Vijayawada: కటిక పేదరికంలోనూ గొప్ప మనసు.. రూ. 3 లక్షల బంగారు గొలుసు అప్పగించిన మహిళా స్వీపర్! | ఆంధ్రప్రదేశ్ వార్తలు


Last Updated:

నేటి సమాజంలో రూపాయి కనిపిస్తేనే రంగు మార్చే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, దొరికిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి యజమానికి అప్పగించి ఓ మహిళా స్వీపర్ తన నిజాయతీని చాటుకున్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Vijayawada: ఆమె స్వీపర్ కావొచ్చు.. పొట్టకూటి కోసం రోజూ కూలీ కావొచ్చు.. ఏసీ గదుల్లో ఉద్యోగం చేయకపోవచ్చు.. కానీ, గుణంలోనూ.. వ్యక్తిత్వంలోనూ ఆమె ఎంతో ధనవంతురాలు. ఆమె నిజాయితీ కొన్ని వేల కోట్లకు సమానం. నేటి సమాజంలో రూపాయి కనిపిస్తేనే రంగు మార్చే మనుషులు ఉన్న ఈ రోజుల్లో, దొరికిన లక్షల రూపాయల విలువైన బంగారాన్ని ఏమాత్రం ఆశపడకుండా తిరిగి యజమానికి అప్పగించి ఓ మహిళా స్వీపర్ తన నిజాయతీని చాటుకున్నారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులోని వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోటుచేసుకున్న ఈ ఘటన మానవత్వం ఇంకా బ్రతికే ఉందని నిరూపించింది.

అసలేం జరిగింది?

ఈనాడు కథనం ప్రకారం.. బాపట్ల జిల్లా చినగంజాంకు చెందిన ఆశాహరి ఏడుకొండలు అనే వ్యక్తి, సుమారు 20 రోజుల క్రితం తన కుటుంబ సభ్యులతో కలిసి నాగులపాడులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. తమ మొక్కు తీర్చుకునే క్రమంలో ఆలయ ప్రాంగణంలో పూజలు నిర్వహించారు. అయితే, ఆ సందడిలో ఆయన కుమారుడి మెడలో ఉన్న రూ. 3 లక్షల విలువైన బంగారు గొలుసు ఎక్కడో జారిపోయింది. ఇంటికి వెళ్ళాక గొలుసు లేదని గుర్తించిన బాధితులు హతాశులయ్యారు.

వెంటనే ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గొల్లపూడి సాంబశివరావుకు సమాచారం అందించి, స్థానిక ఎస్సై సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ సిబ్బందిని విచారించినప్పటికీ, అప్పట్లో గొలుసు జాడ దొరకలేదు. ఆశలు వదులుకున్న ఆ కుటుంబం తన దారిని తాను వెళ్ళిపోయింది.

నిజాయతీ చాటుకున్న కోటేశ్వరమ్మ

శనివారం ఉదయం ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తుండగా, అక్కడ పనిచేసే స్వీపర్ కోటేశ్వరమ్మ (బోడెమ్మ) కంట ఆ బంగారు గొలుసు పడింది. 20 రోజుల క్రితం మట్టిలో కూరుకుపోయిన ఆ గొలుసును చూడగానే ఆమె ఏమాత్రం తడబడలేదు. తన దారిద్ర్యం కంటే ఎదుటివారి బాధే పెద్దదని భావించిన ఆమె, వెంటనే ఆ ఆభరణాన్ని ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడికి అప్పగించారు.

బాధితులకు అందజేత

కోటేశ్వరమ్మ చూపిన నిజాయతీకి ఆలయ కమిటీ సభ్యులు అభినందించారు. వెంటనే బాధితుడు ఏడుకొండలుకు సమాచారం అందించారు. ఆదివారం నాడు ఆయన ఆలయానికి చేరుకోగా, ఎస్సై సత్యనారాయణ మరియు ఆలయ అభివృద్ధి కమిటీ సంయుక్త కార్యదర్శి ఎన్.సింగారావు సమక్షంలో ఆ బంగారు గొలుసును భద్రంగా అందజేశారు.

అందరికీ ఆదర్శం

సామాన్య స్వీపర్‌గా పనిచేస్తూ రోజువారీ కూలీతో జీవనం సాగించే కోటేశ్వరమ్మ, మూడు లక్షల విలువైన బంగారాన్ని చూసి కూడా ఆశపడకపోవడం గమనార్హం. “మనది కాని వస్తువు మన దగ్గర ఉండకూడదు, అది ఆ స్వామిదే” అని ఆమె చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. అధికారులు మరియు స్థానికులు కోటేశ్వరమ్మను శాలువాతో సత్కరించి, ఆమెకు నగదు బహుమతిని అందజేశారు. ఈ ఘటన ద్వారా సమాజానికి ఒక గొప్ప సందేశం అందింది. హోదా, డబ్బు కంటే వ్యక్తిత్వం మరియు నిజాయతీ గొప్పవని కోటేశ్వరమ్మ నిరూపించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *