత్వంపై అలుపెరగని పోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది తాను ప్రజల కోసం బ్రహ్మాండమైన పాదయాత్రను చేపట్టనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రజలతో నేరుగా మమేకమవుతూ, వారి కష్టసుఖాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతానన్నారు. పాదయాత్ర ప్రారంభమైన తర్వాత నుంచి వైఎస్సార్‌సీపీ శ్రేణులు ప్రతిరోజూ చంద్రబాబుకు చుక్కలు (సినిమా) చూపిస్తారని హెచ్చరించారు. ఎన్నో కష్టనష్టాలు, కేసులు ఎదురవుతున్నా ప్రజల పక్షాన నిలబడి అలుపెరగకుండా పోరాడుతున్న తమ పార్టీ నాయకులు, కార్యకర్తలను చూస్తే తనకు ఎంతో గర్వంగా ఉందని వైఎస్ జగన్ ప్రశంసించారు..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *