Water Crisis: బ్రాందీకి కొరత లేదు.. నీళ్లకు దిక్కులేదు.. మహిళల ఆవేదన వైరల్..! dalit women protest with empty pots for drinking water in kottakota. | విశాఖపట్నం వార్తలు (Visakhapatnam News)


Last Updated:

అనకాపల్లి జిల్లా రావికమతం కొత్తకోటలో 200 కుటుంబాలకు తీవ్రమైన నీటి కొరత, దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన, అధికారులు శాశ్వత పరిష్కారం కోరుతూ హెచ్చరిక

+

వేసవి

వేసవి వచ్చింది మంచినీళ్లు ఇవ్వండి మహాప్రభో…! దళిత మహిళలు ఆందోళన 

అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట పంచాయతీ కేంద్రంలో నీటి సమస్య తీవ్రమై ప్రజలు ఆందోళనకు దిగారు. దేవతమ్మ వీధికి చెందిన దళిత మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలుపుతూ తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, రోజువారీ అవసరాలకే నీరు దొరకక కుటుంబాలు ఇబ్బందుల్లో కూరుకుపోయాయని వారు వాపోయారు. దేవతమ్మ వీధితో పాటు మరో రెండు కాలనీలలో కలిపి సుమారు 200 కుటుంబాలు నీటి కోసం తంటాలు పడుతున్నాయని తెలిపారు.

పంచాయతీ అధికారులు ప్రతి ఇంటికి హౌస్ టాక్స్ వసూలు చేస్తున్నప్పటికీ కనీసం మంచినీటి సదుపాయం కల్పించడం లేదని స్థానికులు మండిపడ్డారు. పబ్లిక్ కుళాయిలు వేసి నాలుగేళ్లు, ఇంటింటికీ ట్యాపులు అమర్చి మూడు సంవత్సరాలు అయినా ఒక్క బొట్టు నీరు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో కొద్దిరోజులు నీళ్లు ఇచ్చి ఆ తర్వాత పూర్తిగా నిలిపివేశారని, ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి స్నానం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.

జల జీవన్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు మంజూరు చేసి ఇంటింటికీ కుళాయిలు ఏర్పాటు చేసినా అవి కేవలం పేరుకే ఉన్నాయని ప్రజలు విమర్శిస్తున్నారు. నీటి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తోందని, ఇది రోజువారీ భారంగా మారిందని చెబుతున్నారు. ప్రతి ఊరిలో బ్రాందీ షాపులు ఉన్నాయి, వాటికి ఎలాంటి కొరత లేదు.. కానీ తాగడానికి నీళ్లు మాత్రం దొరకడం లేదు అంటూ మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గతంలో పలుమార్లు ఆందోళనలు చేసినప్పటికీ అధికారులు తాత్కాలిక చర్యలకే పరిమితమవుతున్నారని ఆరోపించారు. ట్రాక్టర్లతో నీరు తీసుకువచ్చి ఫోటోలు తీసుకుని ప్రచారం చేసుకోవడం తప్ప శాశ్వత పరిష్కారం చూపడం లేదని మండిపడ్డారు. కొత్త ట్యాంకు నిర్మాణం పేరుతో పూజలు చేసినా ఇప్పటివరకు నీటి సరఫరా ప్రారంభం కాలేదని తెలిపారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రావికమతం ఎంపీడీవో కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఖాళీ బిందెలతో ఆందోళనను మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రజలకు ప్రాథమిక అవసరమైన నీరు అందించడంలో విఫలమవుతున్న వ్యవస్థపై ఈ నిరసన గళం బలంగా వినిపిస్తోంది.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *