Tribal villages: గిరిజన పల్లెలకు మహర్దశ.. పార్వతీపురం మన్యం జిల్లాలో త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం! |


Last Updated:

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర రెడ్డి డోలీ యాత్ర ప్రారంభం, గిరిజన ప్రాంతాల్లో రోడ్ల పనులు పరిశీలన, నాణ్యత లోపిస్తే అధికారులపై కఠిన చర్యలు.

పార్వతీపురం మన్యం జిల్లాలో  త్వరలో 'డోలీ యాత్ర' ప్రారంభం 
పార్వతీపురం మన్యం జిల్లాలో  త్వరలో ‘డోలీ యాత్ర’ ప్రారంభం 

స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ అనేక గిరిజన గ్రామాలు సరైన రహదారి సౌకర్యం లేక అల్లాడుతున్నాయి. అత్యవసర సమయాల్లో గర్భిణీలను, రోగులను మంచాల మీద మోసుకుంటూ కిలోమీటర్ల మేర నడవాల్సిన దుస్థితిని అంతం చేసేందుకు పార్వతీపురం మన్యం జిల్లా యంత్రాంగం నడుం బిగించింది. జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో రవాణా కష్టాలను శాశ్వతంగా తొలగించే లక్ష్యంతో ‘డోలీ యాత్ర’ను ప్రారంభించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డి వెల్లడించారు.

ఏమిటీ ‘డోలీ యాత్ర’?

జిల్లాలో అనేక గ్రామాలు నేటికీ కొండలు, వాగుల మధ్య ఉండి, సాధారణ వాహనాలు వెళ్లేందుకు వీలు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణానికి భారీగా నిధులు మంజూరు చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో పనులు ఏ మేరకు జరిగాయో స్వయంగా పరిశీలించడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశ్యం. జిల్లా కలెక్టర్ గారు అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ఇప్పటికే జిల్లాలోని అన్ని డోలీ రోడ్ల ప్రాంతాలకు మంజూరు ఉత్తర్వులు జారీ చేశామని స్పష్టం చేశారు.

రహదారి పనుల్లో నాణ్యత లోపిస్తే లేదా నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారినైనా సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. నిధులు మంజూరైన పనులను పరిశీలించడానికి తాను స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని, ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కలెక్టర్ తెలిపారు.

నిర్ణీత గడువులోగా పనులు పూర్తి కాకపోయినా, నిధులు ఉన్నప్పటికీ పనులు అసంపూర్తిగా ఉన్నా సంబంధిత ఇంజినీరింగ్ అధికారులనే బాధ్యులను చేస్తూ శాఖాపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు జరగాలని, గిరిజనులకు నాణ్యమైన రోడ్లు అందేలా చూడాలని ఆదేశించారు.

ఈ ‘డోలీ యాత్ర’ ద్వారా గిరిజన, మారుమూల గ్రామాల్లో అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే ప్రధాన లక్ష్యమని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. ముఖ్యంగా వైద్య సేవల కోసం గిరిజనులు పడుతున్న అవస్థలు ఈ రోడ్ల నిర్మాణంతో తొలిగిపోనున్నాయి. ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి ప్రతి అధికారి బాధ్యతగా చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.

ఈ కీలక సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, సబ్ కలెక్టర్లు ఆర్. వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్ తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు, అటవీ శాఖ అనుమతులు, నిధుల వినియోగంపై కలెక్టర్ సుదీర్ఘంగా చర్చించారు.

Click here to add News18 as your preferred news source on Google.

ఆంధ్రప్రదేశ్‌లోని ముఖ్యమైన వార్తలు, లేటెస్ట్ న్యూస్, స్థానిక వార్తలు, ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ప్రకటనలు, అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు ఆంధ్రప్రదేశ్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *