Last Updated:
పలమనేరు లో AmaranaathaReddy రూ 8.72 కోట్లు తో ఆరోగ్య సదుపాయాలు, 52 Village Clinics Urban Health Centres, వాటర్ గ్రిడ్ తో తాగునీటి శాశ్వత పరిష్కారం.
ప్రజలందరికీ మెరుగైన ఆరోగ్యం, స్వచ్ఛమైన తాగునీరు అందించడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని పలమనేరు శాసనసభ్యులు అమరనాథరెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం పలమనేరు మున్సిపల్ పరిధిలో ఆయన సుడిగాలి పర్యటన చేస్తూ, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. సుమారు రూ. 8.72 కోట్ల వ్యయంతో నియోజకవర్గంలో వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
పలమనేరు గంటావూరు కాలనీలో రూ. 91 లక్షల వ్యయంతో నిర్మించిన అత్యాధునిక అర్బన్ హెల్త్ సెంటర్ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నియోజకవర్గవ్యాప్తంగా 52 విలేజ్ క్లినిక్‌లు, అర్బన్ హెల్త్ సెంటర్ల ఏర్పాటు కోసం రూ. 8.72 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఈ హెల్త్ సెంటర్లలో ప్రజలకు దాదాపు 70 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉంటాయి. కార్పొరేట్ స్థాయి వైద్యం పేదలకు వారి ముంగిటకే అందించాలనే సంకల్పంతో ఈ కేంద్రాలను తీర్చిదిద్దినట్లు ఆయన పేర్కొన్నారు.
పలమనేరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా రూ. 2600 నుంచి 2700 కోట్ల భారీ వ్యయంతో ‘వాటర్ గ్రిడ్’ పథకాన్ని అమలు చేస్తున్నట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ బృహత్తర ప్రాజెక్టు ద్వారా నియోజకవర్గంలోని ప్రతి పల్లెకు, పట్టణంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
పట్టణ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించిన ఎమ్మెల్యే, పలు కీలక పనులకు భూమి పూజ మరియు ప్రారంభోత్సవాలు చేశారు. రాధా బంగ్లా, గంటావూరు ప్రాంతాల్లో దీర్ఘకాలంగా వేధిస్తున్న లో-వోల్టేజ్ సమస్యను పరిష్కరిస్తూ నూతన ట్రాన్స్‌ఫార్మర్‌లను ప్రారంభించారు. సిల్క్ ఫార్మ్ వద్ద నూతన బోరు మోటార్‌ను, జూనియర్ కళాశాల వద్ద వాటర్ సంపు నిర్మాణానికి భూమి పూజ చేశారు. బాపూజీ ఉద్యానవనంలో ప్రజల సౌకర్యార్థం పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. త్వరలోనే పట్టణంలో రూ. 3.5 కోట్లతో రహదారులను నిర్మించనున్నామని, ఇందులో అత్యధిక భాగం గంటావూరు ప్రాంత అభివృద్ధికి కేటాయించనున్నట్లు ప్రకటించారు.
అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, పట్టణంలో అన్ని మౌలిక సదుపాయాలను అంచలంచలుగా పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అమరనాథరెడ్డి భరోసా ఇచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సంక్షేమ పథకాలను, అభివృద్ధి పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో పలమనేరు ఆర్డీఓ భవాని, మున్సిపల్ కమిషనర్ వీ రమణా రెడ్డి, అడిషనల్ డీఎం అండ్ హెచ్‌ఓ వెంకట ప్రసాద్‌తో పాటు పలువురు కూటమి నాయకులు, వివిధ శాఖల అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములైన అధికారులను నాయకులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
Mar 27, 2026 10:32 PM IST


